పోడు పట్టాలు కొందరికే..11,800 మంది దరఖాస్తు చేసుకుంటే 1,950 మందికే ఇస్తరట

పోడు పట్టాలు కొందరికే..11,800 మంది దరఖాస్తు చేసుకుంటే 1,950 మందికే ఇస్తరట

నాగర్ కర్నూల్, వెలుగు: పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పిస్తామని రెండేండ్లుగా చెబుతున్న సర్కారు అప్లై చేసుకున్న వారిలో కొందరికే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్​ కర్నూల్​ డివిజన్లలో 37,482 ఎకరాలకు 11,800 మంది  దరఖాస్తు చేసుకుంటే 1,950 మందికి మాత్రమే పట్టాలిస్తామని అధికారులు అంటున్నారు. ఎన్ని ఎకరాలు, ఎక్కడ ఇస్తారనే వివరాలను సీక్రెట్​గా ఉంచుతున్నారు. 

ఇదిలా ఉంటే చెంచుపెంటలను తరలించే రీలొకేషన్​ స్కీం కత్తి గిరిజనుల మెడపై వేలాడుతోంది.  అమ్రాబాద్​ మండలంలోని వటవర్లపల్లి గ్రామంలో 1,200 కుటుంబాలు ఉంటే సగం కుటుంబాలు ప్రభుత్వం ప్రకటించిన రీలొకేషన్ ప్యాకేజీకి అంగీకరించాయి. పోడు భూములకు పట్టాలు వస్తాయనే నమ్మకం లేక  చెంచులు, గిరిజనులు ఊరు విడిచి వెళ్లడానికి సిద్ధం కావడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. 18,678 ఎకరాలకు 5,331 మంది గిరిజనులు, 18,803 ఎకరాలకు 5,918 గిరిజనేతరులు అప్లై చేసుకున్నారు. ఆన్​లైన్​లో వచ్చిన అప్లికేషన్స్​ను గ్రామ కమిటీ పరిశీలన తర్వాత  రెవెన్యూ, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్లు జాయింట్​ సర్వే చేయాలని ఆదేశించారు. జాయింట్  సర్వే పరిస్థితి ఏమిటో బయటపెట్టలేదు. 

అన్నీ ఆటంకాలే.. 

అప్లికేషన్స్ ఆన్​లైన్​లో ఎంటర్​ చేయడానికి సాంకేతిక సమస్యలు రావడంతో కొంత కాలం పక్కకు పెట్టారు. ఈ సమస్య దూరమైన తర్వాత డివిజన్  లెవల్​ కమిటీ నుంచి జిల్లా కమిటీకి చేరిన అప్లికేషన్స్​లో ఏ ప్రాతిపదికన 1,950 మందిని ఎంపిక చేశారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 24న పట్టాలిస్తామని ప్రకటించడంతో తమకు పట్టాలు వస్తాయో, రావో అని భయపడుతన్నారు. ఈసారి హక్కులు దక్కకపోతే భూమితో పాటు అడవికి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు సాగుకు అర్హులు కాని వారిని అడవి నుంచి బయటకు పంపించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించడంతో పట్టాలు రాని వారి పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. 

మాకు న్యాయం చేయండి..

తాతల కాలం నుంచి ఈ భూములనే నమ్ముకొని బతుకుతున్నాం. కలెక్టర్​ను కలిసి మా గోడు వెళ్లబోసుకున్నాం. గ్రామ కమిటీలో మాకు  అన్యాయం చేస్తున్నారని కలెక్టర్​కు చెప్పినం. మేము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి న్యాయం చేయాలి.
- గోబ్రానాయక్, చిట్లంకుంట తాండా, అచ్చంపేట మండలం