- 692 మందితో ఫైనల్ లిస్టు రిలీజ్ చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్‌బీ) సోమవారం విడుదల చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (టీవీవీపీ) పరిధిలో 692 మందిని బోర్డు ఎంపిక చేసింది. అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌లో 226 మంది, గైనకాలజీలో 247 మంది, పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 219 మంది డాక్టర్లు సెలెక్ట్ అయ్యారు.
గతేడాది1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్), 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా 692 పోస్టుల భర్తీని పూర్తి చేసింది.
నేడు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు...
ఎంపికైన 692 మంది డాక్టర్లకు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మంగళవారం హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. వీరితో పాటు ఇటీవలే ఎంపికైన174 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా అదే రోజు ఆర్డర్లు ఇవ్వనున్నారు. మరోవైపు మిగిలిన 924 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెలలో పూర్తి చేయనున్నట్టు బోర్డు తెలిపింది. 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నారు.
