పోటీ పరీక్షల్లో చరిత్ర, సంస్కృతికే ఎక్కువ మార్కులు

పోటీ పరీక్షల్లో చరిత్ర, సంస్కృతికే ఎక్కువ మార్కులు

తెలంగాణలో పోటీ పరీక్ష ఏదైనా తెలంగాణ చరిత్ర, సంస్కృతి నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి​. ఇందులో క్వశ్చన్స్​ కంపల్సరీ వచ్చే టాపిక్​ జానపద కళారూపాలు, వాయిద్యాలు. కిన్నెర, జమిడిక, ఒగ్గు లాంటి వాయిద్యాలు, గంగిరెద్దులు, చిందు, బాలసంతులు లాంటి కళా రూపాల గురించి తెలుసుకుందాం. 

జమిడిక: జమిడిక లేదా జముక తాళానికి అనుగుణంగా వాయించే వాయిద్యం. జమిడిక వాయిద్యాన్ని తెలంగాణలో బైండ్ల వారు లేదా బవనీలు వాయిస్తారు. బైండ్ల వారు మాదిగలకు ఉపకులం. జమిడిక గురించి ‘క్రీడాభిరామం’ గ్రంథంలో ఉంది. సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వారు జమిడికపై విప్లవ గీతాలు పాడేవారు. 

ప్రశ్న: ‘జమిడిక’ ఎవరు వాయిస్తారు? (4)
1. మాదిగ    2. మాల    3. డక్కలి    4.బైండ్ల

తెలంగాణలో  జానపద కళారూపాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా మూడు రకాలు. త్యాగం తీసుకొని ప్రదర్శించే కళారూపాలు, త్యాగం తీసుకోకుండా ప్రదర్శించే కళారూపాలు, ఔత్సాహిక కళాకారులు ప్రదర్శించే కళారూపాలు. 

చిందు బాగోతం: చిందు అంటే అడుగు. చారిత్రకంగా చూస్తే ‘చిందు’ అనేది తొలినాళ్లలో ఒక సంబురం, పండుగ. చిందు తొక్కడం అంటే అడుగులు వేయడం. మాదిగ కులస్తులకు ఆశ్రిత కులంగా ఉంటూ పౌరాణిక కథలకు అనుగుణంగా యక్షగాన రూపంలో చిందు వేస్తారు. కాబట్టి వీరిని చిందు మాదిగలని, చిందు భాగవతులని అంటారు. చిందు పదం ‘పండితారాధ్య చరిత్ర’లో ఉంది. నటరాజ రామకృష్ణ తెలుగు జాతి తొలి నాట్య కళారూపం ‘చిందు బాగోతం’. ఆ జాతి వాయిద్యం డప్పు. 1935 ప్రాంతాల్లో ‘మాదిగ ఆట’ గా చిన్న చూపు చూసే చిందుకళకు గౌరవం తీసుకురావడంలో విశేష కృషి చేసింది చిందు ఎల్లమ్మ. నిజామాబాద్​కు చెందిన ఆమె అసలు పేరు రుక్మిణి. 2022 నాటికి చిందు ఎల్లమ్మ జన్మించి వంద సంవత్సరాలు పూర్తయింది. 1986లో అప్నా  ఉత్సవ్​ పేరుతో జరిగిన జానపద కళా ఉత్సవాలకు రష్యా అధ్యక్షుడు గోర్బచెవ్​ చిందు భాగవతాన్ని వీక్షించారు. 

ప్రశ్న: ఏ దేశ అధ్యక్షుడు తెలంగాణ చిందు భాగవతాన్ని తిలకించారు? (3)
1. అమెరికా    2. చైనా    3. రష్యా    4. బ్రిటన్​

గంగిరెద్దులాట: గంగడోలు పెద్దదిగా, మూపురం ఎత్తుగా ఉండి సాధు లక్షణాలు కలిగిన ఎద్దుల్ని ఆడించే వారిని గంగిరెద్దులోళ్లు అంటారు. సంక్రాంతి పండుగ సమయంలో వీరు ఎక్కువ కనిపిస్తారు. పురుషులు గంగిరెద్దులను ఆడిస్తే, స్త్రీలు లేదా పిల్లలు డోలు వాయిస్తారు. డోలును ఈర్నంతో కొడతారు. కంది పుల్ల పచ్చిగా ఉన్నప్పుడే వట్రసుడి ఆకారంలో వంచుతారు. ఈ పుల్లని ‘ఈర్నం’ అంటారు. గంగిరెద్దుల పైన రంగు రంగుల బట్టలతో కలిపి కుట్టిన బొంత వేస్తారు. దీన్నే ‘అశ్మం’ అంటారు. 

ప్రశ్న: పల్లెకవి బిరుదు ఎవరికి ఉంది? (4)
1. మంత్రి శ్రీనివాసరావు    2. కేవల్ కిషన్​    3. పల్లెర్ల హనుమంతరావు 4. పల్లా దుర్గయ్య

బాలసంతులు: ఓ చేతిలో గంట, మరో చేతిలో శంఖు, భుజంపై ఏడడుగుల కర్ర దానిపై అటుఇటు ధాన్యం పోసుకునే జోలె, వేకువజామున చేతిలో గంటను లయాత్మకంగా మోగిస్తూ ఊరిలో తిరిగి ప్రజలను మేల్కొలిపే వారిని బాలసంతులని అంటారు.  వీరిని ‘గంట జంగాల’ అని పిలుస్తారు. బాలసంతులు బుడిగె జంగం కులంలో ఒక తెగకు చెందినవారు. వీరి వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. ఉత్తర రామాయణ కథా సంబంధ గేయాలు, వీర గాధల్ని లేదా శైవ కథల్ని పాడుతుంటారు. ఇంటి ముందుకెళ్లి ఆ ఇంటిల్లి పాదిని పొగిడి భిక్షం తీసుకొని, అందరిని  దీవిస్తూ గంట కొడుతూ శంఖం ఊది పాట పాడుతూ మరో ఇంటికెళ్తారు. తెలంగాణ ప్రాంతంలో బాలసంతులు గ్రామానికి రావడం శుభదాయకమని పల్లె ప్రజల విశ్వాసం. పుట్టిన బిడ్డను ఆశీర్వదించడం కోసం బాలసంతులు రావాలని కోరుకుంటారు. 

ప్రశ్న: బాలసంతు అంటే ఏమిటి? (4)
1. నృత్యం 2. నాటకం 3. వాద్యం 4. కళాకారులు

ఒగ్గు: శివుని ఢమరుకాన్ని జగ్గు లేదా ఒగ్గు అని పిలుస్తారు. ఒగ్గు వాయిద్యాన్ని వాయిస్తూ చెప్పే కథను ఒగ్గు కథ అంటారు. ఈ కథను చెప్పే వాళ్లని ఒగ్గువాళ్లు అంటారు. వీరు గొల్ల కులానికి ఉప కులస్తులు. ఒగ్గు లయ ప్రధానమైన వాద్యం. ఒగ్గు కథలో డోళ్లు, గజ్జెలు, తాళాలు వంటి సంగీత వాయిద్యాలు ఉన్నా ఒగ్గుకే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే దాని పేరుతో ఒగ్గు కథ అని పిలుస్తారు. కురుమ కులానికి చెందినవారు ఒగ్గు వాయిస్తారు. వీరిలో రెండు తెగలు ఉంటాయి. ఒకరు పత్తి కంకణం వారు, వీరి ఆరాధ్య దైవం మల్లన్న. రెండో తెగవారు ఉన్ని కంకణం. వీరి ఆరాధ్య దైవం బీరన్న. అన్ని కాలాల్లో కుల ప్రసక్తి లేకుండా అందరికి కురుమ కులానికి చెందినవారు ఒగ్గు కథలు చెప్తారు. మల్లన్న, బీరన్న, ఎల్లమ్మ, కాటమరాజు, సారంగధర, హరిశ్చంద్ర, కీలుగుర్రం, అమెరికా రాజు, మార్కండేయ పురాణం, మండోదరి మొదలైన కథలు ఒగ్గువారు రాత్రి మొదలు పెట్టి తెల్లవారు జాము వరకు చెప్తారు. 

ప్రశ్న: ఏ కులానికి చెందినవారు ఒగ్గుకథ చెబుతారు ? (2)
1.గొల్ల 2. కురుమ 3. బైండ్ల 4. మిత్తిలి 

పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ అనే పేరుతో సృజనాత్మకమైన రచన చేశారు. ఆయన అనల్ప కల్పానాశక్తి, వర్ణనా పటిమ, దేశీయులు, స్వభాషలోని అందచందాలు గంగిరెద్దు అనే ఖండ కావ్యంలో కన్పిస్తాయి. ఈ గంగిరెద్దు రచనతో పల్లా దుర్గయ్యకు ‘పల్లె కవి’ అనే పేరు వచ్చింది. 1942లో జరిగిన ఎంఏ తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులై మొత్తం విశ్వవిద్యాలయంలోనే పట్టభద్రులైన తొలి ఎంఏ తెలుగు విద్యార్థిగా పల్లా దుర్గయ్య రికార్డు సృష్టించారు. 

పృథ్వీ కుమార్​ చౌహాన్​
పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​

 ​