పంట నష్టపోయిన రైతులకు 4 నెలల్లో పరిహారం ఇయ్యాలె

పంట నష్టపోయిన రైతులకు 4 నెలల్లో పరిహారం ఇయ్యాలె
  • కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సిందే: హైకోర్టు
  • 3 నెలల్లోగా పంట నష్టాలను లెక్కించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నిరుడు అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నాలుగు నెలల్లోగా విపత్తుల నిర్వహణ చట్టం కింద ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంట నష్టాన్ని మూడు నెలల్లో లెక్కించి.. ఆ తర్వాత మరో నెల రోజుల్లోగా కౌలు రైతులు సహా బాధిత రైతులందరికి పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. 2020 సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో వానలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ వి.కిరణ్‌కుమార్‌, రవి కన్నెగంటి, ఎస్.ఆశాలత దాఖలు చేసిన పిల్​పై మంగళవారం తీర్పు చెప్పింది. నష్టపోయిన రైతాంగాన్ని జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టం కింద ఆదుకోవాల్సిందేనని యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ తన 49 పేజీల తీర్పులో పేర్కొంది.

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు ఎవరూ పిల్ వేయలేదు కనుక కొట్టేయాలని, పంటలు నష్టపోలేదని, అధికారులు తీసుకున్న చర్యలతో రైతులకు పంట నష్టం జరగలేదని ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ‘‘అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లెటర్లు రాశారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 2.04 లక్షల హెక్టార్ల వరి, 3.10 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని సీఎం కేంద్రానికి రాసిన లెటర్లో పేర్కొన్నారు.  రైతులకు సాయం కోసం రూ. 465 కోట్లు, ఇతర సహాయ చర్యల కోసం రూ.885 కోట్లు కావాలని కోరుతూ సీఎం రాసిన లెటర్ కేంద్రం మాకు అందజేసింది. 5.97 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, విపత్తుల సహాయ నిధి నుంచి రూ.552 కోట్లు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ మేరకు నష్టాన్ని అంచనా వేస్తే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ కింద రూ.7,219 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లెటర్ కూడా కేంద్రమే ఇచ్చింది. కానీ అధికారులు తీసుకున్న చర్యల వల్ల పంట నష్టం జరగలేదని ఇప్పుడు ప్రభుత్వం చెబుతోంది. నష్టం జరగలేదనే విషయంపై రాష్ట్రం కేంద్రానికి ఎటువంటి లెటర్లు రాయలేదు. అకాల వర్షాల వల్ల పంటలకు కలిగే నష్టం నుంచి తేరుకునేలా చేయడం ఎవరికీ సాధ్యం కాదు” అని పేర్కొంది.

ఫసల్​ బీమా లేక పరిహారం అందలేదు

2019–20 కంటే 2020–21లో పంటల దిగుబడి తక్కువగా ఉందని రాష్ట్రం చెప్పింది. విపత్తుల నిర్వహణ కింద కేంద్రం రూ.595 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర వాటాతో కలిపితే ఆ మొత్తం రూ.978 కోట్లు ఉంది. కేంద్రం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ కింద రూ.188 కోట్లు వాడుకునేందుకు కేంద్రం అనుమతిచ్చినా ఆ మేరకు రాష్ట్రం.. నష్టపోయిన రైతులకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీలు ఇవ్వలేదు. చట్టం ప్రకారం 33% పంటలు నష్టపోతే విపత్తుల సహాయ నిధి నుంచి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. అయితే, పంటలకు నష్టం జరిగింది. పంటల బీమా లేకపోవడం వల్ల రైతులకు పరిహారం అందలేదు. అకాల వర్షం వల్ల నష్టపోయిన సన్నకారు, చిన్నకారు, కౌలు రైతులను ఆదుకోలేదు. కౌలు రైతులకు రైతుబంధు పథకం కింద రూ.10 వేలు ఆర్థిక సాయం అందడం లేదని ప్రభుత్వమే చెప్పింది. రైతుబంధు నిధులు ఇతర రైతులకు ఇస్తున్నాం కాబట్టి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ ఇవ్వడం లేదని ప్రభుత్వం చెప్పడం వాస్తవం కాదు. పీఎం ఫసల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీమా యోజన స్కీంను వినియోగించుకోవాలని రైతులను చైతన్యం చేయడంలో ఫెయిల్ అయింది. ప్రభుత్వం బాధ్యతను విస్మరించింది. రైతులు అకాల వర్షాలకు నష్టపోయిన తర్వాత వాటిని అంచనా వేసి విపత్తుల సహాయ నిధి ద్వారా ఆదుకోవాల్సిందే.. అని హైకోర్టు తీర్పు చెప్పింది.