
హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో స్పందించకపోవడంతో సీఎస్ సహా ముగ్గురు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధిక్కరణకు పాల్పడినందుకు చర్యలు ఎందుకు తీసుకోరాదో ఈ నెల 24న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గ్రంథాలయ శాఖలో స్వీపర్లకు పెంచిన వేతనాలను చెల్లించకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణరావు, పబ్లిక్ ల్రైబరీస్ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్ చారి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
జీవో 841, 33ల ప్రకారం.. లైబ్రేరియన్ గ్రేడ్-3తో సమానంగా పార్ట్‌టైం స్వీపర్లకు వేతనాలు చెల్లించాలంటూ గత ఏడాది డిసెంబరు 19న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ స్వీపర్లు ఎ.వి.హేమలత మరో ఇద్దరు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి ప్రతివాదులైన ఐఏఎస్ అధికారులకు మార్చి 28న నోటీసులు జారీ చేసినా వారి తరఫున న్యాయవాదులు హాజరుకాలేదు. ఈ పిటిషన్‌పై ఇటీవల మరోసారి విచారణ చేపట్టి కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా ఈనెల 24న హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.