133 రైతు కుటుంబాలకు.. రూ.6 లక్షల చొప్పున పరిహారం

133 రైతు కుటుంబాలకు..  రూ.6 లక్షల చొప్పున పరిహారం

హైదరాబాద్‌‌, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించింది. మొత్తం 250 మందికి పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. 133 కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జీవోను శనివారం బయట పెట్టింది. వికారాబాద్‌‌ జిల్లాలో 27 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మంది, నల్గొండలో 17 మంది, జయశంకర్‌‌ భూపాలపల్లిలో 12 మంది,  జనగామలో 10 మంది, ములుగు, హనుమకొండ జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, ఖమ్మంలో 6 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో ఐదుగురు, వరంగల్‌‌, నిజామాబాద్‌‌లో ముగ్గురు చొప్పు న, నారాయణపేట్‌‌, మెదక్‌‌, మహబూబాబాద్‌‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కరీంనగర్‌‌, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేటల్లో ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున రూ.7.95 కోట్లు రిలీజ్ చేసింది. మరో 117 కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా పెండింగ్‌‌లో పెట్టింది.

రెండేళ్లుగా పెండింగ్
తెలంగాణ ఆవిర్భావం నుంచి రైతుబీమా అమల్లోకి వచ్చిన 2018 ఆగస్టు 14వ తేదీ దాకా రాష్ట్రంలో 5,152 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎఫ్‌‌ఐఆర్‌‌, పంచనామా, ఫోరెన్సిక్‌‌ ల్యాబ్‌‌ సైంటిఫిక్ రిపోర్టు, పోలీస్‌‌ ఫైనల్‌‌ రిపోర్ట్‌‌, పట్టాదారు పాస్‌‌ బుక్‌‌, ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్న అప్పు పేపర్లు, బ్యాంకు లోన్లు, అకౌంట్ల వివరాలు, కౌలునామా, వారసత్వ ధ్రువీకరణ, మూడేళ్లు వ్యవసాయం చేసినట్టు పహాణీ, మండల్‌‌ లెవల్‌‌, డిస్ట్రిక్ట్‌‌ లెవల్‌‌ వెరిఫికేషన్‌‌ కమిటీల నివేదికలు సహా 13 రకాల డాక్యుమెంట్లను ఆఫీసర్లు పరిశీలించారు. ఆ 5 వేల మందిలో వ్యవసాయం కోసం అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నది 1,600 మంది మాత్రమేనని గుర్తించారు. మిగతా వారు బిడ్డల పెళ్లిళ్లు, చదువుల కోసం, పశువులు కొనేందుకు, ఇల్లు కట్టుకునేందుకు అప్పులు తీసుకున్నట్టు గుర్తించారు. కొందరు తండ్రి 
పేరు మీద భూమి ఉంటే కొడుకులు వ్యవసాయం చేస్తున్నారు. అలా తమ పేరుతో భూమి లేని వారిని పక్కన పెట్టేశారు. ఎఫ్‌‌ఐఆర్‌‌లో తప్పులున్నా, కౌలునామా రాసుకోకున్నా వారిని లెక్కలోకి తీసుకోలేదు. ఇలా పలు కారణాలు చూపించి మిగిలిన 3,552 మంది రైతుల ఆత్మహత్యలను పరిహారం ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వం గుర్తించిన 1,600 మందిలో 1,350 రైతు కుటుంబాలకు రెండేళ్ల కిందట రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌‌గ్రేషియా చెల్లించారు. కానీ మిగిలిన 250 రైతు ఫ్యామిలీలకు ఇవ్వలేదు. 

మూడేళ్లుగా పోరాటం
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు పరిహారం కోరుతూ మూడేళ్లుగా పోరాడుతున్నాయి. పలుమార్లు ప్రభుత్వ పెద్దల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రైతు స్వరాజ్య వేదిక సహా పలు సంఘాలు వీరి తరఫున అనేక ఉద్యమాలు నడిపించాయి. ఈక్రమంలోనే ఈనెల 16న ఇందిరా చౌక్‌‌ వద్ద రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించారు. అక్కడ రైతులు చెప్పిన కన్నీటి గాథలకు అందరూ చలించిపోయారు. పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ ఆందోళనతో సర్కారుపై ఒత్తిడి పెరిగి బాధితుల్లో సగానికిపైగా మందికి పరిహారం విడుదల చేసింది. మిగిలిన 117 మందికి పరిహారం మంజూరు చేయడానికి ఇంకా ఎంత టైం కావాలని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.