సామాజిక న్యాయానికి తెలంగాణే చిరునామా!

సామాజిక న్యాయానికి తెలంగాణే చిరునామా!

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం సామాజిక న్యాయానికి మరోమారు పెద్దపీట వేసింది.  కాంగ్రెస్‌‌ అంటేనే సామాజిక న్యాయమని మరోమారు నిరూపించింది.  సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు మంత్రి పదవులలో న్యాయం చేసింది. రాష్ట్ర మంత్రివర్గ  విస్తరణను పూర్తిగా బీసీ, ఎస్సీలతో నింపింది.  మంత్రివర్గ  విస్తరణలో ఇద్దరు ఎస్సీలు, ఒక బీసీకి స్థానం కల్పించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌‌ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. 

కాంగ్రెస్‌‌ పార్టీ అంటేనే  సామాజిక న్యాయానికి ప్రతిరూపం. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా, బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఎస్సీ వర్గీకరణను ఆమోదించి అమలుచేస్తున్న మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొంది  సామాజిక న్యాయానికి కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా తెలంగాణ  పేరును  కాంగ్రెస్‌‌  దేశవ్యాప్తం చేసింది.  

రాహుల్‌‌ గాంధీ కాశ్మీర్‌‌ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర నిర్వహించినప్పుడు బడుగు, బలహీనవర్గాలు అనుభవిస్తున్న కష్టాలను ఆయన కళ్లారా చూశారు. దానిని దృష్టిలో పెట్టుకొని దేశంలో కులగణన చేసి ఆయా కులాలకు తగినవిధంగా సామాజిక న్యాయం చేస్తే తప్ప వారికి న్యాయం జరగదని ఆయన భావించారు. జిత్‌‌నీ సంఖ్యా భారీ, ఉస్కీ ఉత్నే కీ భాగీదారీ ‘మేమెంతో మాకంత’  న్యాయం చేయాలని ఆయన నినదించారు.  

కేంద్ర ప్రభుత్వం కులగణనను చేయాలని ఆయన డిమాండ్‌‌ చేశారు. రాహుల్‌‌ డిమాండ్‌‌ను కేంద్రం పెడచెవిన పెట్టింది. ఇష్టమైతే  ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కులగణనను చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణనను చేపట్టి ఆ లెక్కల వివరాలను బయటపెట్టి, తెలంగాణలో మాదిరిగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌‌ పార్టీ కేంద్రాన్ని కోరింది. రాహుల్‌‌గాంధీ డిమాండ్‌‌తో, ప్రజలు కూడా గొంతు కలపడంతో తప్పనిసరై కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణనను సైతం చేర్చడానికి అంగీకరించింది. 

కులాలవారీ జనగణన

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం కులాల వారీ జనాభా లెక్కలను సేకరించింది. ఈ వివరాల ప్రకారం రాష్ట్ర జనాభాలో  మొత్తం బీసీలు 56.33 శాతం ఉన్నారు. ఎస్సీలు 17.43శాతం, ఎస్టీలు 10.45శాతం, ఓసీలు 13.31శాతం ఉన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వేలో రాష్ట్రం మొత్తంగా జనాభాలో 96.8శాతం మంది ప్రజలు పాల్గొన్నారు. 

మరో 3.1శాతం మంది అనగా 16లక్షల మంది వివిధ  కారణాలతో ఈ సర్వేలో  పాల్గొనలేదు. రాష్ట్రంలోని 3.70 కోట్ల జనాభాలో 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వేను చేపట్టడమే కాక, బీసీ బిల్లును, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో, మండలిలో ప్రవేశపెట్టి ఈ తీర్మానాలను ప్రభుత్వం ఆమోదించింది.  దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా బీసీ బిల్లును, ఎస్సీ వర్గీకరణ బిల్లులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు

కులగణనలో తేలిన లెక్కల ఆధారంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇదేగాక, పార్టీ పదవుల్లో సైతం కాంగ్రెస్‌‌ బడుగు, బలహీనవర్గాలకు అగ్రస్థానం కల్పించింది.  కాంగ్రెస్‌‌ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఎస్సీ వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్‌‌ పార్టీ నియమించింది.  

2004, 2009 ఎన్నికలలో  కేంద్రంలో కాంగ్రెస్‌‌ విజయం సాధించింది. 2004లో కాంగ్రెస్‌‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాను  ప్రధాని పదవికి కాంగ్రెస్‌‌ పార్లమెంటరీ పార్టీ ఎన్నుకున్నది. కానీ, ఆమె ఆ పదవి చేపట్టడానికి నిరాకరించారు. 2009లో రాహుల్‌‌ను ప్రధాని పదవి స్వీకరించాల్సిందిగా పార్టీ ఏకగ్రీవంగా కోరినప్పటికీ ఆయన అంత పెద్ద పదవిని తృణప్రాయంగా వదిలివేశారు.  రాహుల్‌‌, సోనియాలు తమకు పదవీకాంక్ష లేదని, దేశ క్షేమమే తమకు ముఖ్యమని చాటిచెప్పారు. 

ఎఐసీసీ అధ్యక్షుడిగా ఎస్సీ

ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడుగా ఎస్సీ వర్గానికి మల్లికార్జున ఖర్గే కొనసాగుతుండగా,  తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా బీసీ వర్గానికి చెందిన మహేష్‌‌కుమార్‌‌ గౌడ్‌‌ కొనసాగుతున్నారు. అసెంబ్లీ స్పీకర్‌‌గా ఎస్సీ వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌  బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  డిప్యూటీ స్పీకర్‌‌గా ఎస్టీ లంబాడా సామాజికవర్గానికి చెందిన రామచంద్రు నాయక్‌‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు.  

ప్రస్తుతం జరిగిన మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్‌‌, గడ్డం వివేక్‌‌లు ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు కాగా, వాకిటి శ్రీహరి బీసీ సామాజికవర్గానికి చెందినవారు. ముఖ్యమంత్రిని మినహాయిస్తే మిగిలిన 14మంది మంత్రుల్లో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు నలుగురు, బీసీలు ముగ్గురు, ఎస్టీలు ఒకరు ఉన్నారు. ఎస్సీ వర్గానికి చెందినవారు 15 మంది కాంగ్రెస్‌‌ నుంచి ఎమ్మెల్యేలుగా  గెలుపొందారు. 

బలహీన వర్గాలు కాంగ్రెస్‌‌ వైపు అధికంగా ఉన్నారని చెప్పటానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్‌‌ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నలుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించింది. వీరిలో ఇద్దరు మాల, ఇద్దరు మాదిగ సామాజికవర్గానికి చెందినవారున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క మాల సామాజికవర్గానికి చెందినవారు. తెలంగాణ మంత్రివర్గంలో 26.66% దళితుల వాటా ఉండటం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే మొదటిసారి. 

అంబేద్కర్​ ఆశయాలను నెరవేర్చిన కాంగ్రెస్​

దళితుడికి సీఎం పదవి ఇస్తానని, తెలంగాణ వస్తే అంతే చాలు, తనకు ఏ పదవీ వద్దని, కింగ్‌‌మేకర్‌‌లాగా ఉంటానని చెప్పిన కేసీఆర్​ చివరకు అధికారంలోకి వచ్చిన తరువాత, ఫ్యామిలీ ప్యాకేజీ కింద కుటుంబం మొత్తం పదవులు తీసుకున్నారు.  దళిత సీఎం మాటతప్పి చివరికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఏ కారణం చెప్పకుండా ఏడాది తిరగకముందే అవమానకరంగా దళితుడని కూడా చూడకుండా ఆయనను ఆ పదవి నుంచి ఊడబీకారు. 

కానీ, సీఎం రేవంత్‌‌రెడ్డి పట్టుబట్టి తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీలకు సింహభాగం పదవులు కట్టబెట్టారు.  గత  పాలనకు భిన్నంగా చేతల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. ప్రజాప్రభుత్వంలో గద్దర్‌‌ పేరు మీద సినీ అవార్డులను ఇచ్చి గౌరవిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. బలహీనవర్గానికి చెందిన అందెశ్రీ పాటకు నాడు ఏ గుర్తింపూ దక్కలేదు. నేడు ఆయన రాసిన గీతం రాష్ట్ర గీతంగా గౌరవాన్ని పొందుతోంది. 

తాము అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు.. అధికారం పోయిన తరువాత వారికి గుర్తుకువచ్చి న్యాయం చేయాలని దొర బిడ్డ రోడ్డెక్కి ధర్నాలు చేయడం చూస్తున్నాం. కానీ, కాంగ్రెస్‌‌ ప్రభుత్వం కులగణన చేసింది. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తున్నది. పదవులలో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తున్నది. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలను అక్కున చేర్చుకొని వారికి అత్యున్నత పదవులు కట్టబెట్టడంతో అంబేద్కర్‌‌ ఆశయాలను కాంగ్రెస్‌‌ నెరవేర్చినట్లయింది.  

సోషల్ జస్టిస్​ డే

మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్రంలో పోరాటాలు జరుగుతున్నాయి. వారి పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌ ఏకసభ్య కమిషన్‌‌ నాలుగు సిఫారసులు చేసింది. వాటిలో రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం. ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్‌‌ పాయింట్ల విభజన, ప్రతిపాదనలను సర్కార్‌‌ ఆమోదించింది.

  క్రిమిలేయర్‌‌ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నివేదికను మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది.  ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సోషల్‌‌ జస్టిస్‌‌ డేగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  దానికి అనుగుణంగానే ఎస్సీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారికి నాలుగు మంత్రి పదవులను ఇచ్చారు.

- సామ రామ్మోహన్​రెడ్డి,
టీపీసీసీ, మీడియా అండ్​కమ్యూనికేషన్​ చైర్మన్