తొలిమెట్టు, ఉన్నతి .. విద్యా ప్రమాణాలు పెంచేనా?

తొలిమెట్టు, ఉన్నతి .. విద్యా ప్రమాణాలు పెంచేనా?

ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 2022వ సంవత్సరం నుంచి తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని,  మరుసటి విద్యా సంవత్సరం 2023లో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్నతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థూలంగా ఈ రెండు కార్యక్రమాల లక్ష్యం తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలు, ఫలితాలు సాధించడం. వీటికి సంబంధించిన మాడ్యూల్స్​లో నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్), యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (ఎఎస్‌ఇఆర్‌), సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ సిస్టమ్స్‌, నేషనల్​ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఇపి) 2020 పరిశీలనలను, సర్వేలను ప్రస్తావించారు. ఈ సర్వేల ఫలితాలను విశ్లేషిస్తే విద్యార్థులలో కనీస అభ్యసన స్థాయి లేదని, వెనుకబడినారని నిర్ధారించారు.

 ఎన్నోఏండ్లుగా ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతున్నది?.  వీటిని సరిచేయడమెలా అనే కీలక సమస్య మన ముందుకు వచ్చింది. దీనికి పరిష్కారంగా నిర్వహిస్తున్న తొలిమెట్టు, ఉన్నతి వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తాయా? లేక గతంలోని అనేక కార్యక్రమాలవలె  కొయ్యగుర్రంలా మిగిలిపోతాయా?. దీనికి సంబంధించి డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ కొన్ని విషయాలను చర్చకు తెస్తున్నది. వీటిని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది.

ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతిలో ఉపాధ్యాయ, విద్యార్షి నిష్పత్తి 15:1గా ఉండకుండా బహుళ తరగతి బోధన జరుగుతోంది. బహుళ తరగతి బోధన ఎఫ్‌ఎల్‌ఎన్‌ సాధించడానికి అవరోధం అవుతోంది. 1–-5 తరగతుల్లో ప్రత్యేకించి 1,2 తరగతులలో నిర్వహించవల్సిన బోధనలపై శాస్త్రీయ పరిశోధనలు జరగాలి. అందుకోసం ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను బలోపేతం చెయ్యాలి.  తొలిమెట్టు, ఉన్నతిలో భాగంగా పరీక్షలను పెట్టడం, జవాబు పత్రాలను భద్రపరచమనడం, వాటి సూక్ష్మమైన వివరాలను నమోదు చేయమనడం, నిర్దిష్టమైన పిరియడ్‌ ప్రణాళికలను రాయమనడం, వాటిని కచ్చితంగా పాటించమనడం, ఉపాధ్యాయులను తమను తాము పరీక్షించుకుని వివరాలను యాప్​ల ద్వారా ఆన్​లైన్లో నమోదు చేయమనడం, వీటికి సంబంధించిన రుజువులను పర్యవేక్షకులకు అందుబాటులో ఉంచమనడం వంటి వాటికి సంబంధించిన ఉత్తర్వులను చూస్తుంటే ఉపాధ్యాయులపై నిఘా, ఒత్తిడి, ఒక రకమైన నిర్బంధం ప్రయోగించడం స్పష్టం అవుతున్నది. ఇలాంటి నిర్బంధపూరిత, ఒత్తిళ్ల మధ్య బోధనాభ్యసన ఫలితాలను పొందడం సాధ్యంకాదు. 

ఖాళీలను  భర్తీ చేయాలి

బోధనాభ్యసన ప్రక్రియ పిల్లలకు, ఉపాధ్యాయులకు సంతోషాన్ని, సంతృప్తిని పంచేదిగా ఉండాలి. అంతిమంగా పిల్లల్లో శారీరక మేధ, మనో, ఉద్వేగ సామాజిక వికాసాల్లో ప్రవర్తనా మార్పులకు దారి తీసేదిగా ఉండాలి.  ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షణాధికారుల కొరత తీవ్రంగా ఉన్న సందర్పంలో వారిలోని కొందరిని నోడల్‌ అధికారులని, పర్యవేక్షణ బృందాలని, వివిధ పేర్లతో బడి చదువులకు దూరం చేస్తున్నారు. దీన్ని వెంటనే నివారించాలి. ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిలో ఉపాధ్యాయులను స్వల్పకాల పరిమితులకు కాకుండా ఏళ్లకేళ్లుగా పని చేయిస్తూ వారిని బడి చదువులకు ఎందుకు దూరం చేస్తున్నారు?.  వెంటనే వారిని బడులకు పంపించివేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ బడుల్లో  రోజూ కనీసం ఒక పిరియడ్‌ అయినా బోధన చేయలేని పరిస్టితి ఉన్నది. దీనిని అధిగమించాలి.  దశాబ్దాలుగా డిస్ర్టిక్ట్​ ఇన్​స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డి.ఐ.ఇ.టి), బిఇడి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో,  రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి)లో, హెడ్‌ మాస్టర్‌ (ఎచ్‌.ఎం), మండల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (ఎం.ఇ.ఓ), డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డివై.ఇ.ఓ) ల పోస్టుల్లో 90% మేర ఖాళీలే ఉన్నాయి. వీటిని భర్తీ చేసి బలోపేతం చేయాలి. 

బోధనా కాలం పెరగాలి

 గతంలో రెండు పిరియడ్లలో చెప్పే మొత్తాన్ని ఉన్నతి ప్లాన్‌ ప్రకారం ఒక పిరియడ్​లోనే పఠనం చేసి, విద్యార్థులచే చదివించి అందులోని ముఖ్యమైన, కఠినమైన పదాలను గుర్తింపచేసి వాటిని బోర్డ్‌ పై రాసి, వివరించి, భావనలను అవగాహన చేయించాలి. ఆరోజు పాఠం సారాంశాన్ని బోర్డుపై రాసి పిల్లలచే వారి నోటుపుస్తకాల్లో రాయించాలి. ఇవన్నీ చేస్తూ నిర్దేశించిన పిరియడ్లలో పాఠ్యపుస్తక తాత్వికత ఆశించినట్లుగా పాఠాన్ని పూర్తిచేయడం సాధ్యంకాని పని. అప్పుడు బోధనా పిరియడ్లు పెరగాలి. సిలబస్‌ తగ్గాలి.

క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలి

అధ్యాపకుల నుంచి మొదలుకొని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఎడి),  జాయింట్‌ డైరెక్టర్‌ (జెడి), రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జెడి)  డిస్ట్రిక్ట్​ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డిఇఓ), డిప్యూటీ  ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డివైఇఓ), మండల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(ఎంఇఓ) వరకు అందరికీ పాఠశాల విద్యా  వ్యాసంగంలో ప్రత్యక్ష సంబంధం ఉండాలి. అందరూ ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని భిన్న ప్రాంతాలలో, భిన్న నేపథ్యాలున్న పాఠశాలల్లో కనీసం 20 రోజులపాటు  రెగ్యులర్‌ ఉపాధ్యాయులవలె టైమ్​ టేబుల్​ను అనుసరించి బోధన చేయాలి. ఇలా ప్రతి సంవత్సరం వేర్వేరు బడులలో పని చేయడం ద్వారా క్షేత్ర సాయి బోధనలో ఎదురయ్యే అనేక సమస్యలు తెలుస్తాయి. వాటిని సత్వరం పరిష్కరించాలి. ప్రతి పిరియడ్​కు సంబంధించిన పిరియడ్‌  ప్రణాళికను ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి. ద్వారా రూపొందించాలి.  

స్నేహపూరక పర్యవేక్షణతో సత్ఫలితాలు

స్నేహపూర్వక పర్యవేక్షణతోపాటు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో అంకితభావం, చిత్తశుద్ధి,  బోధించే విషయాలపై పట్టు, అవగాహన ఉండాలి. ఆ దిశలో ఉపాధ్యాయుల కృషి చాలా అవసరం.  తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను  ప్రతి జిల్లాలోని భిన్న ప్రాంతాలలో, భిన్న నేపథ్యాలున్న ఐదారు పాఠశాలల్లోనైనా నాలుగైదు నెలలు లేదా ఒక టర్మ్‌ మొత్తం నిర్వహించాలి. ఈ  పాజెక్టులో తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల, మాడ్యూల్స్‌ రూపకర్తలు, విధిగా ప్రత్యక్ష బోధనలో పూర్తిసమయం రెగ్యులర్‌ ఉపాధ్యాయునివలె పాల్గొనేలా చూడాలి. వాటి అంతిమ ఫలితాల ఆధారంగా తగు నిర్ణయాలు తీసుకోవాలి. 

బడి వాతావరణం మెరుగుపరచాలి

బడి అంటే కేవలం పాఠ్యపుస్తకాల చుట్టూ, పరీక్షల చుట్టూ, మదింపులు, మూల్యాంకనం చుట్టూ తిరగడమేనా? అదొక నిరంతర అధ్యయన, అభ్యసన కేంద్రంగా ఎందుకు ఉండలేకపోతున్నది?.  నేడు కనీసం చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు చేయగలగడం, పాఠ్యాంశాలను రాబట్టడమే గగనంగా మారింది. శారీరక, మేధ,  మనో, ఉద్యోగ, సామాజిక తదితర విషయాలతో కూడిన వికాసం అనేది పెద్దగా పట్టించుకోని విషయమైంది.  విద్యకు ఉన్న అర్థమే మారిపోయింది. ఈ విధానం మారాలి.  ఇందుకోసం డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డి.ఇ.డి), ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో  ప్రమాణాలను పెంచాలి. అక్కడ జరిగే శాస్త్రీయ పరిశోధనలు వాటి ప్రతిఫలాలను ప్రాథమిక పాఠశాలల్లో ఆచరించేలా చూడాలి.  సమగ్ర అర్థంలో విద్యను అందించడం ఆషామాషీ విషయం కాదు.  బడి అనేది ఒక నిరంతర అధ్యయన, అభ్యసన కేంద్రంగా రూపు దిద్దుకోవాల్సి ఉన్నది. విద్యార్థులతో ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా మాట్లాడుతూ మార్గదర్శనం చేసే పరిస్థితి లేదు. విద్యార్థులు తమ వీలును బట్టి అవసరాలను బట్టి,  సాధారణ బడి వేళలకు ఆవల కూడా బడికి వచ్చి అక్కడి విద్యావనరులను వినియోగించుకునేలా,  క్షేత్ర పరిశీలనలకు వీలు కల్పించేలా బడి వాతావరణం మెరుగుపడాలి.

  ఎం. సోమయ్య, అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌, తెలంగాణ,
డా. బి. రామకృష్ట, అకడమిక్‌ సెల్‌ కన్వీనర్‌.
టి.లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి.