డబుల్ బెడ్రూం ఇండ్లు .. స్థానికులకే ఇవ్వాలి

డబుల్ బెడ్రూం ఇండ్లు .. స్థానికులకే ఇవ్వాలి
  • తుక్కుగూడ హైవేపై బీజేపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఆందోళన
  • అరెస్ట్ చేసి పీఎస్​లకు తరలించిన పోలీసులు

తుక్కుగూడ, వెలుగు:  రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి మంఖాల్​లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఓల్డ్ సిటీ వాసులకు ఎలా కేటాయిస్తారంటూ స్థానిక లబ్ధిదారులు ప్రశ్నించారు. స్థానికులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ శనివారం బీజేపీ నాయకులతో కలిసి  తుక్కుగూడలోని శ్రీశైలం హైవేపై  బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. తుక్కుగూడలోని మంఖాల్–1లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల మొదటి విడతను మంత్రి సబిత ప్రారంభించి.. డ్రా ద్వారా ఇండ్లను కేటాయించారన్నారు.

ఇండ్లు దక్కిన వారిలో 80 శాతం ఓల్డ్ సిటీలోని చార్మినార్, మలక్​పేట, చాంద్రాయణగుట్ట, యాకత్​పురా సెగ్మెంట్లకు చెందిన లబ్ధిదారులే ఉన్నారన్నారు. స్థానికులకు కాకుండా ఇతర సెగ్మెంట్లకు చెందిన వారికి డబుల్ ఇండ్లు ఎలా కేటాయిస్తారంటూ వారు ప్రశ్నించారు.  మంత్రి సబిత మజ్లిస్ పార్టీకి తొత్తులాగా వ్యవహరించడం సరికాదని వీరేందర్ గౌడ్ మండిపడ్డారు.  ఇప్పటికైనా స్థానికులకు ఇండ్లు కేటాయించకుంటే లబ్ధిదారులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న వీరేందర్ గౌడ్​తో పాటు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం సెగ్మెంట్ ఇన్​చార్జి అందెల శ్రీరాములు, బీజేపీ నేతలు, స్థానిక లబ్ధిదారులను పోలీసులు అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్​, ఇబ్రహీంపట్నం పీఎస్​లకు తరలించారు. 

నాలుగేండ్ల కిందట దరఖాస్తు చేసిన  

 మాకు సొంతిల్లు లేదు. డబుల్ బెడ్రూం ఇల్లు కోసం నాలుగేండ్ల కిందట అప్లయ్ చేసిన. ఇన్నిరోజులు దానిపైనే ఆశ పెట్టుకున్నం. స్థానికులైన మమ్మల్ని కాదని వేరే చోట ఉన్నోళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే చూస్తూ ఊరుకోం. మంత్రి సబితను ఊరిలోకి రానివ్వం.     - 

మనీషా, మంఖాల్​ గ్రామం

బాత్రూం అంత జాగలో ఉంటున్నం

మంచి ఇల్లు లేక బాత్రూం అంత జాగలో ఉంటున్నం. ఊరోళ్లను కాదని ఎక్కడో ఉన్నోళ్లకు ఇండ్లు ఎట్ల కేటాయిస్తరు? స్థానిక పేదలకు ముందుగా ఇవ్వాలి. 

మంజుల, మంఖాల్