ఔట్​సోర్సింగ్ ​వర్కర్లను దోచుకుంటున్నరు

ఔట్​సోర్సింగ్ ​వర్కర్లను దోచుకుంటున్నరు
  • పీఎఫ్, ఈఎస్ఐ పేరిట జీతాల్లో సర్కారు కోత 
  •  దొంగ లెక్కలు చూపుతూ కాంట్రాక్టర్ల చేతివాటం  
  •  జీఓ నంబర్​ 60 ప్రకారం రూ.15,600 సాలరీ
  •  కటింగులు మినహాయించి  ఇవ్వాల్సింది రూ.13,600
  •  రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నరని కార్మికుల ఆవేదన

మంచిర్యాల, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్  హాస్పిటళ్లలో, మెడికల్  కాలేజీల్లో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​ కార్మికులను ప్రభుత్వం, కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. జీఓ  నంబర్ 60 ప్రకారం కార్మికులకు నెలకు రూ.15,600 జీతం చెల్లించాలి. పీఎఫ్, ఈఎస్ఐ కటింగ్  మినహాయించి రూ.13,600 అందించాలి. కానీ, చాలా చోట్ల రూ.11 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని కార్మికులు పేర్కొంటున్నారు. అది చాలదన్నట్టు కాంట్రాక్టర్లు దొంగ లెక్కలు చూపుతూ పీఎఫ్​డబ్బుల్లోనూ చేతివాటం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగితే పనిలో నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్  హాస్పిటళ్లలో ఇంటిగ్రేటెడ్  హాస్పిటల్  ఫెసిలిటీస్  మేనేజ్​మెంట్​ సర్వీసెస్ (ఐహెచ్ఎఫ్ఎంఎస్) కింద శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, పెస్ట్​ కంట్రోల్​సర్వీసుల కోసం రాష్ట్ర సర్కారు ఔట్​సోర్సింగ్​ వర్కర్లను ఏజెన్సీల ద్వారా నియమించింది. వంద బెడ్లకు 45 మంది చొప్పున కార్మికులను రిక్రూట్​ చేసింది. ఒక్కో బెడ్​కు నెలకు రూ.7,500 చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నది. అందులో నుంచి వర్కర్లకు జీతాలు ఇవ్వడంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల్లో మెడికల్​కాలేజీలకు అనుబంధంగా 330 బెడ్లుగల ఆస్పత్రులు​ఉన్నాయి. ఒక్కో హాస్పిటల్​లో సుమారు 150 మంది ఔట్​సోర్సింగ్​ కార్మికులు పనిచేస్తున్నారు.  

డీఎంఈ సర్క్యులర్  ప్రకారం చెల్లిస్తలే

ఔట్​సోర్సింగ్​ వర్కర్లకు నెలకు రూ.15,600 చొప్పున జీతం చెల్లించాలని ప్రభుత్వం జీఓ నంబర్ 60ని తీసుకొచ్చింది. అందులో నుంచి 12 శాతం పీఎఫ్ , 0.75 శాతం ఈఎస్ఐను మినహాయించి మిగతా మొత్తాన్ని కార్మికులకు చెల్లించాలి. ఇక ఎంప్లాయర్  షేర్ కింద 13 శాతం పీఎఫ్, 3.25 శాతం ఈఎస్ఐను ప్రభుత్వం భరించాలి. కానీ, ఎంప్లాయర్  షేర్  మొత్తాన్ని కూడా కార్మికుల వేతనాల నుంచే కట్  చేస్తున్నారు. దీనికి సంబంధించి డైరెక్టర్  ఆఫ్  మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 2022 ఆగస్టు 19న ఒక సర్క్యులర్​ జారీ చేసింది. దాని ప్రకారం బేసిక్​ సాలరీ రూ.12,090, ఎంప్లాయర్​ షేర్​ కింద పీఎఫ్​, ఈఎస్​ఐ రూ.1,965 (16.25 శాతం), ఎంప్లాయీ షేర్​ కింద రూ.1,542 (12.75 శాతం) కలిపి రూ.3,023, ఈఎస్ఐ ప్రీమియం రూ.484 (నాలుగు శాతం), మొత్తం రూ.15,600గా లెక్క చూపారు. వాస్తవానికి రూ.15,600 వేతనంపై ఎంప్లాయర్​ షేర్​ కింద ఈఎస్ఐ, పీఎఫ్​ను ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, కార్మికుల జీతాల్లో కోత పెడుతున్నారు. 

రూ.లక్షల్లో దోచుకుంటున్న కాంట్రాక్టర్లు

సర్కారే తప్పుడు సర్క్యులర్లు తీసి వర్కర్ల జీతాల్లో కోత పెడుతుంటే తామేం తక్కువ అన్నట్టు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. డీఎంఈ రిలీజ్​ చేసిన సర్క్యులర్​ ప్రకారం బేసిక్​ సాలరీ రూ.12,090కి గాను కాంట్రాక్టర్లకు రూ.11 వేలు మాత్రమే చెల్లిస్తూ మిగతా రూ.1,090 తమ జేబులో వేసుకుంటున్నారు. అలాగే పీఎఫ్​ రూ.1,032 మాత్రమే కడుతున్నారు. రూ.15,600 జీతంపై 12 శాతం చొప్పున రూ.1,872  పీఎఫ్ ​చెల్లించాలి. ఇందులో రూ.800కు పైగా కాంట్రాక్టర్లు దండుకుంటున్నారు. ఒక్కో కార్మికుడిపై దాదాపు రూ.1800 చొప్పున దోచుకుంటున్నారు. మంచిర్యాల గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​ ఔట్​సోర్సింగ్ కాంట్రాక్టును హైదరాబాద్​కు చెందిన కృష్ణ కన్స్ ‌‌‌‌ట్రక్షన్స్​కంపెనీకి మూడేండ్ల కాలవ్యవధిపై అప్పగించారు. ఇక్కడ 150 మంది ఔట్ సోర్సింగ్​ వర్కర్లు ఉన్నారు. ఈ లెక్కన కాంట్రాక్టర్​ నెలకు రూ.2.70 లక్షలు జేబులో 
వేసుకుంటున్నాడు. 

కాంట్రాక్టర్​పై యాక్షన్​ తీసుకోవాలి 

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​కార్మికుల జీతాల్లో కాంట్రాక్టర్​ రూ.వెయ్యి కోత పెడుతున్నడు. అలాగే పీఎఫ్​లో మరో రూ.800 మిగిల్చుకుంటున్నాడు. 150 మంది వర్కర్లపై నెలకు రూ.2.70 లక్షలు దోచుకుంటున్నడు. కాంట్రాక్టర్  అవకతవకలపై ఉన్నతాధికారులు స్పందించి ఎంక్వయిరీ నిర్వహించాలి. కార్మికుల కడుపు కొడుతున్న కాంట్రాక్టర్​పై యాక్షన్​ తీసుకోవాలి. 
- ఎండీ.నయీం పాష, ఆప్​ జిల్లా జనరల్​ సెక్రటరీ 

జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలి 

గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలు, హాస్పిటళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్​ వర్కర్లకు జీఓ 60 ప్రకారం రూ.15,600 జీతం చెల్లించాలి. ఎంప్లాయర్​ వాటా కింద పీఎఫ్​, ఈఎస్ఐలను ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, కార్మికుల జీతాల్లో కోత పెట్టడం అన్యాయం. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం.  
- నర్సింహా, ఏఐటీయూసీ స్టేట్ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ