బడ్జెట్ టార్గెట్ ఆరు గ్యారంటీలు..పథకాల అమలే లక్ష్యంగా అంచనాలు

బడ్జెట్ టార్గెట్ ఆరు గ్యారంటీలు..పథకాల అమలే లక్ష్యంగా అంచనాలు
  • ఏ స్కీమ్​కు ఎంత అనే దానిపై పక్కాగా లెక్కలు
  • దాదాపు రూ.90 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా 

హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25) బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తున్నది. ప్రతి స్కీమ్​కూ తగినన్ని నిధులు కేటాయించేలా పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది. ఇప్పటికే అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి బడ్జెట్ ​అంచనాలను ఆర్థిక శాఖ తెప్పించుకున్నది. పథకాల అమలు కోసం ఏ మేరకు కేటాయింపులు చేయాలనేదానిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించారు.

ఆరు గ్యారంటీల అమలుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్​ కమిటీ కూడా ఎంత మేరకు నిధులు అవసరమవుతాయనేదానిపై ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేసిన ప్రభుత్వం.. అందులో ఐదు గ్యారంటీలకు ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలను సెపరేట్​ చేస్తున్నది. 

దీంతో ఎంత మందికి ఏ గ్యారంటీని అమలు చేయాల్సి వస్తుంది? అందుకోసం ఏడాదికి ఎన్ని నిధులు అవసరమవుతాయనేది తెలియనుంది. గ్యారంటీల అమలుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండడంతో ఎంత మంది లబ్ధిదారులు ఉంటారనే దానిపై స్పష్టత వచ్చింది. కొత్తగా రేషన్​కార్డుల కోసం ఎంత మంది అప్లై చేసుకున్నారనే వివరాలు కూడా తెలియడంతో బడ్జెట్​లో పథకాల అమలుకు ఎన్ని నిధులు కేటాయించాలనే దానిపై ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేశారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల మేరకు 5 గ్యారంటీల అమలుకు దాదాపు రూ.90 వేల కోట్లు అవసరం కానున్నాయి. వీటికి అదనంగా యువ వికాసం పథకానికి నిధులు కేటాయించాల్సి ఉంది. 

దేనికి ఎంతంటే.. 

ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపులు తగ్గకూడదని అధికారులకు రాష్ట్ర సర్కార్​ఇప్పటికే స్పష్టం చేసింది. అర్హులకు పథకాలు అమలు చేసేలా బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు రూ.2,500 ఇవ్వాల్సి ఉంది. దీనికి దాదాపు రూ.10 వేల కోట్లు, ఉచిత బస్సు ప్రయాణానికి ఏటా రూ.2,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. రూ.500కే గ్యాస్​ సిలిండర్ అందించాల్సి ఉంది. ప్రస్తుతమున్న వినియోగాన్ని బట్టి లబ్ధిదారులకు ఏటా సగటున 6 నుంచి 7 సిలిండర్లు రూ.500కు ఇస్తే.. ప్రభుత్వంపై రూ.3,500 కోట్ల మేర భారం పడనుంది.

ఈ మేరకు బడ్జెట్​లో కేటాయింపులు చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరాకు పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన దీనికి దాదాపు రూ.22 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. జాబ్ కార్డు ఉన్న వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.7 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాల్సి ఉన్నది.

దీనికి రూ.15 వేల కోట్లు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించారు. దీనికి రూ.8 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల వరకు కావాలని అంచనా వేస్తున్నారు. చేయూత పథకం కింద ఇవ్వాల్సిన పింఛన్లు గతంతో పోలిస్తే డబుల్​ అయ్యాయి. ఈ లెక్కన వీటికి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక ‘యువ వికాసం’ గ్యారంటీ అమలు కోసం రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర కేటాయింపులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

‘కోటి’ లెక్కన అంచనాలు.. 

ప్రజా పాలనలో భాగంగా గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర సర్కార్ ​అప్లికేషన్లు తీసుకోగా, కోటి దరఖాస్తులు వచ్చాయి. పథకాల అమలుకు ప్రభుత్వం రేషన్ ​కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 91 లక్షల రేషన్​ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డులు ఇస్తే  ఇంకో 10–15 లక్షలు పెరగనున్నాయి. దీంతో ప్రభుత్వం కోటి కార్డులు లెక్క కడుతోంది. ఈ నేపథ్యంలో వివిధ స్కీమ్​ల అమలు కోసం కోటి సంఖ్యను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్నది.

దీని ఆధారంగానే నిధుల కేటాయింపు చేయనుంది. ఉదాహరణకు గ్యాస్​సిలిండర్ ​విషయానికొస్తే రేషన్ ​కార్డు ఉన్న వాళ్లకే ఇవ్వనుంది. కోటి మంది లబ్ధిదారులకు ఏటా 6–7 సిలిండర్లు ఇస్తే, మొత్తం 6–7 కోట్ల సిలిండర్లు అవసరమవుతాయి. ఒక్కోదానికి యావరేజ్ గా రూ.450 నుంచి రూ.500 వరకు ప్రభుత్వం చెల్లించనుంది. అంటే ఈ పథకం అమలుకు రూ.3,500 కోట్లు అవసరం అవుతాయి. రాష్ట్రంలో కోటి 82 లక్షల కరెంట్ ​కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇతర కమర్షియల్ ​కనెక్షన్లు తీసేస్తే.. మిగిలినవి దాదాపు కోటి వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ కోటి కనెక్షన్లలో ఎంతమంది 200 యూనిట్లలోపు కరెంట్​వాడితే, అంతమందికి చెందిన కరెంట్ ​బిల్లులను ప్రభుత్వం డిస్కమ్​లకు చెల్లిస్తుంది.