రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ రికార్డ్... కేపీహెచ్ బీలో ఎకరం రూ.70 కోట్లు

రియల్ ఎస్టేట్ లో  హైదరాబాద్  రికార్డ్... కేపీహెచ్ బీలో ఎకరం రూ.70 కోట్లు
  • 7.8 ఎకరాలను రూ.547 కోట్లకు కొన్న గోద్రెజ్ ప్రాపర్టీస్
  • రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకంతో రూ.70 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో రికార్డు నమోదైంది. కేపీహెచ్​బీలో ఎకరం రూ.70 కోట్లు పలికింది. హౌసింగ్ బోర్డుకు చెందిన 7.8 ఎకరాలను వేలం వేయగా.. రూ.547 కోట్లకు గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీ కొనుగోలు చేసింది. బుధవారం నిర్వహించిన ఈ ఆక్షన్​లో భూమి అమ్ముడుపోయింది. హైదరాబాద్ సిటీలోని కేపీహెచ్​బీలో ఈ భూమి కొనేందుకు 4 ప్రముఖ కంపెనీలు పోటీ పడ్డాయి. 


ఎల్–1లో గోద్రెజ్​కు ఈ భూమి దక్కింది. 7.80 ఎకరాలు ఈ-వేలం ద్వారా అమ్మేందుకు హౌసింగ్ బోర్డు పోయిన నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. సుమారు మూడున్నర గంటల పాటు నిర్వహించిన ఈ వేలం పాటలో ఎకరాకు రూ.40 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా, బిడ్డర్లు 46 సార్లు ధరను పెంచుతూ వేలంలో పాల్గొన్నాయి. ఈ వేలం పాటలో గోద్రేజ్ సంస్థ అత్యధికంగా ఎకరానికి రూ.70 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చిందని హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. భూముల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం కల్గించే గృహ నిర్మాణ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్​కు చెందిన టౌన్ షిప్ లలో అసంపూర్తిగా ఉన్న 3 టవర్లు విక్రయించగా.. రూ.70.11 కోట్ల ఆదాయం వచ్చింది. 

హైదరాబాద్ సిటీ శివార్లలోని పోచారం టౌన్ షిప్​లో మొత్తం 184 ఫ్లాట్లు ఉన్న 2 టవర్లను (112 ఫ్లాట్లు, 72 ఫ్లాట్లు), గాజుల రామారంలోని 112 ఫ్లాట్​లు ఉన్న ఒక టవర్​ను బుధవారం లాటరీ ద్వారా కేటాయించారు. పోచారంలోని నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.1,650 ధరను, గాజులరామారంలోని వాటికి రూ.1,995గా నిర్ణయించారు. ఇందులో భాగంగా పోచారంలో 72 ఫ్లాట్లతో అసంపూర్తిగా ఉన్న టవర్​ను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్​కు రూ.13.78 కోట్లకు, 122 ఫ్లాట్లు ఉన్న మరో టవర్​ను గాయత్రీ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టుకు రూ.30 కోట్లకు లాటరీ ద్వారా కేటాయించింది. అలాగే, గాజులరామారంలోని 112 ఫ్లాట్లతో అసంపూర్తిగా ఉన్న టవర్ ను ఎఫ్ సీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి రూ.26.33 కోట్లకు ప్రభుత్వం విక్రయించింది.