పాలమూరు ప్రాజెక్టులపై కదలిక..పదేండ్లుగా 10 శాతం పనులు కంప్లీట్​ చేయని బీఆర్ఎస్ సర్కార్

పాలమూరు ప్రాజెక్టులపై కదలిక..పదేండ్లుగా 10 శాతం పనులు కంప్లీట్​ చేయని బీఆర్ఎస్ సర్కార్
  •     అసంపూర్తిగా మెయిన్​ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు
  •     పెండింగ్​ పనులపై దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్రంలో 75 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో పెండింగ్​ పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరు జిల్లాలో పెండింగ్​ ప్రాజెక్టులపై సర్కారు ఫోకస్​ పెట్టింది. జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా పెండింగ్​ పనుల వివరాలు సేకరిస్తోంది. రాష్ట్ర బడ్జెట్​ సమావేశాల్లో ఫండ్స్​ కేటాయించి, లక్ష్యం మేరకు ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్లాన్​ చేస్తోంది.

10 శాతం పనులు కంప్లీట్​ చేయలే..

జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్​​పాలమూరు జిల్లాకు సాగునీటిని అందించేందుకు స్కీమ్​లను అందుబాటులోకి తెచ్చారు. జూరాల, శ్రీశైలం బ్యాక్​ వాటర్​ ఆధారంగా మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్(ఎంజీకేఎల్ఐ), నెట్టెంపాడు, రాజీవ్​ భీమా స్కీమ్​లను ఏర్పాటు చేశారు. అప్పటికే అందుబాటులో ఉన్న కోయిల్​సాగర్​ రిజర్వాయర్​ కెపాసిటీని పెంచి అదనపు ఆయకట్టుకు సాగునీటిని అందించేలా కెనాల్స్​ డిజైన్​ చేశారు.

2014 నాటికి ఈ స్కీమ్​లలో దాదాపు 90 శాతం పనులు కంప్లీట్​ అయ్యాయి. రాష్ట్ర విభజన జరగడంతో మిగిలిన పది శాతం పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చేయాల్సిన పనులను గాలికొదిలేసి సాగునీటిని విడుదల చేసింది. తామే పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆన్​ గోయింగ్​ ప్రాజెక్టులను తీర్చిదిద్దామని రైతులు, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించింది.

ఈ పదేండ్లలో కేవలం 2 శాతం పనులను మాత్రమే కంప్లీట్​ చేసి చేతులు దులుపుకుంది. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్​ గవర్నమెంట్​ రావడంతో పాలమూరు ప్రాజెక్టుల పెండింగ్​ పనులపై దృష్టి పెట్టింది. బడ్జెట్​లో రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు నిధులు కేటాయించి రానున్న రెండేండ్లలో పెండింగ్​ పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

పదేండ్లుగా పెండింగ్​లో ఉన్న స్కీమ్​లు..
    
ఎంజీకేఎల్ఐలోని 28వ ప్యాకేజీ కింద కొల్లాపూర్​ నియోజకవర్గంలోని కోడేరు, పెద్దకొత్తపల్లి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. 29 ప్యాకేజీ కింద 58 కిలోమీటర్ల మేరకు కెనాల్స్​ పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ పనులు కంప్లీట్​ అయితే కల్వకుర్తి ప్రాంతంలోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 30వ ప్యాకేజీ కింద 23 కిలోమీటర్ల మేరకు కెనాల్స్​ పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితో అచ్చంపేట నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
    
నెట్టెంపాడు కింద మెయిన్​ కెనాల్, పిల్ల కాలువల పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మూడేండ్ల కింద ర్యాలంపాడు రిజర్వాయర్​కు పడిన బుంగకు రిపేర్లు చేయలేదు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్​ ఖాళీ అయింది.
     
కోయిల్​సాగర్​ కింద రైట్​ మెయిన్  కెనాల్​ పనులు పెండింగ్​లో ఉన్నాయి. 2014 నుంచి డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల పనులు టేకప్​ చేయలేదు. పుట్టగడ్డ, అప్పంపల్లి, చిత్తనూరు, కన్మనూరు, తండా, ఉందేకోడ్, ఎక్లాస్​పూర్, కుమార్​లింగంపల్లి గ్రామాల పరిధిలోని 18 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఉందేకోడ్​లోని నాలుగు గొలుసు కట్టు చెరువులు, ఎక్లాస్​పూర్, కుమార్​లింగంపల్లి గ్రామాల్లోని చెరువులను ఈ కెనాల్​ ద్వారా నింపాలని డిజైన్​లో ఉన్నా, లింక్​ కెనాల్​ పనులు
 చేయలేదు.

ALSO READ : బీఆర్‌‌‌‌ఎస్‌‌కు షాక్‌‌.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం

రాజీవ్​ భీమా ప్రాజెక్టు కింద సంగంబండ రిజర్వాయర్​ పరిధిలో ముంపు బాధితులకు రూ.13 కోట్ల పరిహారం చెల్లింపు పెండింగ్​లో ఉంది. లో లెవల్​ కెనాల్​ పనుల్లో 400 మీటర్ల బండరాయి అడ్డుగా ఉంది. ఈ పనులు ఎనిమిదేండ్లుగా పెండింగ్​లో ఉన్నాయి. ఈ బండరాయిని తొలిగిస్తే సంగంబండ, గుర్లపల్లి, వానాయకుంట, తిర్మలాపూర్​, దాసర్​దొడ్డి, ఓబులాపూర్​, వడ్వాట్​ గ్రామాల పరిధిలోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భూత్పూర్​ రిజర్వాయర్​ కింద రాజుపల్లి, నర్వ, రాంపూర్​, లంకాల గ్రామాలకు వెళ్లే కెనాల్​ పనులు అసంపూర్తిగా  ఉన్నాయి.