వజ్రోత్సవ ర్యాలీలో స్టూడెంట్ల అవస్థ

వజ్రోత్సవ ర్యాలీలో స్టూడెంట్ల అవస్థ
  • వజ్రోత్సవ ర్యాలీలో స్టూడెంట్ల అవస్థ  – మంచిర్యాలలో సొమ్మసిల్లిన 30 మంది  

మంచిర్యాల/అచ్చంపేట/మిర్యాలగూడ/భైంసా, వెలుగు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో సరైన ఏర్పాట్లు లేక స్టూడెంట్లు అవస్థ పడ్డారు. మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రైవేట్​ స్కూళ్లకు చెందిన సుమారు 5వేల మంది స్టూడెంట్లను ఉదయం 10 గంటల వరకు జడ్పీ బాయ్స్​ హైస్కూల్​ గ్రౌండ్​కు తీసుకొచ్చారు. 11.15 గంటలకు ర్యాలీ ప్రారంభించారు. గంటన్నరపాటు దాదాపు 4 కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. దారి మధ్యలో ఎక్కడా తాగునీళ్లు అందుబాటులో ఉంచలేదు. కాలేజీ గ్రౌండ్​కు స్టూడెంట్లంతా ఒకేసారి చేరుకొని భోజనాల దగ్గర క్యూ కట్టారు. నీడ కోసం సరిపడా టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చిన్నారులు ఎండలోనే నేలపై కూర్చొని భోజనాలు చేశారు. కూల్​ వాటర్​ క్యాన్లు చాలక మున్సిపల్​ ట్యాంకర్ల ద్వారా తాగునీళ్లు అందించారు. చేతులు కడుక్కోవడానికి కూడా మురికినీళ్లే దిక్కయ్యాయి. సుమారు 4 గంటల పాటు ఎండలో ఉండడం వల్ల 30 మంది సొమ్మసిల్లి పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​అందించారు. నాగర్‌‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో 11 గంటలకు ర్యాలీ ప్రారంభం కావలసి ఉండగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రావడం ఆలస్యం కావడంతో దాదాపు గంటపాటు స్టూడెంట్లు ఎండలోనే నిలబడ్డారు. గర్ల్స్​కాలేజ్​ ఇంటర్​ఫస్ట్​ఇయర్​ స్టూడెంట్​స్పందన స్పృహ తప్పి పడిపోయింది. మరో స్టూడెంట్​అస్వస్థతకు గురికాగా అంబులెన్స్​లో హాస్పిటల్​కు తరలించారు.

వజ్రోత్సవాలకు రాకుంటే రూ. 500 ఫైన్​
వజ్రోత్సవ వేడుకలకు రాకపోతే రూ. 500 ఫైన్​ వేస్తామని, లోన్లు ఇవ్వబోమంటూ బెదిరించారని నిర్మల్​ జిల్లా ముథోల్​ నియోజకవర్గ కేంద్రంలో మహిళలు ఆరోపించారు. ర్యాలీలో పాల్గొని ముగింపు వేడుకకు వస్తే ఎండలో కూర్చోబెట్టారని, నీటి వసతి కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆఫీసర్ల తీరును నిరసిస్తూ మెయిన్​ రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

స్టూడెంట్లపై పడిన ఎల్​ఈడీ స్క్రీన్​


నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో  శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం  సభ  ఏర్పాటు చేశారు. సభ కొనసాగుతుండగా అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ముందు వరసలో ఉన్న స్టూడెంట్లపై పడింది. ప్రమాదంలో  ఆరుగురు స్టూడెంట్లకు స్వల్ప గాయాలయ్యాయి.