50 ఐటీఐల్లో టాటా ట్రైనింగ్.. చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ

50 ఐటీఐల్లో టాటా ట్రైనింగ్.. చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ
  •     50 ఐటీఐల్లో ‘టాటా’ ట్రైనింగ్
  •     రాష్ట్ర  ప్రభుత్వంతో ఒప్పందం కోసం ముందుకొచ్చిన సంస్థ
  •     రాష్ట్ర  ప్రభుత్వంతో ఒప్పందం కోసం ముందుకొచ్చిన సంస్థ
  •     చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇవ్వాలన్న సీఎం 
  •     ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచన
  •     టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో రేవంత్​ భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఉపాధి శిక్ష ఇవ్వడానికి ముందుకొచ్చిన టాటా సంస్థను సీఎం రేవంత్​రెడ్డి అభినందించారు. టాటా సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయనుందని, అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో యువతకు టెక్నాలజీపై శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనపై టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం రేవంత్​శనివారం సెక్రటేరియెట్ లో సమావేమయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం దొరికేలా, సొంతంగా పరిశ్రమ ఏర్పాటు చేసుకొనే విధంగా కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయం వృథా అవుతున్నదన్నారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐలలో రూ.1,500 నుంచి రూ. రెండు వేల కోట్ల ఖర్చుతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.  

ఐటీఐలలో శిక్షణ  ఇవ్వనున్న టాటా 

ఐటీఐల్లో యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ తయారీ, అధునాతన సీఎన్సీ మిషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థ ముందుకొచ్చింది. ఈ కోర్సులకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్​వేర్ అందించడంతోపాటు ప్రతి ఐటీఐలో ఇద్దరు మాస్టర్ ట్రెయినర్లను టాటా సంస్థ అందించనుంది. ఈ ప్రాజెక్టును ఐదేండ్ల పాటు ఉచితంగా నిర్వహిస్తుంది. ఇందులో 
భాగంగా టెక్నాలజీపై వర్క్ షాపులు, అత్యధిక డిమాండ్ కలిగిన తయారీ రంగంలో ఉపాధి కల్పించడానికి 22 నూతన స్వల్పకాలిక, ఐదు దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందించనున్నారు. 

సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, కార్మిక, ఉపాధికల్పన శాఖ స్పెషల్​ సీఎస్​ రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సీఎంఓ అధికారులు శేషాద్రి, షానవాజ్, అజిత్ రెడ్డిలతోపాటు టాటా టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీవీ కౌల్గుడ్, గ్లోబల్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.