ఇవాళ మరో 3 వేల కోట్ల అప్పు తీసుకోనున్న సర్కార్

ఇవాళ మరో 3 వేల కోట్ల అప్పు తీసుకోనున్న సర్కార్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో అంటే.. జులై, ఆగస్టు, సెప్టెంబర్​కు సంబంధించి ఆర్బీఐ నుంచి 9,500 కోట్ల అప్పు తీసుకోనుంది. జులై నెలకు సంబంధించి రూ. 3 వేల కోట్ల అప్పును మంగళవారం తీసుకోనుంది. అప్పులపై తాజాగా రిలీజ్​ చేసిన ఇండికేటివ్​ క్యాలెండర్​లో ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ప్రతి నెలా బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని ఈ అప్పులు సమకూర్చుకోనుంది. ఆగస్టు 2న రూ. 2 వేల కోట్లు, ఆగస్టు 29న రూ. 1000 కోట్లు, సెప్టెంబర్​ 13న రూ.1000 కోట్లు, సెప్టెంబర్​ 27న ఇంకో రూ.2500 కోట్లు తీసుకోనుంది. 

మొదటి 3 నెలల్లో సగమే వచ్చినయ్​

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో(ఏప్రిల్​, మే, జూన్​) రూ.15 వేల కోట్లు అప్పు కావాలని రాష్ట్ర సర్కార్​ ఆర్బీఐకి నివేదించింది. అయితే అందులో రూ.7 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. కొన్నేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల గ్యారంటీ పేరుతో ఇష్టారీతిన అప్పులు చేసింది. వాటిని బడ్జెట్​లో నుంచి చెల్లించడంపై కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్​లో నుంచి గ్యారంటీ అప్పులను చెల్లిస్తే.. వాటిని కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలో పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అయితే.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో  ఆశించినంతగా అప్పు పుట్టడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్బీఐ నుంచి దాదాపు రూ. 52 వేల కోట్లు అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. గ్యారంటీ అప్పులను గడిచిన రెండేండ్లలో ఎక్కువ చేయడంతో ఆర్బీఐ తాను ఇవ్వబోయే అప్పుల్లో భారీగా కోత పెట్టినట్లు తెలిసింది.

కిస్తీలు, వడ్డీలకే ప్రతి నెలా రూ. 3వేల కోట్లు

గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ. 4 లక్షల కోట్లకుపైగా అప్పుల వల్ల  వడ్డీల భారం విపరీతంగా పెరిగింది. పోయిన ఆర్థిక సంవత్సరంలో యావరేజ్​గా నెలకు రూ.1,500 కోట్లు వడ్డీలకే చెల్లించింది. దీనికి తోడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకో వంద కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నది. పాత అప్పులకు ఇన్​స్టాల్​మెంట్లు, వడ్డీలు చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. పాత అప్పులకు కిస్తీలు, వడ్డీలకు కలిపి  ప్రతినెలా యావరేజ్​గా రూ. 3 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​ నుంచి చెల్లింపులు చేస్తున్నది.

అప్పు వచ్చాకే పూర్తి జీతాలు

ఇప్పుడు చేస్తున్న అప్పులతో కనీసం జీతాలకైనా ఇబ్బందులు కాకుండా ఉంటుందని రాష్ట్ర సర్కార్​ భావిస్తున్నది. కొంత మొత్తాన్ని రైతుబంధుకు బదలాయించనుంది. ఇక రాష్ట్రానికి ఇతర మార్గాలతో వచ్చే ఆదాయాన్ని స్కీమ్స్​కు ఇవ్వాలని చూస్తున్నది. మంగళవారం రూ. 3వేల కోట్లు అప్పు తీసుకున్నాకే జిల్లాల్లోని ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు అందనున్నాయి.