టీచర్ల ప్రమోషన్లకు విద్యాశాఖ రెడీ.. ఈ రూల్తో 80వేల మంది బదిలీలకు దూరం !

టీచర్ల ప్రమోషన్లకు విద్యాశాఖ రెడీ.. ఈ రూల్తో 80వేల మంది బదిలీలకు దూరం !
  • హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు 
  • బదిలీల నిర్వహణకు ‘రెండేండ్ల సర్వీస్’ ఇబ్బందులు 
  • ఈ రూల్​తో 80వేల మంది బదిలీలకు దూరం 

హైదరాబాద్,వెలుగు:  రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు త్వరలోనే ప్రమోషన్లు కల్పించేందుకు సర్కారు సమాలోచనలు చేస్తోంది. హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్కారు పర్మిషన్ ఇస్తే.. షెడ్యూల్​ ఇచ్చిన వారంలోనే ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, బదిలీలు, ప్రమోషన్లు ఒకేసారి చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా, ఇంకా ఎంలాటి నిర్ణయం తీసుకోలేదు.

 స్టేట్​లోని సర్కారు బడుల్లో 1.10 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. కాగా, 2023 సెప్టెంబర్, అక్టోబర్ లో మల్టీజోన్ 1 పరిధిలోని హెడ్మాస్టర్ల బదిలీలు, ఆ పోస్టులకు ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు జరిగాయి. ఆ తర్వాత కోర్టు కేసులతో ఆగిపోయాయి. మళ్లీ 2024 జూన్/ జులై నెలల్లో మల్టీజోన్ 2 పరిధిలోని హెడ్మాస్టర్లకు ప్రమోషన్లు, బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, ప్రమోషన్లు, ఎస్​జీటీల బదిలీలు జరిగాయి. 

ఈ ప్రక్రియలో సుమారు 47వేల మందికి ట్రాన్స్ ఫర్లు, సమారు 21వేల మంది ప్రమోషన్లు, మరో 2వేల మంది మ్యూచువల్, స్పౌజ్ ఇతర కేటగిరీల్లో ఉన్నారు. గతేడాది కొత్తగా 10 వేలమంది టీచర్లు వచ్చారు. ఈ లెక్కన సుమారు 80 వేల మంది బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. దీనికి బదిలీలకు కనీసం రెండేండ్ల సర్వీస్ ఉండాలనే నిబంధన కారణం. మరో పక్క మూడేండ్ల సర్వీస్ ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంది. దీంతో ప్రమోషన్లు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.