
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కల్యాణలక్ష్మీ పథకం తమకు అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పెళ్లై ఏడాది అవుతున్న ఇంకా కల్యాణ లక్ష్మీ పైసలు రాలేదని చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటకు బీదన ఈరమ్మ... గతేడాది డిసెంబర్ 9న ఆమె బిడ్డ కల్పన పెండ్లి అప్పులు తెచ్చి చేసింది. కల్యాణలక్ష్మి పైసలు వస్తే అప్పు తీర్చొచ్చని అప్లయ్ చేసుకుంది. ఆన్‌లైన్‌లో శాంక్షన్ అని చూపిస్తున్నా.. చెక్కు రావడంలేదు. ఆర్డీవో ఆఫీసుకు వెళ్తే ఎమ్మార్వోను కలువమంటున్నరు. ఎమ్మార్వోను అడిగితే ‘అగో ఇస్తం.. ఇగో ఇస్త’మంటున్నరు. తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరిగిపోతున్నయని, కల్యాణలక్ష్మి పైసలు మాత్రం వస్తలేవని ఈరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
హైదరాబాద్, వెలుగు: పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద టైంకు పైసలు అందడం లేదు. పెండ్లయి ఏడాది, ఏడాదిన్నర దాటినా చెక్కులు రావడం లేదు. వివిధ శాఖల్లో 76,771 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 34,400 అప్లికేషన్లు ప్రాసెస్ పేరుతో ఎమ్మార్వోల వద్ద ఆగిపోయాయి. ఇట్ల ఇప్పటివరకు మొత్తం 1,11,171 అప్లికేషన్లు మూలకుపడ్డాయి. నిధులు లేకపోవడంతోనే సాయం లేట్ అవుతున్నదని ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో ఆడబిడ్డ పెండ్లి కోసం తల్లిదండ్రులు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. సాయం అందితే అప్పులు తీర్చుకోవచ్చని ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురవుతున్నది. మరోవైపు ఆఫీసర్లు.. ‘ఆ సర్టిఫికెట్ లేదు.. ఈ సర్టిఫికెట్ లేదు’ అని కొర్రీలు పెడుతూ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. బ్రోకర్లను ఆశ్రయించనిదే పని కావడం లేదని పలువురు వాపోతున్నారు.
నిధులు లేకనే..!
మైనార్టీ సంక్షేమశాఖలో 25,944, బీసీ సంక్షేమ శాఖలో 25,086, ఎస్టీ సంక్షేమ శాఖలో 12,695, ఎస్సీ అభివృద్ధి శాఖలో 10,237, ఈబీసీలకు సంబంధించి మరో 2,809 అప్లికేషన్లు మూలుగుతున్నాయి. వీటి కోసం రూ. 767 కోట్లు అవసరమవుతాయి. ఎమ్మార్వోల వద్ద ఉన్న మరో 34,400 అప్లికేషన్లకు రూ. 340 కోట్లు కావాల్సి ఉంది. అయితే, సర్కారు నిధులను రిలీజ్ చేయడం లేదని అధికారులు అంటున్నారు. అందుకే అప్లికేషన్లు పెండింగ్‌లో పడుతున్నాయని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆఫీసర్లకు లంచం ఇవ్వనిదే ఫైల్ అప్రూవల్ కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజిలెన్స్ విచారణలో ఇదే విషయం బయటపడింది. ఆఫీసర్లతోపాటు టీఆర్ఎస్ లీడర్లు కూడా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పైసల్లో వాటా తీసుకుంటున్నట్లు తేలింది.
పెండ్లి పందిరిలోనే ఇవ్వాల్సి ఉన్నా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం రూ. 50 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను 2014 అక్టోబర్‌లో తీసుకొచ్చింది. 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ సాయాన్ని రూ. 75 వేలకు పెంచింది. ఆ తర్వాత అసెంబ్లీ ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సాయాన్ని రూ. 1,00,116కు చేర్చింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ఏరియా వాళ్లయితే రూ. 2 లక్షలు, రూరల్ ఏరియా వాళ్లయితే రూ. 1.50 లక్షల లోపు ఉంటే ఇందుకు అర్హులు.
తిప్పిచ్చుకుంటున్నరు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం లబ్ధిదారులు మీ–సేవ సెంటర్లలో అప్లికేషన్లు పెట్టుకుంటారు. ఇవి మీ సేవ సెంటర్ నుంచి తహసీల్దార్ ఆఫీసుకు చేరుతాయి. ఇక్కడ అధికారులు పరిశీలించి.. ఆర్డీవో ఆఫీసుకు అప్రూవల్ కోసం పంపుతారు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. చివరగా లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారు. కానీ చాలా అప్లికేషన్లు ఎమ్మార్వో, ఆర్డీవో , ఎమ్మెల్యేల వద్ద ఆగిపోతున్నాయి. ఎమ్మెల్యేల వద్దకు వెళ్తే స్థానిక టీఆర్‌ఎస్ లీడర్లను కలవాలని అక్కడి వాళ్లు చెప్తున్నారు. అక్కడ వాళ్లకు కొంత మేర ముట్టజెబితేనే ఫైల్ కదులుతున్నదని లబ్ధిదారులు అంటున్నారు. ఇక ఆర్డీవో ఆఫీసులకు పోతే ఎమ్మార్వో దగ్గరికి వెళ్లాలని, తీరా ఎమ్మార్వో దగ్గరికి పోతే ఆర్డీవో దగ్గరికే వెళ్లాలని తిప్పుకుంటున్నారని లబ్ధిదారులు చెప్తున్నారు.
కొర్రీలు పెడుతూ రిజెక్ట్ చేస్తున్రు
రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అప్లికేషన్లలో కొన్ని అప్రూవ్ అయినా నిధులు లేక ఆగిపోతుండగా.. మరికొన్నిటిని అధికారులు ‘ఆ సర్టిఫికెట్ లేదు.. ఈ సర్టిఫికెట్ లేదు..’ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం పెండ్లికి నెల ముందు లేదా పెండ్లి జరిగాక ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్, పెండ్లి కూతురు ఆధార్ జిరాక్స్, పెండ్లికొడుకు ఆధార్ జిరాక్స్, పెండ్లి పత్రిక, పెండ్లి కూతురు తల్లి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను అప్లికేషన్‌తో సమర్పించాలి. గ్రామ, మండల స్థాయిలో జరిగే వెరిఫికేషన్ టైంలో లబ్ధిదారుల పేర్లు ఉంటున్నాయి. కానీ ఆర్డీవో ఆఫీసు, కలెక్టరేట్, హెచ్‌వోడీ ఆఫీసుల్లో వివిధ కారణాలు, కొర్రీలు పెడుతూ తిరస్కరిస్తున్నారు. ఇట్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,500 అప్లికేషన్లను తిరస్కరించారు.
అప్పులకు పెరుగుతున్న వడ్డీలు
ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ. 1,00,116 ఆర్థిక సాయం వస్తుందనే ధీమాతో తల్లిదండ్రులు అప్పులు చేసి లగ్గాలు చేస్తున్నారు. కానీ సర్కారు సకాలంలో పైసలు ఇవ్వకపోవడంతో తెచ్చిన అప్పులకు రోజురోజుకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో పేరెంట్స్ అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నారు. పైసల కోసం ఆఫీసుల చుట్టూ నెలల కొద్దీ తిరుగుతున్నారు.
టీఆర్‌ఎస్ లీడర్లను కల్వమంటున్రు..
నా కూతురు పెండ్లయి ఏడాది దాటింది. కల్యాణలక్ష్మి కోసం అప్లికేషన్ పెట్టినం. ఇంకా రావడం లేదు. తహసీల్దార్ ఆఫీసులో అడిగితే.. ఎమ్మెల్యే అటెస్టేషన్ చేయించుకుని వస్తేనే మంజూరైతయని అప్లికేషన్‌ను తిరిగి ఇచ్చేసిన్రు. అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీసుకు పోతే.. ఊర్లోని టీఆర్ఎస్ నాయకులను తీసుకొస్తేనే పని అవుతుందన్నరు. పెండ్లయిన వెంటనే మంజూరు చేస్తమని చెప్పిన ప్రభుత్వం.. ఏడాది దాటినా పట్టించుకోవడంలేదు.
- బత్తిని వెంకటరమణ,
మునగాల మండలం, సూర్యాపేట జిల్లా
ఎన్నిసార్లు అడిగినా రాలేదంటున్నరు
నా పెండ్లయి ఏడాది గడుస్తున్నా ఇంకా కల్యాణలక్ష్మి చెక్కు రాలేదు. అధికారులను అడిగితే బడ్జెట్ లేదంటున్నరు. ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే ప్రాసెస్‌లో ఉన్నట్లు చూపిస్తున్నది. స్కీం కింద రూ. 1,00,116 వస్తయని ఎదురు చూస్తున్నం. ఇంకా రిలీజ్ చేస్తలేరు.
- మల్లిక, హైదరాబాద్