టీచర్ల రేషనలైజేషన్​కు కసరత్తు!

టీచర్ల రేషనలైజేషన్​కు కసరత్తు!
  • స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా పోస్టులు
  • ఖాళీలకు భారీగా కోతపడే అవకాశం  
  • డీఈఓలను డైరెక్టరేట్​కు పిలిచి వివరాలు సేకరించిన సర్కారు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ల రేషనలైజేషన్​పై ప్రభుత్వం దృష్టి సారించింది. స్టూడెంట్ల సంఖ్య​కు అనుగుణంగా పోస్టులను కుదించాలని యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్​లో డీఈఓలతో అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఉన్న స్టూడెంట్లకు సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్ నామ్స్ ప్రకారం ఎన్ని టీచర్ పోస్టులు అవసరమవుతాయన్న వివరాలను దగ్గరుండి సేకరించారు. దీని ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్  చేస్తే భారీగా టీచర్  పోస్టులకు కోత పడే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు స్కూళ్లుండగా, 20 లక్షల మంది స్టూడెంట్లున్నారు. ఆయా బడుల్లో సుమారు 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. నిరుడు విద్యార్థుల సంఖ్యతో చూస్తే 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు లెక్కతీశారు. దీంట్లో అత్యధికంగా ఎస్జీటీలు 6,360 ఉండగా, స్కూల్ అసిస్టెంట్లు 2,179 మంది ఉన్నారు. మిగిలిన పోస్టులు లాంగ్వేజీ పండిట్లు, పీఈటీలున్నాయి. 

ఈ వివరాలను అధికారులు అప్పట్లోనే సర్కారుకు పంపించారు. గత ఏడాది టెట్ కూడా నిర్వహించడంతో టీఆర్టీ నోటిఫికేషన్  వేస్తారని అభ్యర్థులు భావించినా.. ప్రభుత్వం ఆ ప్రక్రియ ఇంకా మొదలుపెట్టలేదు. తాజాగా మరోసారి టెట్  నోటిఫికేషన్  ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టీచర్  పోస్టుల భర్తీపై అందరి దృష్టి పడింది.

నిరుద్యోగుల ఆందోళనతో సర్కారులో కదలిక

ఇటీవల జరిగిన ఎడ్యుకేషన్  క్యాబినెట్ సబ్ కమిటీలో టీఆర్టీ నోటిఫికేషన్ అవసరం లేదనే చర్చ జరిగింది. అయితే, టీఆర్టీ నోటిఫికేషన్  ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనలు చేపడుతుండడంతో సర్కారు మళ్లీ ఆలోచనలో పడి, రాష్ట్రంలో ఖాళీల వివరాలను ఇవ్వాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో 33 జిల్లాల డీఈఓలందరినీ బుధవారం హైదరాబాద్  డైరెక్టరేట్​కు పిలిపించి, అక్కడే ఖాళీలపై కసరత్తు చేయించారు. రాత్రి వరకూ అంతా అక్కడే ఉండి, సమగ్ర వివరాలను డైరెక్టరేట్  అధికారులకు అందించారు. 

ఓవరాల్  స్టూడెంట్ల సంఖ్యతో చూస్తే, టీచర్ల సంఖ్య ఎక్కువగానే ఉందని సర్కారు పెద్దలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా యూనిట్ గా, స్కూల్ యూనిట్​గా వివరాలు తీసుకున్నారు. దీంతో పిల్లల్లేని స్కూళ్లలోని టీచర్లను ఇతర ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ నడుస్తున్నది. ముందుగా మండల యూనిట్​గా, ఆపై జిల్లా యూనిట్​గా ఖాళీలకు అనుగుణంగా అడ్జెస్ట్ మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.