న్యూఢిల్లీ/కరీంనగర్, వెలుగు: జీ20 సమిట్ జరిగే ‘భారత్ మండపం’లో ఇండియా సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు తెలియజేసేలా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ హ్యాండి క్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలు, హస్తకళల స్టాల్స్‌ను ప్రదర్శించనున్నారు. క్రాఫ్ట్ బజార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని చేనేత వస్త్రాలు, హస్త కళలు తదితరాలను అందుబాటులో ఉంచారు. తెలంగాణలోని చేర్యాల, నిర్మల్ పెయింటింగ్స్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, గొల్ల భామ చీరలు, నారాయణపేట, పోచంపల్లి డిజైన్స్, భువనగిరికి చెందిన పుట్టపాక తేలియా రుమాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పుట్టపాకలోని చేనేత హ్యాండ్లూమ్ క్లస్టర్‌లో పరిధిలో తయారయ్యే తేలియా రుమాల్ వస్త్రానికి ఇటీవల జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ ట్యాగ్) లభించింది. అలాగే, ఏపీకి చెందిన మచిలీపట్నం, శ్రీకాళహస్తి కళాకారులు తయారు చేసే కళంకారీ వస్త్రాల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
జీ20 గెస్టుల సూట్స్‌పై కరీంనగర్ ఫిలిగ్రీ బ్యాడ్జ్‌లు..
జీ20 సమిట్‌కు హాజరయ్యే గెస్టుల సూట్స్‌పై కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు రూపొందించిన ధర్మ చక్రం ప్రత్యేకంగా నిలవనుంది. కోణార్క్ సూర్య దేవాలయంలోని ధర్మ చక్రం మోడల్‌తో బ్యాడ్జీని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అసోసియేషన్ ప్రతినిధులు ఎర్రోజు అశోక్, గద్దె అశోక్ రూపొందించారు. 200 బ్యాడ్జీలకు కేంద్ర ప్రభుత్వం 3 నెలల క్రితం ఆర్డర్ ఇవ్వగా, వాటిని సిద్ధం చేసి పంపించారు. దేశ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా మెమెంటోలను కూడా సిద్ధం చేశారు. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ పెవిలియన్‌ను కూడా సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అడ్వాన్స్ డెవలప్డ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌ను ఈ స్టాల్‌లో చూడొచ్చు. ఆర్థిక రంగాన్ని విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్, పేపర్ లెస్ వర్క్స్, యూపీఐ ఇన్ వరల్డ్, రూపే, భారత్ బిల్ పేమెంట్స్ సేవల గురించి తెలుసుకోవచ్చు.
