- త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- చివరికి ఆ పార్టీకి 9 మందే మిగుల్తరు: ఉత్తమ్
- కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అమ్మిన కేసీఆర్.. రండ, బ్రోకర్, జోకర్
- సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరంపై ఎందుకు స్పందించలేదని ఫైర్
- కేసీఆర్.. చవట, దద్దమ్మ: జూపల్లి కృష్ణారావు
- చేనేత కార్మికులకు కేటీఆర్ ఏం చేసిండు?: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ పై అసెంబ్లీలో చర్చ నిర్వహించినప్పుడు రాకుండా ఇంట్లో పడుకున్నారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని అన్నారు. ‘‘కేసీఆర్ కు కమీషన్ల మీద ఉన్న కక్కుర్తి వల్లనే ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరంగా మారింది. కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అమ్మిన వ్యక్తి.. రండ, బ్రోకర్, జోకర్. ఇప్పుడు సిగ్గు, లజ్జ, శరం అన్నీ వదిలేసి ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి లేసినట్టు మాట్లాడుతున్నడు. కేసీఆర్.. నువ్వు మమ్మల్ని తొక్కుతవా? ఎంపీ ఎన్నికల్లో నిన్నే రాష్ర్ట ప్రజలు బొంద పెడ్తరు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం” అని అన్నారు. ‘‘మేం కేసీఆర్ లెక్క దొంగ పాస్ పోర్టులు అమ్మలేదు. కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా పని చేయలేదు. కేసీఆర్ లెక్క వేరే దేశాల్లో మాట్లాడితే ఉరి తీస్తారు. కేసీఆర్ అంత పొగరుబోతు వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు” అని పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ కు ఉన్న పొగరు వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104 నుంచి 39కి వచ్చింది. ఇప్పుడా సంఖ్య 9కి చేరుతుంది. త్వరలోనే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు’’ అని తెలిపారు. ‘‘సూర్యాపేట, పాలేరుకు కేసీఆర్ ముఖం చూసి నీళ్లు ఇవ్వలేదు. మా షెడ్యూల్ ప్రకారం ఇచ్చాం. సాగు నీళ్లు కాదు ఇచ్చింది.. తాగునీరు మాత్రమే. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలాం. ఈ కరువు కేసీఆర్ తెచ్చిందే.. కాంగ్రెస్ తెచ్చింది కాదు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మొద్దు. రాష్ట్రంలో కరెంట్, నీళ్ల సమస్య రాదు” అని చెప్పారు.
కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నడు: పొన్నం
అధికారం పోయిందన్న అసహనంతో కేసీఆర్ మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. “కేసీఆర్.. కుక్కల కొడుకుల్లారా, లత్కోర్లు అని ఎవరిని అంటున్నావ్? అక్కడ ఉన్న ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేను అంటున్నావా? ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు మాట్లాడిన భాషకు మేం కౌంటర్ ఇస్తే, మీ తల ఎక్కడ పెట్టుకుంటారు. 50 వేల మందితో మమ్మల్ని తొక్కుతావా? మేం రేపటి నుంచి ఫీల్డ్ లో ఉంటం. ఎవరిని ఎవరు తొక్కుతరో చూద్దాం” అని సవాల్ విసిరారు. ‘‘మీ అత్తగారి ఊరు కొదురుపాకలో నిల్చొని అడుగుదాం. ఎవరు ఏంటో అక్కడి వాళ్లే చెబుతారు. ఐదేండ్లు నువ్వు ఎంపీ, నేను ఎంపీ. నువ్వు ఏం డెవలప్ చేశావో? నేను ఏం డెవలప్ చేశానో? ప్రజల దగ్గరే తేల్చుకుందాం” అని అన్నారు. ‘‘చేనేత కార్మికులకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏం చేసిండు? మంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు?చేనేత కార్మికులపై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చేనేత కార్మికులు నేసే బట్టలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నం. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉన్న బకాయిలు బీఆర్ఎస్ హయాంలోనివే” అని చెప్పారు. పెద్ద మనిషిగా గౌరవంగా మాట్లాడాలని, లేకపోతే వేములవాడ గుడి ముందు చెప్పులు ఎత్తుకుని వెళ్లే వాళ్లతో సమానంగా కేసీఆర్ ను చూడాల్సి వస్తుందని కామెంట్ చేశారు.
బీఆర్ఎస్ ఓడిపోతే పార్టీని రద్దు చేస్తవా?: జూపల్లి
కేసీఆర్.. చవట, దద్దమ్మ కాబట్టే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. “కేసీఆర్.. గద్ద లెక్క వాలుతా అంటున్నావ్? నువ్వు, నీ కుటుంబం రాష్ట్రంపై గద్దల్లా వాలి దోచుకుతిన్నారు. నీ అవినీతిని బట్టబయలు చేస్తాం.. బట్టలు ఊడదీస్తాం. కుర్చీ వేసుకుని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదు” అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్ ను వెయ్యి గజాల లోతులో పాతిపెట్టాలని మండిపడ్డారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేశారు. దీనిపై అప్పట్లోనే డీజీపీకి ఫిర్యాదు చేశాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరినీ వదిలేది లేదు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు” అని హెచ్చరిం చారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు పంట నష్ట పరిహారం ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు పరిహారంపై మాట్లాడడం హాస్యాస్పదం. 4 నెలల ప్రజా పాలనను చూసి కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం. 14 సీట్లు గెలుస్తాం. కేసీఆర్.. మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క సీటు గెలవడం కూడా కష్టమే. బీఆర్ఎస్ ఓడిపోతే పార్టీని రద్దు చేస్తావా?” అని సవాల్ విసిరారు.