నిజమైన దేశభక్తి అంటే అది: నిరంజన్‌ రెడ్డి

నిజమైన దేశభక్తి అంటే అది: నిరంజన్‌ రెడ్డి
  • రాష్ట్ర బీజేపీ నేతల తీరు చూస్తే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తోంది: ఎర్రబెల్లి
  • తెలంగాణ రైతులు ఇండియన్స్ కాదా?: ఎంపీ నామా నాగేశ్వర్‌‌రావు

దేశ భక్తిని మాటల్లో చెప్పడం కాదని మాటల్లో చూపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ మంచి డిమాండ్‌తో అమ్ముడుపోయేలా చేస్తే అది నిజమైన దేశభక్తి అవుతుందని ఆయన చెప్పారు. ప్రపంచ అవసరాలను తీర్చే శక్తి భారత్‌కు ఉందని, ఆ శక్తిని మాటల్లో చెప్పి వదిలేయకుండా కేంద్రం రైతాంగం పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేసి, మంచి మార్కెటింగ్ కల్పించాలని కోరారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి.. ఔదార్యంతో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు,  టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడం లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందన్నారు. ‘‘వ్యవసాయ పరిశోధనలు చేసే వ్యవస్థ కేంద్రం పరిధిలో ఉంది. కనీస మద్దతు ధర నిర్ణయం, గోడౌన్స్, ఎగుమతులు అన్ని కేంద్రం చేతిలోనే ఉన్నాయి” అని చెప్పారు. రైతులు పండించిన పంటలు కేంద్రం కొనుగోలు చేయకుండా చేతులెత్తేయం అన్యాయమన్నారు. 

ప్రతి రంగంలోనూ మేకిన్‌ ఇండియా అంటూ ప్రోత్సాహాలు ఇచ్చే కేంద్రం.. మన దేశ రైతులు పండించే పంటల విషయంలో ఎందుకు అగౌరవపరిచేలా వ్యవహరిస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. వంట నూనెలను ప్రతి ఏటా 80 నుంచి 90 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం చెల్లించి విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నారని, ఇది దేశానికి అవమానం కాదా? అని నిలదీశారు. రైతులకు నూనె గింజలు పండించే మార్గం చూపించలేరా అన్నారు. నాలుగు కోట్ల జనాభా ఉండే స్పెయిన్ పండ్లు, కూరగాయల ఎగుమతుల్లో ప్రపంచంలోనే నంబర్‌‌ వన్‌గా ఉందని, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ  ప్రజల నైపుణ్యాన్ని కేంద్రం నీరుగారుస్తందని, శ్రమ శక్తిని అవమానిస్తున్నారని ఆరోపించారు. దేశంలో 60 శాతం మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి కల్పించే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయొద్దని అన్నారు. పండించిన పంటను మొత్తం కొనాలి. రాష్ట్ర మంత్రులు ఎదురు చూస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, మరో రెండ్రోజులు చూసి.. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోతే ఏం చేయాలన్న దానిపై కార్యాచారణపై ముందుకు వస్తామని చెప్పారు.

రైతులకు అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరు

వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం రోజులు గడుస్తున్నా క్లారిటీ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం ఇబ్బందిపడకూడదని తాము పార్లమెంటులో అన్ని రకాలుగా ఆందోళనలు చేసి, తొమ్మిది రోజుల తర్వాత కూడా కేంద్రంలో చలనం లేకపోవడంతో వాకౌట్ చేశామన్నారు. తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందని, దేశంలో పండిన పంట కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, తెలంగాణ భారత్‌లో లేదా? తెలంగాణ రైతులు ఇండియన్స్ కాదా? అని నామా నిలదీశారు. రైతులకు అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరని చెప్పారు. ఇప్పటికైనా ఒకటి రెండ్రోజుల్లో వడ్ల కొనుగోలుపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరారు.

వడ్ల కొనుగోలుకు లెటర్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నరు

ఇంత చలిలో కూడా రైతాంగం కోసం తాము కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి వచ్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు అన్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు వడ్ల సమస్యపై అన్ని క్లారిటీ ఇచ్చామన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు, ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నవే తప్పులని ఆయనకు స్పష్టతనిచ్చామని, ఆయనకు అన్ని క్లారిటీ ఇచ్చామని తెలిపారు. మరోసారి తమకు అపాయింట్‌మెంట్ ఇస్తే పూర్తి స్పష్టతతో వడ్ల కొనుగోలుకు మంత్రి లెటర్ ఇస్తారని తమకు నమ్మకం ఉందని ఎర్రబెల్లి చెప్పారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలే లెటర్ ఇవ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లు మాట్లాడుతున్న తీరు చూస్తే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి టైమ్‌ ఇవ్వకుండా వాళ్లే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.