అవసరమైన చోట ఉర్దూ మీడియం అంగన్వాడీలు .. మొదలైన క్షేత్రస్థాయి సర్వే

అవసరమైన చోట ఉర్దూ మీడియం అంగన్వాడీలు .. మొదలైన క్షేత్రస్థాయి సర్వే
  • అర్బన్ ప్రాంతాలకు ప్రాధాన్యం

నిర్మల్, వెలుగు: అంగన్వాడీ కేంద్రాలన్నీ ఇప్పటివరకు తెలుగు మీడియంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ మరికొద్దిరోజుల్లో ఉర్దూ మీడియం అంగన్వాడీలు కూడా రాబోతున్నాయి. అనుకూలత, అవసరమైన చోట ఉర్దూ మీడియం  అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉర్దూ మీడియం అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా జిల్లాల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే సర్వే సాగుతోంది. 

టీచర్లు, ఆయాల భర్తీ

ముస్లిం జనాభాను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉర్దూ మీడియం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా ఏరియాల్లోని ఐదేండ్ల లోపు ఎంతమంది పిల్లలున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ సర్వే పూర్తికాగానే అనుకూలత, అవసరమున్న చోట్ల ఉర్దూ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిల్లో పనిచేసేందుకు అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను కూడా భర్తీ చేయనుంది.

ఉమ్మడి జిల్లాలో కొత్త అంగన్వాడీ కేంద్రాలు..

ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో అదనంగా అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో 926 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అదనంగా మరో 50 నుంచి 100 వరకు కొత్తగా ఉర్దూ మీడియం అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 969 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటితోపాటు ప్రస్తుత సర్వే ప్రకారం మరో 70 వరకు ఉర్దూ మీడియం కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

అదిలాబాద్ జిల్లాలో మొత్తం 1282 అంగన్వాడీలుండగా.. ఇక్కడ సుమారు 100కు పైగా ఉర్దూ మీడి యం అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 975 అంగన్వాడీ సెంటర్లు ఉండగా.. 60 నుంచి 70 వరకు ఉర్దూ మీడియం కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సర్వే నివేదికల అనంతరం కొత్త కేంద్రాల సంఖ్య స్పష్టంగా తేలనుంది.

జిల్లా    ప్రస్తుతమున్న ఏర్పాటు కానున్న అంగన్వాడీలు    ఉర్దూ అంగన్వాడీలు

ఆదిలాబాద్​    1282    100
నిర్మల్​    926    50–100
మంచిర్యాల    969    70 
ఆసిఫాబాద్​    975    60–70