పర్యాటకులను ఆకట్టుకుంటున్న తెలంగాణ ఊటీ అనంతగిరి కొండలు

పర్యాటకులను ఆకట్టుకుంటున్న తెలంగాణ ఊటీ అనంతగిరి కొండలు

వికారాబాద్: భాగ్యనగరానికి అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండలను ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండల్లో గత రెండ్రోజులు కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కళకళలాడుతున్నాయి. పచ్చని చెట్లతో అనంతగిరి అటవీ ప్రాంతం  పర్యాటకులను మైమరిపిస్తోంది. ఈ ప్రాంతంలో అడవిని ముద్దాడుతూ వెళుతున్న మేఘాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  ఇక్కడి ఆహ్వాదకర వాతావరణాన్ని  పర్యాటకులతోపాటు స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో 'అనంతగిరి కొండలు' ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ  ప్రాంతం.. అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా కొండలు, అడవి అందాల మధ్య 1,300 సంవత్సరాల చరిత్ర గల అనంత పద్మ నాభస్వామి ఆలయం  ఉంది. అనంతగిరిని 'తెలంగాణ ఊటీ'గా పిలుస్తుంటారు. ఈ కొండల పైనుంచి వచ్చే నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్‌కు ప్రవహిస్తాయి. మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానం.  ఇక్కడి అడవులు తెలంగాణ రాష్ట్రంలోనే దట్టమైనవిగా ప్రసిద్ధి.  

ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు

వికారాబాద్‌ నుంచి అనంతగిరికి వెళ్తుంటే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవాళ్లు ఇక్కడికి వస్తే ఉత్తేజితమవుతారు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరితవనాలు, ఇరుకైన లోయలు, అలరించే నెమళ్లు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. 

అనంతరగిరి కొండల్లో  వెల్లి విరిసిన ఆథ్యాత్మకత 

అనంతర గిరి కొండలు ఆథ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి.. ప్రసిద్ధి చెందిన అనంత పద్మ నాభస్వామి ఆలయంతోపాటు దిగువన లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణినే మూసీనది జన్మస్థానంగా చెబుతారు. ఈ నది ఓ చిన్నపాయగా ప్రారంభమై మూసీగా హైదరాబాద్‌ నగరంలో ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. సినిమా వాళ్లను సైతం ఇక్కడి ప్రదేశాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగ్‌లకు వస్తుంటారు. అనంతగిరి కొండలను, అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులే కాదు... టాలీవుడ్ టూ బాలీవుడ్  సినీ నిర్మాతలు, దర్శకులూ ఈ ప్రాంతం పట్ల ఆసక్తి చూపుతున్నారు.

రవాణా సౌకర్యం.. 

ఇన్ని  అందాలు ఉన్న ఈ అనంతగిరి కొండలు చారిత్రక హైదరాబాద్ కు పక్కనే ఉండటం విశేషం.. హైద్రాబాద్ లోని సెంట్రల్ బస్  స్టేషన్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది ..అంతే కాకుండా ముంబై వెళ్లే ప్రతి రైలు వికారాబాద్ లో  ఆగుతుంది .. సొంత వాహనాల్లో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది..
అయితే ఇన్ని వింతలు విశేషాలతో.. ముఖ్యంగా ప్రకృతి సోయగాలతో ఆకట్టుకుంటున్న అనంతగిరి కొండలను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దాలని ఇక్కడి వస్తున్న పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.