
- హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన
- కక్షసాధింపుతో కేసు నమోదు చేయలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు నమోదైన కేసులో ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఏ దశలోనూ పిటిషనర్ హరీశ్‌కు ఉపశమనం కల్పించొద్దని ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూద్రా వాదించారు. హరీశ్‌పై కక్షసాధింపుతో కేసు నమోదు చేశామని చెప్పడం సరికాదన్నారు. తన ఫోన్‌ను, కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్ రావు ట్యాప్ చేయించారంటూ జి.చక్రధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును క్వాష్ చేయాలంటూ హరీశ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారించారు. లూద్రా వాదనలు కొనసాగిస్తూ.. 30 మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలకు తగిన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల దర్యాప్తునకు పిటిషనర్ అవకాశమే ఇవ్వలేదన్నారు. డిసెంబరు 1న ఫిర్యాదు నమోదు కాగా.. అదే నెల 5న కోర్టును ఆశ్రయించారని అన్నారు.
హరీశ్ రావు అప్పటి డీసీపీగా ఉన్న రాధా కిషన్ రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా బెదిరించారని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే వాటికి కూడా ఆధారాలున్నాయని చెప్పారు. ఫిర్యాదుదారుతోపాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు, సిబ్బందితో సహా దాదాపు 30 మంది ఫోన్లను ట్యాప్ చేయించారన్నారు. ఇలా చేయడం వ్యక్తిగత గోప్యత, రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని చెప్పారు. టెలిగ్రాఫ్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. హరీశ్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదిస్తూ.. ఫిర్యాదులోని ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. రాజకీయ ప్రతికారంతోనే కేసు పెట్టారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వంద కుటుంబాలకు రూ.లక్ష చొప్పున కోటి రూపాయలు పరిహారంగా చక్రధర్ గౌడ్ చెల్లించినట్టు ఆదాయపన్ను శాఖ రికార్డులను సమర్పించలేదన్నారు.
అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులు పొడిగింపు..
వాదనల అనంతరం.. హరీశ్ రావును అరెస్టు చేయొద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. అరెస్టు చేయొద్దని, అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇదే కేసులో రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అదే రోజు విచారిస్తామని పేర్కొంది. అలాగే, ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు అందజేసినట్టు ఆధారాలు చూపాలంటూ పిటిషనర్ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.