తెలంగాణలో అడుగడుగునా ఎకో అడ్వెంచర్ టూరిజం స్పాట్ లు... పర్యాటకంపై ఫోకస్ పెట్టాలి..

తెలంగాణలో అడుగడుగునా ఎకో అడ్వెంచర్ టూరిజం స్పాట్ లు...   పర్యాటకంపై ఫోకస్ పెట్టాలి..

పర్యావరణ సాహస పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు తెలంగాణలో అడుగడుగునా ఉన్నాయి. మన దగ్గర జలపాతాలు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఇటీవల మన సీఎం రేవంత్​ రెడ్డి  నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించడం అభినందనీయం.  తెలంగాణ ప్రభుత్వం  పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను అనేక వ్యయ ప్రయాసాలను తట్టుకొని విజయ వంతంగా నిర్వహించింది.

ఆదిలాబాద్ అడవుల జిల్లాగా పేరు పొందింది. అడ్వంచర్  ఎకో  టూరిస్టులు అత్యధిక సంఖ్యలో  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 4, 5 గంటలల్లో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.  అదేవిధంగా రాష్ట్ర రవాణా సంస్థ కూడా బస్సులను ఆదిలాబాద్​కు  ఎక్కువ సంఖ్యలో నడుపుతోంది.  రైలు మార్గం కూడా ఉంది.  ఆదిలాబాద్ నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న కుంటాల జలపాతానికి బస్సు సౌకర్యం కూడా ఉంది.  ఇక్కడ గల జలపాతం రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతంగా గుర్తింపు పొందింది.  100--–135 అడుగుల ఎత్తుగల ఈ జలపాతం మల్లన్న గుండంగా పేరుపొందింది. ఈ కుంటాల జలపాతానికి చేరుకోవడానికి సుమారు 450 మెట్లు దిగి కిందకి వెళ్ళవలసి ఉంటుంది. 

ట్రెక్కింగ్​, జలపాతాలు

కుంటాల జలపాతం చుట్టుపక్కల 6 నుంచి 8 కి. మీ దూరం ట్రెక్కింగ్​కు  అంతర్జాతీయ స్థాయిలో అనుకూలమైన ప్రాంతం.  అంతేకాకుండా ఇక్కడ రాక్ క్లైంబింగ్​కు  కూడా అనుకూలమైన ప్రాంతం.  జలక్రీడ  రాఫ్టింగ్​కు ఎంతో అనుకూలం. జలపాతంలో చుక్క నీరు లేనప్పుడు  కూడా 2 కి.మీ దూరంలో ఉన్న అడవిలో వాటర్ బాడీస్ ఉండడం వల్ల సుమారు 1– 1/2 కి.మీ వెడల్పు 3-4 కి.మీ పొడవుగల ఈ వాటర్ బాడీస్ చుట్టు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగి ఉంటుంది.  

ఈ జలపాతం దగ్గర క్యాంపింగ్​కు మంచి అవకాశం ఉండడం వల్ల రాత్రికి గుడారాల్లో బసచేసే వీలుంది.  ఇక్కడ  స్థానిక యువతకు ఎక్కువ సంఖ్యలో శిక్షణ ఇచ్చినట్లైతే ఈ ప్రాంతంలో  డిసెంబర్, జనవరిలో ట్రెక్కింగ్ క్యాంప్​లు నిరంతరంగా నిర్వహించి ఆదాయాన్ని కల్పించవచ్చు.   సంప్రదాయ  నృత్యమైన గోండు నృత్యాన్ని  ప్రతి క్యాంపులో ప్రదర్శించి స్థానిక సంస్కృతిని లోకానికి చాటి వారికి ఆదాయాన్ని సమకూర్చినట్లవుతుంది.

పర్యాటక పెట్టుబడులను ఆకర్షించాలి

తెలంగాణలో పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడం, పెట్టుబడులకు భూమి కేటాయించడం, రాయితీలు, కావలసిన అనుమతులకు నిర్దిష్ట కాలం మొదలగు అంశాలపై దృష్టి పెట్టాలి.  తెలంగాణ పర్యాటక విధాన రూపకల్పన  ఒక ప్రయివేట్ సంస్థకు అప్పజెప్పటం వల్ల వారు ముఖ్యంగా పర్యావరణ సాహస పర్యాటకంలో విశిష్ట అనుభవం, పరిజ్ఞానం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు.  అధికారులు కూడా పర్యాటక విధానాన్ని  పూర్తిగా సమీక్షించకుండా విధానాన్ని  ప్రకటింపజేశారు. ఏ విధానాన్ని అయినా మార్పులు, చేర్పులు పునఃసమీక్ష  ద్వారా సరిచేసుకోవచ్చు. 

వెంటనే ప్రభుత్వం పునఃసమీక్షించడానికి పర్యావరణ సాహస క్రీడలలో విశేష అనుభవంగల వారితో  ఇతర అనుభజ్ఞులను  సంప్రదించి తుది విధానాన్ని విడుదల చేయాలి.   మన పది  ఉమ్మడి  జిల్లాల్లో కొన్ని వందల జలపాతాలు, కొండలు, ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు, గొప్ప చరిత్రగల కోటలు, జల వనరులు ఉన్నాయి.  అదేవిధంగా ఆమ్రాబాద్ రాజీవ్  టైగర్ రిజర్వ్, సఫారీ,  పోచారం  వైల్డ్ లైఫ్ సఫారీ, కల్వాల్ వైల్డ్ లైఫ్  సఫారీ ఇవేకాకుండా ఇంకా అనేక అద్భుత సాహస పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

శాఖల మధ్య సమన్వయ లోపం

తెలంగాణలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయలోపం కొనసాగుతోంది.  ముఖ్యంగా అటవీశాఖ, పర్యాటకశాఖల మధ్య ఎవరి విధానం వారిదిగా ఉంది.  అటవీశాఖ పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించి  క్యాంపులను నిర్వహిస్తోంది.  అదేవిధంగా పర్యాటకశాఖ  కూడా తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  అయితే ఇద్దరి విధానంలో పేర్కొన్నట్లు కొన్ని సర్క్యూట్స్ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి,  కార్యరూపం దాల్చడం లేదు.  మన రాష్ట్రంలోగల అనేక కోటలు, జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాలను యువతకు ఆదాయ వనరులుగా కల్పించి వాటిని సర్వేచేసి, (ట్రయల్ రన్ చేసి, డాక్యుమెంటేషన్)  పూర్తి విషయాలను  పొందుపరిచి ప్రభుత్వం, ప్రచారం చేయాలి.  

అక్కడగల ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని స్థానిక యువతను  ఎంపిక చేసి భాగస్వాములను చేయాలి.  వారికి శిక్షణకు కావలసిన సామగ్రిని అందించి సాంకేతిక, మార్కెటింగ్ మద్దతు ఇవ్వాలి.  తెలంగాణ ప్రభుత్వం  పర్యావరణ సాహస పర్యాటకులకి సంబంధించి శిక్షణను ఇవ్వాలి.   సాహస పర్యాటకానికి ప్రత్యేక బోర్డును ఏర్పరచి ఇందులో సాహస క్రీడలను నిర్వహిస్తున్న విశేష అనుభవంగలవారిని నియమించాలి.  ముఖ్యంగా స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా మన పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికులకు ఆదాయం లభిస్తుంది.  ఇందులో తెలంగాణ గ్రామీణ ప్రాంత సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి.

పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలె

తెలంగాణ పర్యాటక విధానంలో  పొందుపరిచిన వివరాల ప్రకారం సాహస పర్యాటక ప్రాజెక్టులకు  కనీస పెట్టుబడి 25లక్షలకుగాను 25% సబ్సిడీ  పేర్కొనడం ద్వారా తెలంగాణలోని యువత 80% వరకు ఈ విభాగంలో లబ్ధి పొందే అవకాశం ఉన్నాయి, అయితే వీటికి సంబంధించి సమగ్ర వివరాలు లేవు.  ప్రభుత్వం దీనిమీద  ప్రత్యేక దృష్టి పెట్టాలి.   మన నూతన పర్యాటక విధానం ద్వారా 2025 నుంచి 2030 వరకు  సుమారు రూ.15వేల కోట్లు పెట్టుబడులను ఆశించవచ్చు.  అయితే, ఈ లక్ష్యం సాధించడానికి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందించాలి. 

పెట్టుబడులను ఆకర్షించడానికి వీరికి కావలసిన మౌలిక సదుపాయాలు కావలసిన భూమి వివరాలు (ల్యాండ్ బ్యాంక్) ఏమీ లేవు.  పెట్టుబడి పెట్టేవారిని  సమన్వయం చేయడానికి ఒక ప్రత్యేక విభాగం  కూడా లేదు.  మన రాష్ట్రంలో  కోటలు, జలపాతాలు, ఇతర పర్యావరణ సాహస ప్రాంతాలలో ఎవరైనా క్యాంపును నిర్వహించదలిచితే ఎవరు అనుమతులు ఇస్తారో,  ఎంతకాల పరిమితిలో ఇస్తారో కూడా సమాచారం లేదు. మన రాష్ట్రంవాళ్ళు ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయవలసిన పని ప్రభుత్వం చేయాలి.

- కె.రంగారావు,
ఏసీటీఎస్​ వ్యవస్థాపకుడు