కవితకు మరో షాక్!..టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఔట్

కవితకు మరో షాక్!..టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఔట్
  • ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్​ను ఎన్నుకున్న సంఘం నేతలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్​ తగిలింది. ఇప్పటిదాకా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్​) గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమెను ఆ స్థానం నుంచి తప్పించారు. బుధవారం తెలంగాణభవన్​లో నిర్వహించిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్​ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన్ను టీబీజీకేఎస్ ఇన్​చార్జిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. 

తాజాగా కేటీఆర్ కనుసన్నల్లోనే ఆయనను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, కవిత అమెరికాకు వెళ్లిన సమయంలో అదును చూసుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కవిత వర్గం నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఏడాదిగా గౌరవాధ్యక్షులను ఎన్నుకోలేదని, ఆ స్థానం ఖాళీగా ఉండడం వల్లే కొప్పుల ఈశ్వర్​ను ఎన్నుకున్నామని టీబీజీకేఎస్ ప్రతినిధులు చెబుతున్నారు.

జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా ఎన్నుకుంటరా? 

టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షులను జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎన్నుకోవాల్సి ఉంటుందని, కానీ, ఎలాంటి మీటింగ్ పెట్టకుండానే ఏకపక్షంగా ఎలా ఎన్నుకుంటారని కవిత వర్గానికి చెందిన టీబీజీకేఎస్​ నేతలు భువనచంద్ర రాకేశ్ తదితరులు ప్రశ్నించారు. ఈ ఎన్నికలో ట్రేడ్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించారని, కార్మిక సంఘం ఆఫీసులోనో లేదంటే సింగరేణి బొగ్గు కాలరీస్​లోనో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఎలా తీసుకుంటారని నిలదీశారు. ఈమేరకు బుధవారం మీడియాకు లేఖ విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కవిత వర్గానికి చెందిన కోశాధికారి సహా100మంది టీబీజీకేఎస్ నేతలు ఆ సంఘానికి రాజీనామా చేశారు.

హెచ్ఎంఎస్​తో జట్టుకట్టడంపై టీబీజీకేఎస్ నేతల గుస్సా

కవిత తీరుపై టీబీజీకేఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలినని చెప్పుకునే ఆమె.. హెచ్​ఎంఎస్​ (హిందూస్థాన్ మజ్దూర్ సంఘ్)తో ఎలా జట్టు కడతారని ప్రశ్నిస్తున్నారు. దీనికి తాము ఒప్పుకోబోమని స్పష్టంచేస్తున్నారు. ఏడాది కాలంగా టీబీజీకేఎస్​కు గౌరవాధ్యక్షులు ఎవరూ లేరని చెప్తున్నారు. 

గతంలో కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు రాజీనామా చేశారని, ఏడాది క్రితం టీబీజీకేఎస్ పునర్నిర్మాణం చేపట్టామని, అప్పట్లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్​లో గౌరవాధ్యక్షులను ఎన్నుకోలేదని, కేవలం అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గాన్ని మాత్రమే ఎన్నుకున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి పేర్కొన్నారు.

 అప్పట్నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉందని, తాజాగా కొప్పుల ఈశ్వర్​ను ఎన్నుకున్నామని ఆయన వివరించారు . సింగరేణి జాగృతితో టీబీజీకేఎస్​కు ఎలాంటి సంబంధం లేదని, జాగృతిలో ఉన్న వారిని టీబీజీకేఎస్ పదవుల నుంచి తప్పిస్తున్నామని స్పష్టంచేశారు. ఊగిసలాటలో ఉన్నోళ్లు అటో ఇటో తేల్చుకోవాలని తేల్చి చెప్పారు.

చిన్నగా అన్నింటికీ దూరం..

కవితను ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నయ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. చిలికిచినికి గాలివానలా ముదిరింది. ఆ తర్వాత నేరుగా ఆమె తన అన్న కేటీఆర్​ను టార్గెట్ చేసుకుంటూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేశారంటూ బాంబు పేల్చారు. అంతేకాదు.. ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనపై కుట్రలు పన్నారని ఆరోపణలు గుప్పించారు. 

అది మొదలు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ మాట్లాడుకున్నదీ లేదు. వాళ్లిద్దరి మధ్య గ్యాప్​ భారీగా పెరిగిందన్నది రాఖీ పండగతో స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను బీఆర్​ఎస్​ పార్టీకి దూరం చేసే కుట్రలకు కేటీఆర్​ పాల్పడుతున్నారంటూ కవిత వర్గం నేతలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి, ఇప్పుడైనా కేసీఆర్​ కలగజేసుకొని వివాదానికి చెక్​ పెడతారా, లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.