ఎందుకీ సాగిలపడటం?.. ఎఐఎస్‌ అధికారులకు ప్రభుత్వం చరిచి చెప్పిన సందర్భం

ఎందుకీ సాగిలపడటం?.. ఎఐఎస్‌ అధికారులకు ప్రభుత్వం చరిచి చెప్పిన సందర్భం

‘మీకు వెన్నెముక ఉంది గుర్తెరగండి, దాన్ని నిటారుగా ఉంచుకోండి’ అని అఖిల భారత సర్వీసు (ఎఐఎస్‌) అధికారులకు ప్రభుత్వం చరిచి చెప్పిన సందర్భం! కొందరు అధికారులు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? అంటే, వారిలోని బానిస మనస్తత్వం లేదా పెచ్చుమీరిన స్వార్థం. ఇంతకు మించి ఇంకో బలమైన కారణమేదీ కనిపించదు. ముఖ్యమంత్రి కాళ్లకు పబ్లిక్‌గా దండాలు పెట్టడమో, నాయకుల కాళ్ల వద్ద కూర్చొని వినయంగా సేవలందించడమో, మైక్‌ తీసుకొని వేనోళ్ల పొగడటమో.. ఎందుకివన్నీ అనే ప్రశ్న సామాన్యులకూ కలుగుతుంది. 

చివరకు ‘మాన్యుల’ కు కూడా అది చీదరింపు కలిగించిన ఫలితమే తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి తాజాగా విడుదల చేసిన మెమో! ‘మీ హోదాకు భంగం కలిగించనంత హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరించండి, లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంద’ని హెచ్చరించాల్సి వచ్చింది. పబ్లిక్‌లోనే కాదు ఆఫీసుల్లోనూ ఇలా సాగిలపడే, గుడ్డిగా చట్టాలను ఉల్లంఘించే అధికారులెందరో! అలాంటివారిలోనూ ఈ మెమో మార్పు తెస్తుందా?  ఒక జఠిల ప్రశ్న.


ప్ర భుత్వ విధానాల అమలులో, పరిపాలన సాగించడంలో  అఖిల భారత సర్వీస్‌ (ఎఐఎస్‌) అధికారులదే కీలక పాత్ర. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌ వంటి వివిధ హోదా సర్వీసులన్నీ ఇందులోకే వస్తాయి. అంతకన్నా కొంచెం దిగువ స్థాయిలో రాష్ట్ర సర్వీసు అధికారులుంటారు. గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ టూ.. అలా అదో క్రమం. అందులోనూ అనుభవం గడించి, సీనియర్లయినవారు, అర్హతలను బట్టి అఖిల భారత సర్వీసు అధికారులుగా పదోన్నతి పొందుతారు. హోదా, సామర్థ్యం, అనుభవం ఆధారంగా పలు విభాగాధిపతులుగా, వివిధ శాఖల ముఖ్య బాధ్యులుగా అఖిల భారత సర్వీస్‌ అధికారులే ఉంటారు. రాజ్యాంగంలోని కీలక అంగాలయిన శాసన, న్యాయ వ్యవస్థలకు తోడుగా ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలు, వివిధ పాలనా ప్రక్రియల్ని నడిపించే కార్యనిర్వాహక వ్యవస్థ అంతా అధికారులే! 

సీఎస్​ హెచ్చరిక 

అధికారులు వారి హోదాకు, స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని, భిన్నంగా చౌకబారుగా వ్యవహరిస్తే వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సడలుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అలా ప్రవర్తిస్తే, సర్వీసు నిబంధనల ఉల్లంఘన కింద వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఒక మెమో జారీ చేశారు.  1968 సర్వీసు నిబంధనలు, రూల్‌ 3 (1) ప్రకారం ప్రతి ఐఏఎస్‌ అధికారీ నిజాయితీగా, విధుల పట్ల నిబద్దతతో, తన హోదా`స్థాయికి తగిన రీతిన ప్రవర్తించాలని గుర్తు చేశారు. ఎందుకీ మెమో ఇవ్వాల్సి వచ్చిందంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే కారణం. 

ఒక ఐఎఎస్‌ అధికారి పబ్లిక్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి కాళ్లు మొక్కేందుకు యత్నించారు. ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. ఇలా కొంతమంది అధికారులు స్వార్థంతోనో, అతి వినయమో, తెలియని లాలూచీతోనో వారి హోదాని, స్థాయిని చిన్నబుచ్చేలా వ్యవహరిస్తే ఆయా అధికారుల నిజాయితీపైన, సామర్థ్యంపైన ప్రజలకు సందేహం కలుగుతుందని, ఫలితంగా వ్యవస్థపైనే ప్రజలు విశ్వాసం కోల్పోతారనే భావనను ప్రభుత్వం వ్యక్తం చేసింది.

తరచూ జరుగుతోందిలా.. 

సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఒకరు బహిరంగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కేందుకు యత్నించినపుడు, సీఎం అడ్డుకొని వారించి ఆగ్రహించినట్లు తెలిసింది. ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కలెక్టర్‌ స్థాయి అధికారి ఒకరు ప్రజావేదికపైనే ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు. పదవీ విరమణ తర్వాత ఆయన సదరు పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు, పార్టీ టిక్కెట్టుపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వైద్యారోగ్య శాఖ రాష్ట్ర అధికారి ఒకరు సర్వీసులో ఉండగానే వేదికపై సీఎంకు పాదాభివందనం చేసి, ఆయనను దేవుడని పొగిడారు. 

అదేంటని అడిగితే, ‘ఒకసారి కాదు దేవుడని వేయిసార్లు అంటానని రెట్టించారు. ఎంతగా యత్నించినా పాపం ఆయనకు పాలకపక్షం తరపున అసెంబ్లీ టిక్కెట్టు రాలేదు, అది వేరే విషయం!  ఇంకో అధికారి, సీఎం తనయ పబ్లిక్‌గా కుర్చీలో కూర్చుంటే, ఆమె కుర్చీ పక్కన నేలమీద మోకాళ్లపై కూర్చొని కాగితాలందిస్తున్న దృశ్యం ప్రజాక్షేత్రంలో వైరల్‌ అయింది. ‘కొందరు అధికారుల్లో ఉండే బానిస మనస్తత్వమో, అలవిమాలిన స్వార్థమో? ఇందుకు కారణమై ఉండవచ్చ’ని మానసిక నిపుణులు చెబుతున్నారు. సర్వీసులో ఉండి నిస్సిగ్గుగా, ఇటువంటివి చేసే అధికారులకు ‘జనం ఏమనుకుంటారో?’ అనే బెంగ, బెరుకు ఏమీ ఉండవు. 

వారు చూపిన దారులున్నా..

అందరు అఖిల భారత సర్వీసు అధికారులు శంకరన్‌ లాగానో, వేణుగోపాల్​లాగానో ఉండాలని ఎవ్వరూ ఆశించరు. ఉంటారనీ జనం ఎవరూ అనుకోరు. అలా కొందరే ఉంటారని అందరికీ తెలుసు! ప్రభుత్వ అధికారులై ఉండి రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేయడం కాకుండా విస్తృత ప్రజా సమూహాలకు సేవ చేయడానికి వారు తమ జీవితాలను అంకితం చేస్తారు. ప్రతి ప్రభుత్వ విధానం వెనుక ఉండే రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టం ఉద్దేశలక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రజలకు, ముఖ్యంగా నిస్సహాయులైన సామాన్య ప్రజలకు పాలనా వ్యవస్థ నుంచి గరిష్ట ప్రయోజనం సిద్దించేలా వారు నిరంతరం కృషి చేశారు. 

అంతలా కాకపోయినా.. ఎంతో కొంత ప్రజాసేవకు, నిబంధనల మేర విధి నిర్వహణకు కట్టుబడి ఉండే అధికారులుంటారు.  సందర్భాలను బట్టి బయట ప్రచారం పొంది, నలుగురి దృష్టికి వచ్చే సచ్చీలురైన అధికారులు కొందరైతే, కనబడకుండా తమ మానాన తమ పని చేసుకుంటూ నిజాయితీగా, నాయకులకు వంగి సలాములు కొట్టకుండా, నిబంధనలకు లోబడి పనిచేసే అధికారులు మరికొందరు.  నిర్వహించాల్సిన బాధ్యతని అధికారులు సరిగా అర్థం చేసుకోవడం, అందుకనుగుణంగా పనిచేయడం,-చేయకపోవడాన్ని బట్టే ఇందులో వ్యత్యాసాలుంటాయి.

నిర్మొహమాటంగా నడుచుకున్నవారూ ఉన్నారు 

 కొంతమంది అధికారులైతే రాజకీయ నాయకులు ఎంత చెబితే అంత తు.చ తప్పకుండా, గుడ్డిగా చేసుకుపోయే తత్వంతో ఉంటారు. మంత్రో, ఎంపీనో, ఎమ్మెల్యేనో, కార్పొరేషన్‌  చైర్మనో, మరొకరో..... హోదా కలిగిన రాజకీయ నాయకుడు ఏదైనా అంశం నిబంధనలకు విరుద్దంగా చేయమని చెప్పినపుడు, అది తప్పు అని వారి దృష్టికి తీసుకురారు. ‘ఇది తప్పు, ఇలా చెయ్యడానికి నిబంధనలు ఒప్పుకోవు, ముఖ్యమంత్రిగా మీకున్న విశేషాధికారాలతో మీరు నిర్ణయం తీసుకోవచ్చేమో కానీ, నేనైతే దీన్ని దృవీకరించలేను, ఫైల్‌ వెనక్కి పంపుతున్నాను’ అని నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రికే ఎదురు చెప్పిన ఏవీఎస్‌ రెడ్డి లాంటి ఐఏఎస్‌ అధికారులు ఉండేవారు ఇదివరలో! ఎన్నికల విధుల్లో ఆచరణాత్మకంగా ఎన్నో సంస్కరణలు తెచ్చి, నిబంధనలు అతిక్రమించే రాజకీయనేతలు ఎంతటి స్థాయి వారైనా ఖాతరు చేయని శేషన్‌ వంటి అధికారుల గురించి అందరికీ తెలుసు. కార్తికేయన్‌, థామస్‌, కేల్కర్‌ వంటి జాతీయ స్థాయి అధికారులే కాకుండా నటరాజన్‌, ఛాయారతన్‌, నాగిరెడ్డి వంటి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ముక్కుసూటితనం, నిబద్దత కలిగిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. వారు ఏ రాజకీయ వ్యవస్థకూ ఊడిగం చేయలేదు.

తేడా ఎందుకొస్తోంది?

ఎంపికయ్యే అధికారులు, ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు, నియమితులయ్యే న్యాయమూర్తులు.. అందరూ రాజ్యాంగానికి, దాని పరిధిలోని చట్టాలు-, నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన ప్రజాసేవకులే! హోదాలు, అధికారాలు, విధి-బాధ్యతల్లోనే తప్ప వారు అందించాల్సిన ప్రజాసేవ విషయంలో హెచ్చుతగ్గులు లేవు. ఎవరూ ఎవరికీ లోకువై ఉండాల్సిన అవసరం లేదు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు లోగడ ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం, ప్రజాధనం (పబ్లిక్‌ ఎక్చెకర్‌) నుంచి జీతం పొంది, పనిచేసే వారంతా ప్రజాసేవకులే! రాజ్యాంగానికి, శాసనం చేత నిర్మితమైన వ్యవస్థలకు విధేయులం తప్ప తాము రాజకీయ నాయకులకు కాదని అధికారులు గ్రహించాలి. 

ఆ గ్రహింపు లేక.. పొలిటికల్‌ బాస్‌ చెప్పిందల్లా చేయాలనే తప్పుడు భావన, బానిసతత్వం వల్లే తమ అధికారిక హోదాలను చిన్నబుచ్చే, గౌరవానికి భంగం కలిగించే చేష్టలకు వారు తలపడుతున్నారు. నిబంధనలకి కట్టుబడ్డ వారిని నాయకులేం చేయగలరు? మహా అంటే దూరప్రాంతానికో, అప్రాధాన్య పోస్టుల్లోకో బదిలీ చేయడం తప్ప ఇంకేమీ చేయలేరని 
అధికారులు గ్రహించాలి.

అధికారులు క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కొని జైలు పాలు అవడం, ఈ అనవసరపు సాగిలబాటో, అవినీతిలో భాగమవడమో! అలా కాకుండా .. తమకు వెన్నెముక ఉందని, దాన్ని నిటారుగా ఉంచుకోవాలనీ గ్రహించినపుడే రాజ్యాంగం ఆశించిన సేవల్ని వారు ప్రజలకు అందించగలుగుతారు.

- ఆర్​. దిలీప్ రెడ్డి 
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్