చెంచులు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేదెలా .. ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం కసరత్తు

చెంచులు ఇందిరమ్మ ఇండ్లు  కట్టుకునేదెలా .. ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం కసరత్తు
  • 'ఇందిరమ్మ ఇండ్లు' పైలెట్​ ప్రాజెక్టు కింద ఎంపికైన చిన్నాయపల్లి గ్రామం
  • ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేని స్థితిలో చెంచు కుటుంబాలు

ఈమె పేరు చెంచు తిరుమలమ్మ.  భర్త చెన్నయ్య.  మూడు నెలల కింద ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ఇల్లు కట్టుకునే స్థోమత లేక ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించలేదు.  ప్రస్తుతం ఆమె కుటుంబం గుడిసెలోనే నివాసం ఉంటోంది. ఇటీవల ఓ కాంట్రాక్టర్​ ఇండ్లు కట్టిస్తామని ముందుకు రాగా..  పునాదుల కోసమని గోతులు తీశాడు.  ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు సరిపోవని పనులు ఆపేశాడు. 

ఈమె పేరు మాదాస్​​స్వరూప.  భర్త అనంతయ్య. ఈమె పేరు మీద మూడు నెలల కిందట ప్రభుత్వం ఇందిరమ్మ  ఇల్లు మంజూరు చేసింది. ఆమె భర్త మూడు రూపాయల మిత్తికి రూ.1.50 లక్షల అప్పు తెచ్చి బేస్ మెంట్​వరకు నిర్మాణం చేశాడు. తెచ్చిన పైసలు బేస్​ మెంట్​వరకే సరిపోవడంతో పైసలు లేక 25 రోజుల క్రితం పనులు నిలిపివేశాడు.  

మహబూబ్​నగర్​, వెలుగు: చెంచులకు 'ఇందిరమ్మ ఇండ్లు' మంజూరై నెలలు గడుస్తున్నా ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. నిరుపేదలు కావడంతో ప్రభుత్వమే ఇండ్లను కట్టివ్వాలనే డిమాండ్లు​ వస్తున్నాయి. దీంతో  రాష్ర్ట ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా చెంచులకు రూ. లక్ష రుణాలు ఇప్పించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి.. ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోనుంది.

కేసీఆర్​ ప్రభుత్వ హయాంలో ఇండ్ల కూల్చివేత

మహబూబ్​నగర్​ జిల్లా మహమ్మదాబాద్​ మండలం చిన్నాయిపల్లి గ్రామంలో దాదాపు 60కి పైగా చెంచు కుటుంబాలు ఉంటున్నాయి. 240 జనాభా ఉండగా, 120 మంది ఓటర్లు ఉన్నారు.  వీరికి 1979లో ఐటీడీఏ ఆధ్వర్యంలో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కట్టించింది. అప్పటి నుంచి వీరు ఇక్కడే నివాసం ఉంటున్నారు. 2019లో అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్వహించిన ‘పల్లె ప్రగతి’లో వీరి ఇండ్లను ఆఫీసర్లు కూల్చేశారు. ‘మీ ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కట్టిస్తాం’ అని హామీ ఇచ్చి ఆ ఇండ్లను మొత్తం నేలమట్టం చేశారు. 

ఇండ్లు కూల్చిన తర్వాత డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను కట్టివ్వలేదు. ఇందిరమ్మ ఇండ్లను కూల్చేసిన ప్రాంతంలోనే తాత్కాలిక పాకలు, గుడిసెలు, షెడ్లను ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెంచులను ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న చెంచు కుటుంబాలను గుర్తించి, ఇటీవల వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది.

వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు

చిన్నాయపల్లి గ్రామ పంచాయతీని రాష్ర్ట ప్రభుత్వం పైలెట్​ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ జీపీకి మొత్తం 140 ఇండ్లు మంజూరు చేయగా.. ఇందులో 38 ఇండ్లను చెంచులకు కేటాయించింది. కూలి చేసుకునే చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా.. వాటిని కట్టుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు.  మొత్తం 38 ఇండ్లలో నలుగురు మాత్రమే పనులు ప్రారంభించారు. వాటిలో ఒకటి బేస్​మెంట్​ వరకు పూర్తి కాగా.. మరో మూడు సెత్తు వరకు కంప్లీట్ అయ్యాయి. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్​ రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 

సోమవారం నుంచి రుణాలు ఇప్పిస్తాం..

చెంచులు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డు వస్తున్నాయని తెలిసింది. ప్రభుత్వంతో మాట్లాడి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణాలు ఇప్పించేందుకు ఒప్పించాం. వచ్చే సోమవారం నుంచి చెంచులకు మహిళా గ్రూపుల నుంచి రుణాలు ఇప్పిస్తాం. 

రాంమోహన్​ రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి