రెండేళ్లలో రూ.5 వేల కోట్ల భూములమ్మిన సర్కార్

V6 Velugu Posted on May 14, 2022

  • రెండేండ్లలో రూ.5 వేల కోట్ల భూముల అమ్మకం
  • వరుసగా స్వగృహ, హౌసింగ్​ బోర్డు ఆస్తులు సేల్​
  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్లాన్​
  • రూ. 4 లక్షల కోట్లు దాటిపోయిన అప్పులు 
  • ఈ రెండింటి మీదనే రాష్ట్ర సర్కారు నజర్​

హైదరాబాద్, వెలుగు: అయితే అప్పులు తీసుకోవటం.. లేకుంటే ఆస్తులు అమ్మడం.. రెండింటిపైనే రాష్ట్ర సర్కార్​ ఫోకస్ పెట్టింది. ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇచ్చేందుకు కటకట ఏర్పడటంతో ఎక్కడెక్కడ భూములను అమ్మాలి, ఏమేం ఆస్తులు అమ్మాలనే దానిపై ప్లాన్లు స్పీడప్ చేసింది. గత రెండేండ్లలోనే  రూ. 5వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులను ప్రభుత్వం అమ్మేసింది. ఇంతకంటే మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఈ ఏడాదిలో భూముల ద్వారా సమకూర్చుకోవాలని డిసైడ్​ అయింది. అందుకే హైదరాబాద్​తో పాటు అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ భూములతో పాటు హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, డెక్కన్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్​ భూములు, ఆస్తుల వేలానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చేసింది.  ఈ ఆర్థిక సంవత్సరంలో భూములు, ఆస్తుల అమ్మకం  ద్వారా రూ.15,500 కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం మొదట టార్గెట్ పెట్టుకున్నది. అయితే.. రియల్ బూమ్ ఉన్న ఏరియాల్లో భూముల ధరలు పెరిగిపోవటంతో రూ.17 వేల కోట్లకుపైగా రాబట్టుకోవాలని అంచనాలను సవరించుకుంది. ఎక్కడెక్కడ ముందుగా అమ్మితే వెంటనే ఆదాయం వస్తుందనే దానిపై ఆఫీసర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల భారం పెరిగిపోయింది. నిరుడు చేసిన అప్పులతో పాటు గ్యారంటీల పేరుతో తెచ్చిన అప్పులు రూ. 4 లక్షల కోట్లు దాటిపోవటంతో ఈసారి కొత్త అప్పులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. కొత్త అప్పులు ఆలస్యమైన కొద్దీ నెలవారీ ఖర్చులు, పాత అప్పుల వడ్డీల భారం ఖజానాను వెంటాడుతున్నది. దీంతో అప్పులు రాకుంటే..  ఆస్తులు, భూములను అమ్మడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల భూములపై స్పెషల్​ ఫోకస్

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాల్లో ప్రభుత్వ భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో 227 ఎకరాల భూములను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. నిరుడు కోకాపేటలో గరిష్ఠంగా ఒక్కో ఎకరం భూమి రూ. 60 కోట్ల వరకు అమ్ముడుపోయింది. తొలి విడత వేలంలో మొత్తం 133.16 ఎకరాలు ఉండగా, 49.92 ఎకరాలు సేలయ్యాయి. వాటితో రూ. 2వేల కోట్లు వచ్చాయి. మిగిలిన భూమిని అమ్మితే  మరో  రూ. 4 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. వీటిని హెచ్ఎండీ ద్వారా వేలం నిర్వహించి విక్రయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఖానామెట్, పుప్పాలగూడ, బుద్వెల్, పేట్​బాషీరాబాద్​లో మరో 143 ఎకరాల ప్రభుత్వ భూములు గుర్తించారు. వీటి ద్వారా రూ.5 వేల కోట్లు వస్తాయని ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్​ సిటీ చుట్టున్న ల్యాండ్ సేల్​తోనే రూ. పది వేల కోట్లకుపైగా ఖజానా నిండుతుందని సర్కారు ఆశలు పెంచుకుంది. అందుకే వీటిని ముందుగా అమ్మేయాలని ప్లాన్ చేస్తున్నది. 

రాజీవ్ స్వగృహ ద్వారా రూ. 5,325 కోట్లు!

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ఖాళీ జాగాల అమ్మకాలను ప్రభుత్వం స్పీడప్ చేసింది. వీటిని అమ్మడం ద్వారా కనీసం రూ. 5,325 కోట్లు రాబట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్​లోని బండ్లగూడ, పోచారంలో ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అమ్మేందుకు హౌసింగ్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,971 ఫ్లాట్ల అమ్మకానికి ఓపెన్ ఫర్ ఆల్ కోటాలో అప్లికేషన్లు తీసుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొన్ని చోట్ల అపార్టుమెంట్లు నిర్మించారు. కొన్నిచోట్ల భూములు లే అవుట్ చేసి వదిలిపెట్టారు. రాజీవ్ స్వగృహ కింద హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎలాంటి వివాదాలు లేని భూములు 820 ఎకరాలున్నాయి.  ఇందులో నిజాంపేట, మల్లంపేట, అబ్దుల్లాపూర్​మెట్, పటాన్​చెరు పరిధిలోనే ఆరు వందల ఎకరాలకుపైగా భూములుండటంతో.. వీటి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు.  

జిల్లాల్లోనూ అమ్ముడే

జిల్లాల్లో  కలెక్టర్ల ద్వారా చేపట్టిన హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ భూముల వేలంపాటతో రూ.700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. నల్గొండ, మహబూబ్‌‌నగర్, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్​లో ఓపెన్‌‌ ఆక్షన్‌‌తో 205 కోట్లు, ఇతర జిల్లాల్లో భూముల అమ్మకాలతో ఇంకో రూ.200 కోట్లు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. హెచ్‌‌ఎండీఏ పరిధిలోని తొర్రూర్, బహదూర్‌‌పల్లిలో ప్లాట్ల అమ్మకం ద్వారా 300 కోట్లు వచ్చాయి. గతంలో వేలంపాటలో మిగిలిపోయిన భూములను మళ్లీ వేలానికి పెడుతున్నారు.

గడిచిన రెండేండ్లలో ఇట్లా..!

గడిచిన రెండేండ్లలోనే ప్రభుత్వం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రూ.730 కోట్ల భూములు అమ్మేసింది. దీనికి తోడు హైదరాబాద్​లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో  కోకాపేట భూముల వేలంతో రూ.2,034 కోట్లు ప్రభుత్వ ఖాజానాకు చేరాయి. అదేవిధంగా టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ కలిసికట్టుగా విక్రయించిన భూములతో మరో రూ.705 కోట్లు వచ్చాయి. ఇటీవల ఉప్పల్ భగాయత్ భూముల అమ్మకంతో  రూ. 476 కోట్లు హెచ్ఎండీఏ ఖాతాలో పడ్డాయి. ఇవన్నిటితోపాటు హౌసింగ్​ బోర్డు భూములు, రాజీవ్​ స్వగృహ ఆస్తుల అమ్మకాలతో ప్రభుత్వం రెండేండ్లలో అమ్మిన మొత్తం భూములు, ఆస్తుల విలువ రూ. 5 వేల కోట్లు దాటింది. 

హౌసింగ్ బోర్డు, దిల్ భూములే తరువాయి 

తెలంగాణ వచ్చాక హౌసింగ్ బోర్డు డమ్మీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో బలహీన వర్గాల గృహ నిర్మాణం ఈ బోర్డు ద్వారా జరిగేది. ఈ బోర్డుతో నష్టాలే తప్ప లాభాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. ప్రస్తుతం బోర్డు పరిధిలో వివిధ జిల్లాల పరిధిలో 386.2 ఎకరాల ప్రభుత్వ భూములున్నట్లు ఇటీవలే లెక్కతేలింది. వీటిని ప్లాట్లుగా చేసి అమ్మాలనే పాత ప్రతిపాదనల ఫైలును ఇప్పుడు ప్రభుత్వం ముందటేసుకుంది. వీటికి తోడు దక్కన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అండ్ ల్యాండ్‌‌ హోల్డింగ్స్‌‌ (దిల్‌‌) కు సంబంధించి 829.4 ఎకరాల భూములు విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. 

టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అమ్మకాలు

158 ఎకరాలు.. రూ.2,747 కోట్లు అంచనా(ఇందులో ఇప్పటికే ఖానామెట్​లో 14.91 ఎకరాలు రూ.730 కోట్లకు వేలంలో అమ్మేసింది)

రాజీవ్ స్వగృహ పరిధిలో..

భూములు, ఫ్లాట్లు..రూ.5,325 కోట్ల అంచనా
తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలో..    
386.2 ఎకరాలు .. రూ.2,844 కోట్ల అంచనా
దిల్ భూములు    
829.4 ఎకరాలు..  రూ.2,169 కోట్ల అంచనా
హెచ్ఎండీఏ ద్వారా అమ్మకాలు
133.16 ఎకరాలు.. రూ.3995 కోట్లు అంచనా
(ఇందులో ఇప్పటికే 49.92 ఎకరాలు అమ్మితే రూ.2 వేల కోట్లు వచ్చింది)

Tagged two years, Telangana government sold, land worth, Rs 5000 crore

Latest Videos

Subscribe Now

More News