మోగనున్న స్థానిక ఎన్నికల నగారా.. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్

మోగనున్న స్థానిక ఎన్నికల నగారా.. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్
  • నేడు రాష్ట్ర ఎలక్షన్ ​కమిషనర్‌‌‌‌తో సీఎస్, డీజీపీ కీలక భేటీ
  • ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలుపుతూ ప్లాన్​ అందజేయనున్న సర్కారు
  • పంచాయతీల వారీగా రిజర్వేషన్లతో గెజిట్
  • రేపు లేదా ఎల్లుండి షెడ్యూల్​ విడుదలయ్యే చాన్స్​
  • ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగరాకు అంతా సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర సర్కారు శుక్రవారం జీవో ఇవ్వడంతో ఆదివారం లేదంటే సోమవారం లోకల్​బాడీ ఎన్నికల షెడ్యూల్​విడుదలకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నిక  కమిషనర్​ రాణి కుముదినితో చీఫ్​ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్​  శనివారం  భేటీ కానున్నారు.   పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సమ్మతి తెలియజేస్తూ ప్లాన్ అందజేయనున్నారు. ఏయే జిల్లాల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్​ స్థానాలు ఉన్నాయి ? ఎంత మంది ఎన్నికల సిబ్బంది అవసరం ? ఎన్ని విడతల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేసే అవకాశం ఉంది? లాంటి వివరాలపై చర్చించనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేటెడ్​ కమిషన్​ రిపోర్ట్​ ఆధారంగా బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.

శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లాల కలెక్టర్లు సమావేశమై మహిళా రిజర్వేషన్ల స్థానాలకు డ్రా తీయనున్నారు. ఆ వెంటనే ఏయే స్థానాలకు ఏయే రిజర్వేషన్లు ఖరారయ్యాయో పేర్కొంటూ గెజిట్ ప్రచురించనున్నారు. వాటిని ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నది. ఆ వెంటనే ఆదివారం లేదంటే సోమవారం షెడ్యూల్​ ప్రకటించే అవకాశముంది.  ఎలక్షన్​ కోడ్​ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి శనివారం గ్రూప్​– 1 అభ్యర్థులకు అపాయింట్​మెంట్​ లెటర్లు అందజేయడంతోపాటు ఏటీసీలు,  డబుల్​ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవాలు.. ఆదివారం ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో పంచాయతీ అధికారులు  భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, రిజర్వేషన్లపై ప్రక్రియపై ఆరా తీశారు.

12,760 పంచాయతీలకు ఎన్నిక..
రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి 12,760 పంచాయతీలకు సర్పంచ్​, 1,12,534 వార్డులకు,   5,763 ఎంపీటీసీ స్థానాలు, 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మొత్తం 566 ఎంపీపీ స్థానాలకు జరగాల్సి ఉండగా.. ములుగు జిల్లా మంగపేట మండలానికి ఎన్నిక లేకపోవడంతో దీని సంఖ్య ఒకటికి తగ్గింది. 31 జడ్పీ స్థానాలకు చైర్మన్లను ఎన్నుకోనున్నారు. 

 2019లో 12,750 జీపీలకు ఎలక్షన్స్..
రాష్ట్రంలో 2019లో 12,750 జీపీలకు, 1,13,136 వార్డులకు, 539 జడ్పీటీసీ, 538 ఎంపీపీ,  5,843 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  అప్పుడు 32 జడ్పీలకు ఎన్నికలు  జరగగా.. వాటి సంఖ్య ప్రస్తుతం 31కి చేరింది. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో విలీనం  కావడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఆ జిల్లా ఔట్​ అయ్యింది.

తేలిన ఓటర్ల లెక్క..
రాష్ట్రంలో  గ్రామీణ జనాభా1.95 కోట్లు ఉండగా..  గ్రామీణ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు లెక్క తేలింది.  ఇందులో మహిళా ఓటర్లు 85,35,935,  పురుషు ఓటర్లు 81,66,732  మంది ఉండగా.. ఇతరులు 501మంది ఉన్నారు.  గ్రామీణ ఓటర్ల జాబితాలో సింహభాగం మహిళలే ఉండటం విశేషం.. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అతివల ఓట్లు కీలకం కానున్నాయి. పురుష ఓటర్ల కంటే దాదాపు 4 లక్షలపైగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

వచ్చే నెల​ 9న లేదంటే అంతకంటే ముందే నోటిఫికేషన్‌‌‌‌
పార్టీ గుర్తులపై జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్​ ఎలక్షన్స్‌‌‌‌ నిర్వహించననున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. అక్టోబర్​ 9న లేదంటే అంతకంటే ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు, సర్పంచ్​ ఎలక్షన్స్‌‌‌‌కు మధ్య ఐదారు రోజుల గ్యాప్​ మాత్రమే ఉండే అవకాశం ఉంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్​ 10–15వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలు, ఏపీవోలకు జిల్లాల్లో శిక్షణ కొనసాగుతున్నది. గతంలో ఇటు సర్పంచ్​, అటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహిం చారు. ఈ సారి 2  విడతల్లో నిర్వహించా లని ప్రభుత్వం భావిస్తున్నది. 

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై పంచాయతీ రాజ్​ గైడ్​లైన్స్ ఇవే..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వెనుకబడిన తరగతులకు (బీసీలకు) స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినందున అందుకు తగ్గట్టు సర్పంచ్​, వార్డు స‌‌‌‌భ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రెండు వేర్వేరు జీవోలను (నంబర్​ 41, 42) విడుదల చేసింది. 

కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం పీఆర్ డైరెక్టర్ సృజన మార్గదర్శకాలను పంపించగా, దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఆమోదం తెలిపారు. దీంతో సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీలకు సంబంధించిన రిజర్వేషన్లపై కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పంచాయతీ రాజ్ చట్టం- 2018లోని నిబంధనలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు కేటాయించే సీట్లు, పదవులను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు.

ఎస్టీ కోటా (గ్రామ పంచాయతీలు) ఎస్టీ జనాభా 100 శాతం ఉన్న గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ పదవులను ఎస్టీలకే రిజర్వ్ చేయనున్నారు. ఇతర షెడ్యూల్డ్ ఏరియాల్లో కనీసం 50 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. మండల పరిషత్‌‌‌‌లలోని (ఎంపీటీసీ, ఎంపీపీ) షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కి కనీసం 50 శాతం సీట్లు రిజర్వ్ చేయనున్నారు. 

2019 తర్వాత కొత్తగా ఏర్పడిన మండల పరిషత్‌‌‌‌లు, జిల్లా పరిషత్‌‌‌‌లు, కొత్త పంచాయతీలు, వార్డులకు ఇది తొలి ఎన్నికలుగా పరిగణించనున్నారు. గత ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాని సీట్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో 2011 జనాభా లెక్కలు, ఎస్​ఈఈపీసీ సర్వే 2024 ఆధారంగా జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిషన్ సిఫార్సుల ఆధారంగానే ఈ రిజర్వేషన్లను ఖరారు చేశారు. 

వివిధ స్థాయిల్లో రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను అధికారులకు అప్పగించారు. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కేటాయిస్తారు. వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేస్తారు. ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు.

జెడ్పీ చైర్‌‌‌‌పర్సన్​ రిజర్వేషన్లను పీఆర్​, ఆర్డీ డైరెక్టర్ కేటాయిస్తారు. అంతేకాకుండా.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, అన్‌‌‌‌రిజర్వ్‌‌‌‌డ్ సీట్లలో మహిళలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లను కేటాయించనున్నారు. ఈ ఉత్తర్వుల అమలు బాధ్యతను పీఆర్, ఆర్డీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి మినహా) పర్యవేక్షించనున్నారు.