పల్లెల్లో స్పెషల్​ ఆఫీసర్ల పాలన షురూ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

పల్లెల్లో స్పెషల్​ ఆఫీసర్ల పాలన షురూ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఇయ్యాల బాధ్యతలు చేపట్టనున్న అధికారులు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఒక్కో అధికారికి రెండు మూడు జీపీల బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం గురువారం ముగిసింది. శుక్రవారం నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. అధికారులు వారికి కేటాయించిన గ్రామ పంచాయతీల్లో శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు వీలు కల్పిస్తూ గురువారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్లుగా వివిధ శాఖల్లో పని చేస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీల నిర్వహణ బాధ్యతలు చూసుకోనున్నారు.

పోలీస్ డిపార్ట్ మెంట్ మినహా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎడ్యుకేషన్, విద్యుత్, ఆర్ అండ్ బీ తో పాటు పలు శాఖల్లో పనిచేస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు నియమించారు. రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా అయిన మేడ్చల్​లో 5 మండలాల్లో 61 గ్రామ పంచాయతీలకు కొన్ని చోట్ల జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచుల నుంచి రికార్డులు, డిజిటల్ కీ లు సెక్రటరీలు స్వాధీనం చేసుకున్నారు. పదవీకాలం ముగియటంతో గురువారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లను గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఐదేండ్ల పదవీకాలంలో తమకు సహకరించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ లు ధన్యవాదాలు తెలిపారు.