వానాకాలంలో ఆరుతడి పంటలవైపు! రైతులను పప్పులు, నూనెగింజలవైపు మళ్లించాలని సర్కారు యోచన

 వానాకాలంలో  ఆరుతడి పంటలవైపు! రైతులను పప్పులు, నూనెగింజలవైపు మళ్లించాలని సర్కారు యోచన
  •  
  • రైతులను పప్పులు, నూనెగింజలవైపు మళ్లించాలని సర్కారు యోచన
  • ఈసారి వర్షాలు తక్కువుంటాయని ఐఎండీ అంచనా
  • ఎల్ నినోతో కరువు పరిస్థితులు
  • వరిసాగు పెరిగితే కష్టాలు.. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం వెనకడుగు

హైదరాబాద్, వెలుగు:  నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుండటం, పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఈసారి వానాకాలం సాగుపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాలు కలవరపెడుతున్నాయి. మే చివరలోనే కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 4 లేదా 5వ తేదీకి రావచ్చని ఐఎండీ అంచనాలను సవరించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ ఎల్‌నినో ప్రభావం రాబోయే ఐదేళ్లపాటు, అంటే 2027 జనవరి వరకు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీగా నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగు వైపు రైతాంగం మొగ్గు చూపడం శ్రేయస్కరమని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని సాగు విస్తీర్ణాన్ని, అందుబాటులో ఉన్న వనరులను బట్టి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఒక డిగ్రీ పెరిగితే.. 10 శాతం దిగుబడికి కోత 

వాతావరణ మార్పుల వల్ల సంభవించే ఈ సంక్షోభం వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగినా పంట దిగుబడి 10 శాతం వరకు తగ్గుతుందని, ఇది దేశ ఆహార భద్రతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్‌కాయిస్) సైతం ఎల్‌నినో ప్రభావంపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులు 2015 నాటి తీవ్ర కరువు పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయని, ఇది సూపర్ ఎల్‌నినోగా మారే ముప్పు ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. వానలు పడాల్సిన సమయంలో పడకుండా, అనవసర సమయంలో కురిసి పంటలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. గతంలో 2015లో వాతావరణ శాఖ 93 శాతం వర్షపాతాన్ని అంచనా వేయగా, వాస్తవంగా 86 శాతమే కురిసి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి కూడా ప్రాథమికంగా 92 శాతం వర్షపాతాన్ని అంచనా వేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొంటున్నారు.


ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం బ్రేక్.. 
ట్రేడ్ డీల్స్​తో గడ్డుకాలం  

ఒకవైపు వాతావరణ సవాళ్లు.. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర, కొనుగోళ్లు లభించడం కూడా ఈసారి సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే బియ్యం నిల్వలు అధికంగా ఉండటంతో ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. మార్కెట్ పరిస్థితులు మరోవైపు రైతులను కృంగదీస్తున్నాయి. అవసరానికి మించి వరి సాగు పెరిగితే భవిష్యత్తులో విక్రయాల పరంగా తీవ్ర నష్టాలు తప్పవన్న ఆందోళనలు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి, ఎఫ్‌సీఐ ద్వారా సేకరించే బియ్యం కోటాపై పరిమితులు విధించడం రైతులకు శాపంగా మారాయి. పైగా, అమెరికాతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల (ట్రేడ్ డీల్స్) వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు చౌకగా మన దేశంలోకి వచ్చే అవకాశం ఉండటంతో దేశీయ మార్కెట్ గడ్డుకాలాన్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.  ఈ మార్కెట్ ఒడుదొడుకుల వల్ల వరి పండించిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందుకే డిమాండ్ లేని పంటల కంటే మార్కెట్ లో నిరంతర ఆదరణ ఉండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడమే శ్రేయస్కరమని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.  

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్.. ఆరుతడి, పప్పు ధాన్యాలే మేలు

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో కోటి 34 లక్షల 66 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగును లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలకు బదులుగా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఏకంగా 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ముందస్తుగా సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని 52 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని ప్రణాళికలు రూపొందించింది. నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే గోదాములపై దాడులు ముమ్మరం చేశాయి. కరువును తట్టుకునే విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు, నీటి  వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహించాలని, పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని యంత్రాంగం భావిస్తోంది. మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండి, కేంద్రం నుంచి కూడా మంచి మద్దతు ధర లభించే పప్పులు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని సర్కారు యోచనలో ఉంది. కంది, పెసర, మినుములతోపాటు వేరుశనగ వంటి నూనెగింజల పంటలకు తక్కువ నీరు సరిపోవడమే కాకుండా, భూమి సారవంతం కావడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. వర్షాభావ పరిస్థితులను, అంతర్జాతీయ సవాళ్లను అధిగమించాలంటే రైతాంగం ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరుతడి పంటల సాగుతోనే లాభాల బాట పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఆలస్యం చేయకుండా ముందస్తుగానే ఆ రకంగా సిద్ధం కావాలని చెబుతున్నారు.