గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్
  •     వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్ల స్వీకరణ
  •     జూన్​ 5న ఓట్ల లెక్కింపు.. షెడ్యూల్​ రిలీజ్​ చేసిన ఈసీ 
  •     మొత్తం ఓటర్లు 4,61,806 మంది

హైదరాబాద్, వెలుగు:  వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్​కు ఎలక్షన్​ కమిషన్​ షెడ్యూల్​ ప్రకటించింది. మే 2న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణకు మే 13 వరకు గడువు ఉంటుంది. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్లు లెక్కిస్తారు. 2021లో ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. వరంగల్ –- ఖమ్మం –- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్స్​ ఓటర్లుగా నమోదు చేసుకునే గడువు పూర్తవడంతో తాజాగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు.

సీఎంను కలిసిన తీన్మార్​ మల్లన్న

వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను ఇప్పటికే  కాంగ్రెస్‌ ప్రకటించింది. 2021లో ఇదే స్థానం నుంచి ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను గురువారం సీఎం రేవంత్​రెడ్డిని తీన్మార్​ మల్లన్న కలిసి కృతజ్ఞతలు తెలిపారు.