
- రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్
- వృద్ధాప్యంలో ఒంటరి భావన రావొద్దన్న ఆలోచనతో చర్యలు
- సెంటర్లలో వృద్ధుల కాలక్షేపం కోసం ఇండోర్‌గేమ్స్, యోగా, మెడిటేషన్
హైదరాబాద్, వెలుగు: వృద్ధాప్యంలో ఒంటరితనంతోపాటు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒంటరి అయిపోయామని మనోవేదన చెందకుండా వారికి చేయూతనిచ్చే దిశగా ముందుకెళ్తున్నది. సామాజిక సంరక్షణతోపాటు మానసిక ఉల్లాసానికి బాటలు వేసేలా డే కేర్ సెంటర్లను నిర్మించాలని భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో చాలామంది ఆలనా, పాలనా లేక ఆందోళన చెందుతున్నారు. తమను ఆదరించేవారు లేక.. బయటకు చెప్పుకోలేక మనోవేదనతో కుమిలిపోతున్నారు. కనీసం యోగ క్షేమాలు అడిగేవారు లేకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో 60 ఏళ్ల వయస్సు పైబడినవారికి కాలక్షేపంతోపాటు వారి మంచి చెడులు చూడటం, సామాజిక సంరక్షణ బాధ్యతతోపాటు మానసికోల్లాసానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
వృద్ధులను ఒంటరితనం నుంచి దూరం చేయడమే కాకుండా ఆహ్లాదకర వాతావరణంలో సందడి చేసేలా ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ఏమైనా ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయా? వాటికి రిపేర్లు చేస్తే వృద్ధులకు సౌకర్యాలు కల్పించవచ్చా? అని ఆరా తీస్తోంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో ఖాళీ భవనాల వివరాలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. అయితే, భవనాలు లేనిచోట కొత్తవి నిర్మించాలా? అద్దె భవనాలు తీసుకుని ఈ సెంటర్స్ ఏర్పాటు చేయాలా? అనేదానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రోజంతా ఉల్లాసంగా గడిపేలా..
ప్రస్తుత సమాజంలో అందరివీ ఉరుకులు పరుగుల జీవితాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ ఏదోఒక పనిలో బిజీగా ఉంటున్నారు. ఇంట్లో కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు ఉంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. మనవళ్లు, మనవరాళ్లు స్కూల్, కాలేజీకి వెళ్తారు. దీంతో ఇంట్లో వృద్ధులు ఒంటరి జీవితంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి బాసటగా నిలిచేందుకు డే కేర్సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సెంటర్లలో రోజంతా హాయిగా కాలక్షేపం చేసేలా, ఇతర సీనియర్ సిటిజన్లతో సరదాగా మాట్లాడుకునే వాతావరణం కల్పించనున్నది.
క్యారమ్స్, చెస్, ఇతర ఇండోర్ గేమ్స్ కు ఏర్పాట్లు చేయనున్నది. కథల పుస్తకాలు, న్యూస్‌పేపర్లు కూడా అందుబాటులో ఉంచనున్నది. ఉదయం, సాయంత్రం యోగా, మెడిటేషన్చేసుకునే వెసులుబాటు సైతం కల్పించనున్నారు. సేదతీరేందుకు చక్కని గార్డెనింగ్, పూల మొక్కలు పెంచనున్నారు. వీల్‌చైర్స్, యాక్సెస్, ర్యాంప్‌లు, సులభంగా నడవడానికి తగిన సౌకర్యాలు కల్పించనున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం అలర్ట్ సిస్టమ్‌లు, అగ్నినివారణ చర్యలు కూడా తీసుకోనున్నారు. మానసిక వేదన, భావోద్వేగానికి లోనయ్యేవారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మానసిక ఆరోగ్య సలహాలు, ఒంటరితనం, డిప్రెషన్‌ను తగ్గించే కార్యకలాపాలు సైతం సర్కారు చేపట్టనున్నది.
రోజువారీ ఆరోగ్య పరీక్షలు
వృద్ధులు ఒంటరితనంతోపాటు బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. హాస్పిటల్ కు వెళ్లలేక కొందరు, వైద్యం చేయించుకునే స్థోమత లేక మరికొందరు అవస్థలు పడుతుంటారు. ఇలాంటివారి కోసం డే కేర్ సెంటర్లలో రోజువారీ ఆరోగ్య పరీక్షలు (బీపీ, షుగర్ లెవెల్స్, తదితర పరీక్షలు) చేయనున్నారు. వృద్ధాప్యం దరి చేరిన తర్వాత సహజంగా మతిమరుపు వస్తుంది. అందుకే టైం టు టైం మందులు ఇవ్వడంతోపాటు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఇతర రిహాబిలిటేషన్ సేవలు అందించనున్నారు. విశ్రాంతి కోసం సౌకర్యవంతమైన సీటింగ్, నిద్ర పోయేందుకు పడకలు, టీవీ, లైబ్రరీ, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. కానీ, ప్రభుత్వ డే కేర్ సెంటర్లు లేవు. రాష్ట్ర ప్రభుత్వం తమ కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుండటంపై సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.