ఉద్యమకారుల దారి తప్పిందా..?.. కన్ఫ్యూజన్ లో ప్రజలు!

 ఉద్యమకారుల దారి తప్పిందా..?.. కన్ఫ్యూజన్ లో ప్రజలు!

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తుందని.. కేసీఆర్ నియంతగా వ్యవరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పలువురు ఉద్యమకారులు, కళాకారులు.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొందరు మాటలతో కేసీఆర్ ను విమర్శిస్తే.. మరికొందరు పాటలతో కేసీఆర్ పాలనను జనాలకు వివరించే ప్రయత్నం చేశారు. 

కేసీఆర్.. ఉద్యమకారులను మోసం చేశారని, తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని, కేసీఆర్ ను గద్దే దించుతేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని.. గత తొమ్మిదర సంవత్సరాలుగా ప్రజలకు చెప్పుకుంటూ వచ్చిన ఉద్యమకారులు ఒక్కసారిగా ప్లేటు పిరాయించారు. నవంబర్ 30న రాష్ట్రంలో జరుగనున్న  అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఉద్యమకారులు ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అన్నట్టూ ఒకరి వెంట ఒకరు వరుసగా ఆ పార్టీలో చేరుతున్నారు.

కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్ లో చేరి అందరికీ షాకిచ్చాడు. ఇటీవల ఏపూరి సోమన్న గులాబీ గూటికి చేరుకోగా.. తర్వాత  జిట్టా బాలకృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్ గౌడ్..  తాజాగా దరువు ఎల్లన్న కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.  దీంతో ఇన్నీ రోజులు.. కేసీఆర్ అట్లా.. కేసీఆర్ ఇట్లా అంటూ ప్రజల్లో తిరిగిన వీరు.. సడెన్ గా చిరు నవ్వులు చిందిస్తూ  అదే పార్టీలోకి క్యూ కడుతుండడంతో.. అసలేం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.

తమ ఆత్మగౌరవాన్ని  తాకట్టుపెట్టి, బానిసలాగా కేసీఆర్ వద్ద బతుకలేమని..  కేసీఆర్ తీరు నచ్చక టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి..  ఇన్నీ రోజులు విమర్శించిన వీరంతా పదవుల కోసమే మళ్లీ  బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం.. అదే సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో.. ఈసారీ జరగబోయే ఎన్నికల్లో  బీఆర్ఎస్ గెలుస్తుందో, ఓడిపోతుందో తెలియని పరిస్థితుల్లో వీళ్లంతా గులాబీ గూటికి చేరడం గమనార్హం.