పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు వస్తాయి : హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద

పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు వస్తాయి : హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద

దేవరకొండ(చందంపేట), వెలుగు : గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివే యువతకు మంచి ఆలోచనలు వస్తాయని తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద అన్నారు. ఆదివారం చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘మన ఊరు.. మన గ్రంథాలయం’ కార్యక్రమానికి హైకోర్టు పీపీ పల్లె నాగేశ్వరరావుతో కలిసి ఆమె హాజరయ్యారు. గ్రామ పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలేపల్లి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రంథాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలిపారు. 

గ్రంథాలయాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు చింతపల్లి మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టు జడ్జిని ఆలయ కమిటీ చైర్మన్ ధనుంజయ శాలువాతో ఘనంగా సత్కరించారు. చందంపేట మండలం పెద్దమునిగల్ లో శివాలయాన్ని ఆమె దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో రమణారెడ్డి, హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు జగన్, హైకోర్టు అడిషనల్ పీపీ ప్రశాంత్, కొమ్ము ప్రవీణ్, వెంకటరెడ్డి, వేణుగోపాల్, ఉమామహేశ్వర్, తహసీల్దార్ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.