
- 74.32% లబ్ధిదారులకు టేక్ హోం రేషన్ పంపిణీ
- వెల్లడించిన కేంద్ర పోషణ్ ట్రాకర్ యాప్
హైదరాబాద్, వెలుగు: అంగన్‌వాడీ సేవల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర పోషణ్ ట్రాకర్ యాప్ లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా 74.32% లబ్ధిదారులకు టేక్ హోం రేషన్ (టీహెచ్‌ఆర్) పంపిణీ జరుగుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం18,59,978 మంది లబ్ధిదారులకు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం ద్వారా పోషకాహారం నేరుగా చేరుతోంది.
తొలి నాలుగు స్థానాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్ష్యదీప్, అండమాన్, ఢిల్లీ , పుదుచ్చేరిలు ఉండగా.. రాష్ర్టాల కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు ట్రాకర్ లో కేంద్రం పేర్కొంది. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా పాలు, గుడ్లు, బాలమృతం వంటి సరకులు లబ్ధిదారులకు దారి మళ్లింపు లేకుండా అందుతున్నాయి. అంగన్‌వాడీ సిబ్బంది లబ్ధిదారుల వివరాలను తొలిసారి ఈ-కేవైసీ, లైవ్ ఫోటో క్యాప్చర్ ద్వారా నమోదు చేస్తారు.
ప్రతి నెల ఫేస్ మ్యాచింగ్ ద్వారా సరైన లబ్ధిదారులకు సరకులు అందజేస్తారు. ఈ విధానం పారదర్శకతను, సమర్థతను పెంచింది. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. "ఎఫ్‌ఆర్‌ఎస్ వల్ల నిజమైన లబ్ధిదారులకు పోషకాహారం చేరుతోంది. 90% కవరేజ్ లక్ష్యంగా చర్యలు చేపట్టాం. అంగన్‌వాడీ సేవల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది" అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.