ఎఫ్​సీఐకి రైస్​ ఇవ్వడంలో తెలంగాణ సర్కార్​ ఫెయిల్

 ఎఫ్​సీఐకి  రైస్​ ఇవ్వడంలో తెలంగాణ సర్కార్​ ఫెయిల్
  • నిరుడు ఎక్కువ బాయిల్డ్​ రైస్​ తీసుకుంటామన్నా ఇయ్యలే..
  • నాలుగైదు సార్లు ఎక్స్​టెన్షన్​ ఇచ్చినం
  • ఎంత స్పీడ్​తో ఇస్తే అంత స్పీడ్​గా ఎఫ్​సీఐ తీసుకుంటది
  • కేంద్ర ఫుడ్​, సివిల్​ సప్లయీస్​ మంత్రి పీయూష్​ గోయల్​ స్పష్టీకరణ
  • పార్లమెంట్ లో టీఆర్​ఎస్​ డ్రామా చేసి, వాకౌట్ చేసింది: ఉత్తమ్
  • కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం అనుమతించిన రైస్​ను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ సీఐ) కు అప్పగించడంలో తెలంగాణ సర్కార్​ ఫెయిలైందని కేంద్ర ఫుడ్, సివిల్ సప్లయ్స్​ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గతంలో ఒప్పుకున్న విధంగా బాయిల్డ్  రైస్  తీసుకోవడానికి ఎఫ్​సీఐ  సిద్ధంగా ఉందని, ఎంత స్పీడ్ తో  రైస్ వస్తే అంత స్పీడ్ గా  తీసుకుంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల పై బుధవారం లోక్ సభ క్వశ్చన్ అవర్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అంతకు ముందు ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా తెలంగాణలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు.

ఈ అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో డ్రామా చేసి, వాకౌట్ చేశారు’’ అని అన్నారు. ఆగస్టులో రాష్ట్రం నుంచి 40 లక్షల టన్నుల రైస్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుందని, అక్టోబర్ లో వడ్లు కల్లాలకు వచ్చాయని, ఇప్పటివరకు అరశాతం కూడా ఎఫ్​సీఐ ప్రొక్యూర్మెంట్ చేయలేదని చెప్పారు. దీనిపై పీయూష్​ గోయల్​ స్పందిస్తూ.. ప్రొక్యూర్మెంట్ పై తప్పుడు ప్రచారం చేసే చాన్స్ ఉన్నందున మళ్లీ మళ్లీ క్లారిటీ ఇస్తున్నట్లు సభకు వివరించారు.  ‘‘తెలంగాణ కోసం ఎఫ్ సీఐ రికార్డు స్థాయిలో ధాన్యం ప్రొక్యూర్మెంట్​కు అనుమతిచ్చింది. నిరుడు ఇంకా ఎక్కువ బాయిల్డ్ రైస్   ఇస్తామని తెలంగాణ చెప్పింది. అందుకు కూడా ఒప్పుకున్నాం. తెలంగాణ డీపీసీ స్టేట్. అందువల్ల రాష్ట్రం నుంచి నేరుగా ధాన్యాన్ని ఎఫ్ సీఐ  సేకరించదు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి కొనుగోలు చేసి, రైస్ గా మార్చి ఎఫ్ సీఐకి అందిస్తుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. గతేడాది రైస్ ను అప్పగించేందుకు నాలుగైదు సార్లు ఎక్స్ టెన్షన్​ ఇచ్చామన్నారు. మరికొంత రైస్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, అందుకూ అంగీకరించామని తెలిపారు. భారీ మొత్తంలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సేకరణను అనుమతించినా, ఆ టార్గెట్స్ ను ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్​ అయిందన్నారు.