దేవాదాయ భూములపై సర్కార్ ఫోకస్.. కబ్జాల లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం

దేవాదాయ భూములపై  సర్కార్ ఫోకస్.. కబ్జాల లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం
  • జీడీపీఎస్ ద్వారా భూముల సర్వే 
  • ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు 
  • ఉమ్మడి నల్గొండలో ఏదో ఒక జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసే ఛాన్స్​ 
  • కబ్జాదారుల గుప్పెట్లో విలువైన మన్యం భూములు

నల్గొండ, వెలుగు : దేవాదాయ భూములపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దేవాదాయశాఖ పరిధిలోని వేలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో భూముల లెక్క తేల్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం రికార్డుల ఆధారంగా సర్వే చేసి దేవాదాయశాఖ భూములను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి నల్గొండలోని ఒక జిల్లాను పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. రూ.కోట్ల విలువైన భూములను సంరక్షించకపోతే భవిష్యత్‌‌‌‌లో దేవాదాయశాఖ ఆస్తులను కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 

సూర్యాపేట జిల్లాలోనే కబ్జాలు అధికం..

సూర్యాపేట జిల్లాలోనే దేవాదాయశాఖ భూములు ఎక్కువగా కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా బూరుగడ్డ వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 581 ఎకరాల భూమి కౌలు పేరుతో  కబ్జాలకు పాల్పడ్డారు. దాదాపు 30 ఏండ్లుగా కౌలుదారుల ఆధీనంలో ఉండడంతో పెద్ద ఎత్తున మన్యం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. మరోవైపు హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ పట్టణ సమీపంలోనే ఉన్న  రామాలయానికి సంబంధించి 450 ఎకరాల భూమి ఉండగా, అది కబ్జాకు గురైనట్లు తెలుస్తుంది. 

ఈ భూములను కబ్జాలు చేసినవారు ఏకంగా ఎకరం రూ.25 లక్షల వరకు అమ్మేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గుర్రంపోడు మండలంలోనూ కొప్పోలు సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల ఆక్రమణలపై తరచూ గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు సర్వే చేసి నిగ్గుతేల్చలేకపోతున్నారు. ఈ ఆలయానికి దాదాపు 81 ఎకరాల భూమి ఉండగా, 40 ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదులు ఉన్నాయి.  

కబ్జాదారుల గుప్పెట్లో మన్యం భూములు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డులపరంగా 14,769 ఎకరాల దేవాదాయ భూములుంటే 2,708 ఎకరాల భూమి కబ్జాకు గురైందని అధికారులు నిర్థారించారు. మరో 5 వేల ఎకరాల వరకు కబ్జా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా భూములు కౌలుకు తీసుకున్న రైతులే కబ్జాలకు పాల్పడుతున్నారు. కొన్ని దేవాలయాల పరిధిలోని ఆలయ నిర్వాహకులు, ధర్మకర్తలు, దేవస్థాన అర్చకులు సైతం ఆక్రమణలకు తోడ్పాడునందిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 

జీడీపీఎస్​ద్వారా భూముల సర్వే..

దేవాదాయ భూములను గుర్తించేందుకు జీడీపీఎస్‌‌‌‌(గ్లోబల్‌‌‌‌ డి ఫరెన్షియల్‌‌‌‌ పొజిషన్‌‌‌‌ సర్వే) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దేవాదాయశాఖ అసిస్టెంట్‌‌‌‌ కమిషనర్లతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములతోపాటు దేవాదాయశాఖకు సంబంధించిన మొత్తం భూములను సర్వే చేయాలని నిర్ణయించారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాలను పైలెట్‌‌‌‌ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండలోని ఏదైనా ఒక జిల్లాను పైలెట్‌‌‌‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని 
నిర్ణయించారు. 

రెవెన్యూ, దేవాదాయశాఖ సంయుక్తంగా సర్వే..

రెవెన్యూ, దేవాదాయశాఖలు సంయుక్తంగా జీడీపీ సర్వే చేపట్టనున్నాయి. ఈ రెండు శాఖలతోపాటుగా ఫారెస్ట్, ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు  కూడా సర్వేపై నోటీసులిస్తారు. రెవెన్యూ, దేవాదాయశాఖ రికార్డుల్లో ఉన్న ప్రకారం సర్వే నిర్వహించి హద్దురాళ్లు నిర్ణయిస్తారు. దేవాదాయశాఖ పరిధిలో కాకుండా ఆక్రమణదారుల పరిధిలో ఈ భూములుంటే వాటిని గుర్తించి ఆఫీసర్లు నోటీసులు అందిస్తారు. అయినా ఆక్రమణదారులు వెళ్లకపోతే చట్టపరంగా కేసులు నమోదు చేసి భూములు స్వాధీనం చేసుకొనున్నారు. అనంతరం భూములన్నింటికీ హద్దు రాళ్లు పాతడంతోపాటు ఫెన్సింగ్‌‌‌‌ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టనున్నారు.