
- భూసేకరణ పరిహారానికి విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
వరంగల్, వెలుగు: వరంగల్ మామునూరు ఎయిర్‍పోర్ట్ నిర్మాణంలో మరో ప్రధాన అడుగుపడింది. విమానాశ్రయం ఏర్పాటులో అవసరమైన భూసేకరణ పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్ల నిధులు విడుదల చేసింది. దీనికి బుధవారమే ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు ఎయిర్‍పోర్ట్ పునఃప్రారంభానికి ఎయిర్‍పోర్ట్ ఆఫ్ అథారిటీ సైతం గ్రీన్‍సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో భూసేకరణ జరుగుతోంది. ఎయిర్‍పోర్ట్ నిర్వహణకు 949.14 ఎకరాలు అవసరం ఉండగా.. 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.
మరో 280.30 ఎకరాలు సేకరించాల్సి ఉండగా మధ్యలో కొన్ని ప్రభుత్వ భూములు పోనూ.. ఇంకా 220 ఎకరాల సాగు భూమి, మరో 33 ఎకరాలు ప్లాట్లు, ఖాళీ స్థలాలు సేకరించాల్సి ఉంది.
మొత్తంగా 309 మంది రైతులు, మరో 50 మంది ప్లాట్ల యజమానుల వద్ద మొత్తంగా 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 17న మొదట రూ.205 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అధికారులు గ్రామాలవారీగా భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు. రైతులకు ఒక్కో ఎకరానికి రూ.కోటి 20 లక్షల చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఎయిర్‍పోర్ట్ ఏర్పాటులో ఎట్టిపరిస్థితుల్లో ఆలస్యం జరగకూడదనే ఉద్దేశంతో ఇచ్చినమాట ప్రకారం.. రాష్ట్ర సర్కారు రూ.205 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎయిర్‍పోర్ట్ నిర్మాణ పనులు మరింత వేగం అందుకోనున్నాయి.