తెలంగాణ అంటే.. ఆనాటి అస్మక రాజ్యం నుంచి ఈనాటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాక..

తెలంగాణ అంటే.. ఆనాటి అస్మక రాజ్యం నుంచి ఈనాటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాక..

ఆనాటి అస్మక రాజ్యం నుంచి ఈనాటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాక.. మన గడ్డ చరిత్ర ఎంతో ఘనమైనది. ఎన్నో కట్టడాలు, కళలకు నిలయం, చేతివృత్తులు, ప్రత్యేకమైన జీవన విధానం.. ఒక్కటేంటి! తెలంగాణలో ఇంకా ఎన్నో ఉన్నాయి.
తెలంగాణ అంటే..  
ఓరుగల్లు కాకతీయ కళాతోరణం నుంచి హైదరాబాద్​ నడిబొడ్డున కట్టిన చార్మినార్​ వరకు ఎన్నో కట్టడాలు.
ఒగ్గుకథ నుంచి విప్రవినోదులు మ్యాజిక్​ దాకా ఎన్నో కళలు.
నిర్మల్​ కొయ్య బొమ్మల నుంచి అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీరల వరకు ఎన్నో చేతివృత్తులు.
గద్వాల్​ కోట నుంచి ఖమ్మం ఖిల్లా వరకు ఎన్నో దుర్గాలు.
వేములవాడ రాజన్న నుంచి యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి వరకు ఎన్నో క్షేత్రాలు.
ఆదిలాబాద్​ అడవుల్లో బతికే కోయల నుంచి మహబూబ్​ నగర్ నల్లమలలో బతికే చెంచుల వరకు ఎన్నో భిన్న సంస్కృతులు..  
ఇవే కాదు.. తెలంగాణకు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడే.. ఈ మట్టి మనుషుల నుంచే పుట్టినయ్​. చరిత్ర, జీవన విధానం నుంచి అభివృద్ధి చెందినయ్​.

తెలంగాణ చరిత్ర అంటే.. నిజాం కాలం, తెలంగాణ ఉద్యమం మాత్రమే కాదు. వాటితోపాటు మనకు కొన్ని వేల ఏండ్ల చరిత్ర ఉంది. పూర్వ రాతియుగం నుంచే తెలంగాణ ఉనికిలో ఉంది. అప్పటి ఆనవాళ్లు వేములపల్లి, ఏటూరునాగారం, బాసర, బోథ్, హాలియా ప్రాంతాల్లో బయటపడ్డాయి. ఆ తర్వాత షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలో ఉన్న ఏకైక జనపదం ‘అస్మక’ కూడా మన ప్రాంతంలోనే ఉంది. దానికి ఇప్పటి బోధన్ (ఒకప్పటి పోదన్) రాజధానిగా ఉండేది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (ఇప్పటి మంజీరా నది పరీవాహక ప్రాంతం) ప్రస్తావన ఉంది. ఆ అస్మక మగధలో విలీనమైన తర్వాత నందరాజులు, మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్​షాహీలు... చివరకు నిజాంలు పాలించారు. ఇన్నేండ్లలో దశల వారీగా తెలంగాణ అభివృద్ధి చెందింది. రాజులు కోటలు కట్టించారు. జానపద కథలు పుట్టాయి. క్షేత్రాలు వెలిశాయి. జీవన శైలిలో మార్పులు వచ్చాయి.

ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు. మనది ఎప్పటినుంచో సుభిక్షమైన ప్రాంతం. ప్రజలకు సరిపడా పంటలు పండే నేల. ముఖ్యంగా కుతుబ్ షాహీలు హైదరాబాద్​ నగరాన్ని నిర్మిస్తే అసఫ్ జాహీలు ఆధునిక నగరంగా తీర్చిదిద్దారు. ఆ అభివృద్ధే తర్వాత మహానగరంగా మారడానికి కారణమైంది. దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప రాజభవనాలు, అద్భుతమైన కోటలు, వారసత్వ కట్టడాలు, చెరువులు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్రజల ఆస్తి హైదరాబాద్​ని ప్రపంచంలోని బెస్ట్​ విజిటింగ్​ ప్లేస్​ల్లో ఒకటిగా మారింది.

మన రాష్ట్రంలో అనేక చారిత్రక కోటలు ఉన్నాయి. ఇవి ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యాలు. కొన్ని వందల ఏండ్ల క్రితం నుంచే ఇక్కడి రాజులు కోటలు నిర్మించారు. అవి ఇప్పటికీ టూరిస్ట్​లను ఆకర్షిస్తున్నాయి. ఇవి చారిత్రక ప్రదేశాలు మాత్రమే కాదు.. తెలంగాణ పూర్వ వైభవానికి నిదర్శనాలు. ప్రతి కోటలో అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంది. వాటి చుట్టూ ఎన్నో విభిన్న కథలు ఉన్నాయి.

వరంగల్‌:

కాకతీయుల గొప్పతనాన్ని చెప్పే అద్భుతమైన కట్టడం వరంగల్‌ కోట. దీని నిర్మాణాన్ని  కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు క్రీ.శ.1199లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన బిడ్డ రాణి రుద్రమదేవి కోట కట్టడాన్ని పూర్తి చేసింది. కోట లోపలి కీర్తి తోరణాలు, శంభుని గుడి, ఏకశిల, సితాబ్‌ ఖాన్‌ ప్యాలెస్​లు ఆకట్టుకుంటాయి. దాదాపు 15 మంది కాకతీయ రాజులు పాలించిన ఈ కోట ఏడు గోడలతో శత్రు దుర్భేద్యంగా మార్చారు. అందుకే వందల ఏండ్ల పాటు దాని వైభవం తగ్గలేదు. శత్రువులు లోపలికి రాకుండా కోట చుట్టూ 18 అడుగుల లోతైన కందకాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కాకతీయ తోరణం చాలా ప్రత్యేకం. ఇది తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది.

భువనగిరి:

పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లుడు 10వ శతాబ్దంలో  గుడ్డు ఆకారంలో ఉన్న కొండపై ఈ కోటను కట్టించాడు. ప్రస్తుత భువనగిరి పట్టణంలో ఉన్న దీన్ని చూడాలంటే కొండపైకి ఎక్కాలి. దీనికి దక్షిణ, ఉత్తరాల్లో రెండు ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. కోట బయటి గోడకు ఆనుకుని చాలా బురుజులు ఉన్నాయి.

ఖమ్మం:

క్రీ.శ 957వ సంవత్సరంలో ఈ కోటను నిర్మించారు. ఖమ్మం సిటీ మధ్యలో ఉన్న ఈ కోట గోడలు, స్తంభాలపై అందమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఖిల్లా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇది 4 చదరపు మైళ్లలో ఉంది. దీని ప్రహరి చాలా ఎత్తుగా ఉంటుంది. మొత్తం10 ద్వారాలు ఉన్నాయి. కోట చుట్టూ 60 ఫిరంగులను పెట్టి శత్రువుల మీద దాడి చేయొచ్చు. కోటలో జాఫర్​–ఉద్​–దౌలా కాలంలో నిర్మించిన పాత మసీదు, మహల్ కూడా ఉన్నాయి. 15 బురుజులు ఉన్నాయి. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నుంచి ఖమ్మం కోటకు సొరంగ మార్గం ఉండేదని చెప్తుంటారు. ఈ కోట ముందు రాతిదర్వాజ ఉంటుంది. ఈ కోట దాదాపు 400 ఏండ్లు కాకతీయుల ఆధీనంలోనే ఉంది. తర్వాత ముసునూరి రాజులు, కుతుబ్‌షాహీ వంశస్తుల పాలనలో ఉంది. మొదట దీన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవాళ్లు. కుతుబ్‌షాహీ వంశస్తులు దాన్ని ‘ఖమ్మం ఖిల్లా’గా మార్చారు.

మెదక్​ ఫోర్ట్​:

హైదరాబాద్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ కోటను కాకతీయ రాజులు కట్టించారు.17వ శతాబ్దంలో కట్టిన ఈ కోటలో  సింహ ద్వారం, గజ ద్వారం, సింహాలు, ఏనుగుల శిల్పాలు ప్రత్యేకం. కుతుబ్ షాహీలు ఈ కోటలో మసీదు కూడా కట్టించారు. ఇందులో నిజాంలు, కాకతీయ పాలకుల కాలంలోని సంస్కృతి కూడా కనిపిస్తుంది.

ఎలగందుల:

ఎలగందుల కోటను కాకతీయుల కాలంలో ఎలిగందులగా పిలిచేవాళ్లు. కరీంనగర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయుల అనంతరం నిజాం నవాబు అసఫ్ ఝా ఈ కోటను ఆక్రమించాడు. కరీంనగర్ కంటే ముందు ఎలగందుల పేరుతోనే ఈ జిల్లాను పిలిచేవాళ్లు. ఆరో నిజాం మహబూబ్​ అలీఖాన్​ కాలంలో1905లో కరీంనగర్ జిల్లాగా పేరు మార్చారు. కాకతీయుల కాలంలో ఈ గ్రామాన్ని తెల్లకందుల అని పిలిచేవాళ్లని చింతామణి చెరువు దగ్గర ఉన్న శాసనంలో ఉంది. ఎత్తయిన గోడలు, బలమైన చెక్క తలుపులతో కోట పటిష్టంగా ఉండేది.  శత్రువులు లోపలికి రాకుండా కోటగోడ చుట్టూ 15 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల లోతైన నీటి కందకాలు ఏర్పాటు చేసి అందులో మొసళ్లను వదిలేవాళ్లు.

దోమకొండ కోట:

దోమకొండ మెయిన్​ రోడ్డు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దోమకొండ కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలనలో ముఖ్యమైన సంస్థానంగా ఉంది. దోమకొండ సంస్థానపు రెడ్డి రాజులు 18వ శతాబ్దంలో పూర్వం కోట ఉన్న స్థలంలోనే ప్రస్తుతం ఉన్న కోటను కట్టించారు. కోటలో మహాదేవుని ఆలయం ఉంది. కోట చుట్టూ చదరపు, వృత్తాకార బురుజులు కట్టారు. కోట లోపల రెండు మహళ్లు కూడా ఉన్నాయి. కోటలోని శివాలయం కాకతీయ శైలిలో ఉంది.  దీనికి ఈ మధ్యనే యునెస్కో గుర్తింపు వచ్చింది.

గద్వాల కోట

కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న గొప్ప కోట. అప్పట్లో 100 గ్రామాలు గద్వాల సంస్థానంలో భాగంగా ఉండేవి. 1663లో పెద్ద సామ భూపాలుడు ఈ కోట కట్టించాడు. కోట ప్రహరి మట్టితో నిర్మించారు. అయినా చాలా పటిష్ఠంగా ఉంది. 400 ఏండ్లు అయినా చెక్కు చెదరలేదు. గద్వాల సంస్థానానికి ఎంతోమంది కళాకారులను పోషించిన చరిత్ర వుంది. సంస్థానం ఏర్పడిన మొదటి నుంచే పండితులకు, కవులకు ఆదరణ వుండేది.

దేవరకొండ

నాగార్జునసాగర్‌కు దగ్గరలో దేవరకొండ కోట ఉంది. దీన్ని ‘సురగిరి’ అంటే ‘దేవతల కొండ’ అని కూడా చెప్తుంటారు. ఈ కోట దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బలానికి ప్రతీకగా సింహాలు, ధర్మ రక్షణకు ప్రతీకగా ధర్మచక్రాన్ని దుర్గం ద్వారాలపై చెక్కారు.  అయితే ఈ కోట చుట్టూ 8 చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాలను చెక్కి, అష్టదిగ్బంధనం చేశారని, అందుకే ఈ కొండని దేవరకొండ అని పిలుస్తున్నారని చెప్తుంటారు. ఇక్కడ సుమారు 360 బురుజులు, తొమ్మిది మహాద్వారాలు, పెద్ద బావులు, కోనేర్లు, కొలనులు, ధాన్యాగారాలు ఉన్నాయి.

గోల్కొండ

హైదరాబాద్ శివార్లలో ఉన్న గోల్కొండ తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కోటల్లో ఒకటి. దీన్ని కుతుబ్ షాహీ రాజవంశం16వ శతాబ్దంలో నిర్మించింది. అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన దీని ప్రత్యేకత ఏంటంటే.. కోట చుట్టూ ఒక కందకం ఉంది. ప్రత్యేకంగా నిర్మించిన నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.10 కి.మీ పొడవున 87 బురుజులు, గోడలు కోటకు రక్షణగా ఉన్నాయి. ఇప్పటికీ పెద్ద పెద్ద బిల్డింగ్​లు, మసీద్​, కుతుబ్ షాహీ ప్యాలెస్, ఫతే దర్వాజా, రాణి మహల్, దర్బార్ హాల్​ లాంటివి చూడొచ్చు.