కాళేశ్వరంపై విచారణ జరిపిస్తం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

కాళేశ్వరంపై విచారణ జరిపిస్తం : ఉత్తమ్​కుమార్​రెడ్డి
  • త్వరలోనే బ్యారేజీ సందర్శన బ్యారేజీ కుంగడం తీవ్రమైన అంశం
  • కాళేశ్వరం ఖర్చు, ఆయకట్టు వివరాలు ఇవ్వాలి.. 
  • ఇంజినీర్లకు ఆదేశం.. ప్రాజెక్టులపై తొలిసారి రివ్యూ
  • కేబినెట్​ భేటీలో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మిస్తామని వెల్లడి
  • రావాలని చెప్పినా రివ్యూ మీటింగ్​కు అటెండ్​ కాని డిపార్ట్​మెంట్​ సెక్రటరీ స్మితా సబర్వాల్​

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తామని, ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డలో నిర్మాణ లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని, బ్యారేజీ నిర్మించిన ఏజెన్సీ ఆ పర్యటనలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఇంజనీర్లను ఆయన ఆదేశించారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగడం చాలా తీవ్రమైన అంశమని అన్నారు. సోమవారం తొలిసారి ప్రాజెక్టులపై ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజనీర్లతో జలసౌధలో ఉత్తమ్​ రివ్యూ చేశారు. 

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ ​కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులను ఈఎన్సీ (జనరల్) మురళీధర్​వివరించారు. బ్యారేజీని రూ.4,600 కోట్లతో నిర్మించామని చెప్పారు. ఏడో బ్లాక్​లోని ఒక పిల్లర్​1.2 మీటర్లు కుంగడంతో దాని ప్రభావం మరో మూడు పిల్లర్లపై పడి వాటిలో పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఆగస్టు 21న సాయంత్రం పిల్లర్లు కుంగాయని, ఆ రోజు నుంచే బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని ఖాళీ చేశామని అన్నారు. నీటిని ఖాళీ చేయడంతో పిల్లర్లు కుంగడం తగ్గిందని తెలిపారు. మంత్రి ఉత్తమ్​మాట్లాడుతూ.. బ్యారేజీ కుంగిపోవడం చాలా తీవ్రమైన అంశమని అన్నారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మొత్తం ఎంత ఖర్చు చేశారు? ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు? ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో ఎకరానికి సాగు నీరు అందించడానికి ఎంత ఖర్చవుతుంది?.. అనే వివరాలన్నీ అందజేయాలి” అని ఆదేశించారు. రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తే నామమాత్రంగా ఆయకట్టు ఉందని, ఇదేమిటని ఇంజనీర్లను ఆయన నిలదీశారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్​ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. వర్క్​ఏజెన్సీకి చెల్లించాల్సిన కరెంట్​బిల్లు బకాయిలు ఎంత అని ఆరా తీశారు. రాష్ట్రంలో ఉన్న 40 చెరువుల పునరుద్ధరణ, వాటి కింద ఆయకట్టుకు భరోసా కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

తుమ్మిడిహెట్టి నిర్మిస్తం..

కాంగ్రెస్​ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మిస్తామని, దీనిపై కేబినెట్​ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రకటించారు. ఇంజనీర్లతో రివ్యూ అనంతరం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. తక్కువ ఖర్చుతో నీటిని లిఫ్ట్​చేసే ప్రాణహిత – చేవెళ్లను పక్కన పెట్టి కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టును ఎలా వినియోగించుకోవాలనే దానిపైనా ఆలోచన చేస్తామని చెప్పారు.

ప్రజల డబ్బులతో కట్టే ప్రాజెక్టుల విషయంలో బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు. కృష్ణాలో నీటి వాటాలు తేల్చడంపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. డిపార్ట్​మెంట్​లో రహస్య జీవోలు లేకుండా చర్యలు చేపడుతామన్నారు. ఈ నెల 14న సెక్రటేరియట్​లో ఇరిగేషన్​శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని.. ప్రజలు, అధికారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. 

ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా రివ్యూలు

వచ్చే వారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై వేర్వేరుగా రివ్యూ చేస్తానని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్​స్కీంపై పూర్తి వివరాలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని, దానికి ఎలా నిధులు సమీకరించారని, అన్ని వివరాలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. ‘‘నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు థర్డ్​పార్టీ చెకింగ్​ఉందా..? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఉందా?’’ అనే వివరాలు అడిగారు.

ఇప్పటికే ఒక ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టును కాళేశ్వరం కింద ఎలా చూపిస్తారని, వర్షం వచ్చినప్పుడు నీటిని లిఫ్ట్​ చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘‘ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో ఏదో జరుగుతుందనే అపోహలు, అనుమానాలు ఉన్నయ్​. ఇకపై డిపార్ట్​మెంట్​లో అవినీతికి తావులేకుండా సమర్థంగా పని చేయాలి” అని హెచ్చరించారు.

వందేండ్లు ఉండాల్సిన ప్రాజెక్టులు తొందరగానే దెబ్బతింటున్నాయని, అలా ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల వారీగా అన్ని వివరాలతో ఇకపై రివ్యూకు వస్తామని ఇంజనీర్లు తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్​స్కీంలు సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వివరాలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

లిఫ్ట్​ స్కీంల కోసం వినియోగిస్తున్న కరెంట్​వివరాలు కూడా ఇవ్వాలన్నారు. సమీక్షలో ఈఎన్సీలు మురళీధర్, అనిల్​కుమార్, నాగేందర్​రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, శంకర్, సీఈలు, ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు. ఇరిగేషన్​పై రివ్యూకు రావాలని డిపార్ట్​మెంట్​సెక్రటరీ స్మితా సబర్వాల్​కు సమాచారం ఇచ్చినా ఆమె హాజరుకాలేదు.