రైతు గోసను పక్కకు పెట్టిన లీడర్లు

రైతు గోసను పక్కకు పెట్టిన లీడర్లు
  • కేంద్ర మంత్రులను దద్దమ్మలు, ఉన్మాదులు అని తిట్టిన కేసీఆర్​
  • సీఎం మాటల్లో తప్పేముందన్న టీఆర్​ఎస్​ లీడర్లు
  • కేసీఆర్ నోటిని ఫినాయిల్​తో కడగాలె: బండి సంజయ్
  • ‘ఏ’ సర్టిఫికెట్ ఇయ్యాలె: ఎంపీ అర్వింద్

హైదరాబాద్‌‌, వెలుగు: కల్లాల్లోని వడ్లు కొనే దిక్కు లేక రైతులు అల్లాడుతుంటే.. దాన్ని పక్కన పెట్టి పొలిటికల్​ లీడర్లు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తిట్లపురాణంతో వడ్ల కొనుగోలు ఇష్యూ పూర్తిగా పక్కదారి పట్టింది. ఆ తిట్లల్ల తప్పేమున్నదని మంత్రులు, టీఆర్ఎస్ లీడర్లు అనుడు, బీజేపీ ప్రతి విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఇటు చూస్తే చేతికొచ్చిన వానాకాలం పంట కల్లాల్లో, రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నది. ఇంకోవైపు యాసంగి సీజన్ దాటిపోతున్నా అసలు వరి వేయాల్నో లేదో తెల్వని అయోమయంలో రైతులున్నారు. మా పంట కాంటా పెట్టండని మొత్తుకుంటున్నా పట్టించుకునేవాళ్లే లేరు. వానలకు తడిసి మొలకొచ్చిన వడ్లను కొనే దిక్కే కన్పిస్తలేదు. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ సోమవారం కేంద్ర మంత్రులపై బూతులు తిట్టారు. కిషన్‌‌ రెడ్డిని రండ అనే స్థాయికి వెళ్లారు. వాటిని మంత్రులు హరీశ్, జగదీశ్‌‌ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు పోటీపడి సమర్థించారు.

కేసీఆర్ బాటలోనే కేంద్రంపై తిట్లకు దిగారు. దాంతో బీజేపీ కూడా రెస్పాండైంది. బూతుల భాష తనకు రాదని కిషన్‌ రెడ్డి చురకలంటించగా, కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌కు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వాలని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అన్నారు.ప్రకృతి దయతలిచినా...ఈ ఏడాది వానలు బాగా పడ్డాయి. దాంతో రైతులు 62 లక్షల ఎకరాల్లో వరి వేశారు. పంట చేతికొచ్చి నెల రోజులుగా కోతలు సాగుతున్నాయి. ఇంకో 40 శాతం కోయాల్సి ఉంది.

ప్రభుత్వం 6 వేలకు పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్తున్నా ఎక్కడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో మొదలవలేదు. ఇంతలో భారీ వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తాయి. రెండు రోజుల్లో మరో తుఫాన్ రావచ్చన్న హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి స్థితిలో కొనుగోళ్లను స్పీడప్ చేయాల్సిన బాధ్యత పక్కన పెట్టి కేసీఆర్ సర్కారు వడ్ల రాజకీయం మొదలు పెట్టిందన్న చర్చ జరుగుతున్నది.
కొన్నదే కొన్ని, వాటినీ మిల్లులకు పంపలే
వానాకాలంలో వరిసాగు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రతిపాదనలు వచ్చాయని, రాష్ట్రం ముందు చెప్పినట్టు 60 లక్షల టన్నుల వడ్లు (40 లక్షల టన్నుల బియ్యం) కొంటామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రం మాత్రం సాగు విస్తీర్ణం పెరిగింది గనుక కనీసం 90 లక్షల టన్నులన్నా కొనాలని డిమాండ్‌ చేస్తున్నది. కోతలు పూర్తయి 55 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది. కానీ మంగళవారం నాటికి 23.56 లక్షల టన్నులే కొన్నారు. పంటంతా కొనుగోలు కేంద్రాలకు చేరితే  కాంటాలు పెట్టడం మరింత ఆలస్యం కావచ్చు. ఇప్పటికే కొన్న వడ్లను కూడా రైస్‌ మిల్లులకు తరలించలేదు. తాజాగా నారాయణఖేడ్‌ పర్యటనలో మంత్రి హరీశ్‌కు రైతులు ఇదే విషయంపై బాధ చెప్పుకొని వాపోయారు. 

బూతుల్లేకుండా చర్చకు రెడీ
సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చినోళ్లు ఇంకెట్ల మాట్లాడ్తరు? ఆయనను తిడ్తే జర్నలిస్టులనూ జైళ్ల పెడ్తడట. ఆయనేమో మమ్ముల తిట్టొచ్చట. వడ్ల కొనుగోళ్లపై బూతుల్లేకుండ కేసీఆర్​తో చర్చకు నేన్రెడీ. ‑కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేసీఆర్​ ప్రెస్​మీట్​లో ‘బీప్’​లు వేయాలె
కేసీఆర్ ది సెన్సార్ భాష. ఆయన బూతులు మాట్లాడేటప్పుడు ‘బీప్‌’లు వేయాలె. కేసీఆర్ నోటిని ఫినాయిల్‌తో కడిగి, ఇనుప బ్రష్ పెట్టి గీకినా బాగుపడదు. తెలంగాణ ప్రజలు వాడే భాషేనా అది?  ‑బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
తెలంగాణ ప్రజల ఆవేశం
తెలంగాణ ప్రజల ఆవేశం, భావోద్వేగమే కేసీఆర్‌ మాటల్లో ధ్వనించినై. వడ్ల కొనుగోళ్లపై సమాధానం చెప్పాల్సింది చిల్లర మల్లరగాళ్లు కాదు. ప్రధాని మోడీతో, కేంద్ర మంత్రితో చెప్పించాలె.‑మంత్రి జగదీశ్‌ రెడ్డి
కేసీఆర్​ తెలంగాణ దేవుడు
కేసీఆర్ తెలంగాణ దేవుడు. తెలంగాణ గాంధీ. రైతు దీక్షకు నాయకత్వం వహిస్తనని కేసీఆర్‌ అన్నందుకే కేంద్రం ఆగమై, అదిరిపోయి, బెదిరిపోయి, దిగొచ్చి రైతు చట్టాలు రద్దు చేసింది.‑టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి