పెరిగిన మెట్ట పంటల సాగు

పెరిగిన మెట్ట పంటల సాగు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వర్షాలు లేక పోవడం.. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో యాసంగి సాగుపై ప్రభావం చూపింది. ఈ యేడు నీటి ఎద్దడి పరిస్థితులు లోటు వర్షపాతం నమోదు కావడంతో నిరుడు కంటే  యాసంగి  పంటల సాగు తగ్గింది. నీటి వనరులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే కొంత తక్కువే సాగైంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అధిక నీటి వినియోగం ఉండే వరి వంటి పంటలను పక్కన పెట్టి రైతులు మెట్టపంటల సాగుకు మొగ్గు చూపారు. గతంతో పోలీస్తే తక్కువ నీటితో పండే పంటలే ఎక్కువేశారు.

పెరిగిన జొన్న, మక్క, శనగ సాగు

ఈ యాసంగిలో జొన్న, మక్క జొన్న పంటల సాగు పెరిగింది. రాష్ట్రంలో జొన్న సాధారణ సాగు 1.02 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికే 2.30లక్షల సాగు నమోదైంది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా జొన్న సాగు చేయగా ఆ తరువాత కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గద్వాల జిల్లాల్లో జరిగింది. మక్కలు కూడా గతేడాది యాసంగిలో 5.11లక్షల  ఎకరాల్లో వేయగా.. ఈ యేడు అత్యధికంగా 6.59లక్షల ఎకరాల్లో సాగైంది.

సాధారణ సాగు కంటే ఈయేడు దాదాపు లక్షన్నర ఎకరాల సాగు పెరిగింది. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మక్కలు అత్యధికంగా లక్ష ఎకరాలు దాటడం గమనార్హం. ఆ తరువాత వరంగల్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలు సాగైంది. మక్క తర్వాత పప్పుశనగ 2.55లక్షల ఎకరాలు, వేరుశనగ పంటలు 2.55లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

పలు జిల్లాల్లో భారీగా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో యాసంగి సాగుపై భారీగా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. నల్గొండ జిల్లాలో 4.44 లక్షల ఎకరాలు, నిరుడు కంటే ఇక్కడ దాదాపు 1.38లక్షల ఎకరాల్లో తక్కువగా సాగు నమోదైంది. ఖమ్మం జిల్లాలోనూ 1.30లక్షల ఎకరాల్లో యాసంగి సాగు తగ్గిపోయింది. నిరుడు 3.10 లక్షల ఎకరాల్లో సాగైతే ఈయేడు కేవలం 1.80 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  5.13లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరిగింది.

వర్షపాతం భారీగా తగ్గింది

వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల రాష్ట్రంలో వర్షపాతం భారీగా తగ్గింది. జనవరి నెలలో సాధారణ వర్షపాతం 7.10 మిల్లీమీటర్లు కాగా ఈ సారిలో అసలు వర్షపాతమే నమోదు కాలేదు. ఫిబ్రవరి నెలలో సాధారణ వర్షపాతం 4.90 మిల్లీమీటర్లు కాగా ఈ సారి 1.10మాత్రమే నమోదైంది. మార్చి నెలలో సాధారణ వర్షపాతం 6.40 ఎంఎం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 0.10 ఎంఎం మాత్రమే నమోదైంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలతో వచ్చే వర్షాలపై ఆధాపడి రాష్ట్రంలో 14 శాతం సాగు జరుగుతుంది. అయితే గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఈశాన్య రుతుపవనాల ద్వారా 113.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 52.70 మిల్లీమీటర్లుగా నమోదైంది. అంటే -మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 53.45 శాతం లోటు ఉంది.

ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు 

 జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల్లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో లేక పోవడంతో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. గతేడాది ఇదే టైంకు 25.27 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా ఈసారి కేవలం 8.01టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 39.85టీఎంసీల నీటి నిల్వలు ఉండగా ఈయేడు 35.48 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరుడు 185.63టీఎంసీల నిల్వలు ఉంటే ఈయేడు 138.56 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పులిచింతల, సింగూరు, నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు, కడెం రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. అన్ని ప్రాజెక్టుల్లో కలిపి గతేడాది ఈ సమయంలో 413.63 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రస్తుతం 270.15 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. 

యాసంగిలో తగ్గిన వరి సాగు

యాసంగిలో వరిసాగు గణనీయంగా తగ్గింది. నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే వరి వేశారు. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల వరి సాగు కాగా ఈయేడు ఇప్పటి వరకు 50.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. నిరుడు కంటే దాదాపు 6లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గడం గమనార్హం. వరి సాగు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత సూర్యాపేటలో 3.82లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెప్తున్నాయి.