
ఎన్నో ఏళ్ళుగా చట్టబద్ధ శ్రమదోపిడీకి గురవుతూ, ఏదో ఒకనాడు ప్రభుత్వం తమను ఉద్యోగులుగా గుర్తించకపోతుందా? అన్న గంపెడు ఆశలతో ‘త్రిశంకు స్వర్గం’లో కాలం వెళ్ళబుచ్చుతున్నారు తాత్కాలిక ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్రంలో వీరి సంఖ్య లక్షకు పైమాటే! ప్రభుత్వ గణాంకాలు ప్రకారమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 58,128, కాంటింజెంట్ ఉద్యోగుల సంఖ్య 66,239 మంది ఉన్నారు. వెరసి 1,24,317 మంది ప్రభుత్వ కార్యాలయాలలో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరూ ఉద్యోగ భద్రత కరువై ‘దినదినగండం నూరేళ్ళు ఆయుష్షు’ అన్నవిధంగా చాలీచాలని వేతన జీవులుగా కుటుంబాలు నెట్టుకొస్తున్నారు.
‘సమాన పనికి సమాన వేతనం’ అన్న కనీస ప్రజాస్వామ్య సూత్రాలను ప్రభుత్వాలే వీరి విషయంలో ఉల్లంఘిస్తున్నాయి. పక్కనే తనలాంటి పనే చేస్తున్న పూర్తిస్థాయి ఉద్యోగి ఉద్యోగ భద్రతతో పాటు, స్కేలు ప్రకారం పూర్తివేతనం పొందుతుండగా.. అదే పనిచేస్తూ కూడా అందులో మూడో వంతు వేతనం కూడా అందక, అరకొర వేతనాలు కూడా సకాలంలో అందకపడే ఇబ్బందులు అంతాఇంతా కాదు. వీరి మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో సాటి మనిషిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో గత పది మాసాలుగా, అందే ఆ అరకొర వేతనం కూడా అందక, బయట చేబదులు, అప్పులు పుట్టక ఈ ఉద్యోగులు పడే గృహ సర్దుబాటు హింస వర్ణించలేనిది. తెలంగాణలో గ్రూపు ఫోర్ రకానికి చెందిన వేతన జీవులు లిఫ్టు ఆపరేటర్లు, వాచ్మెన్, కుక్, రికార్డు అసిస్టెంట్ లాంటి ఔట్సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగులకు గత పది మాసాలుగా వేతనాలు అందక పోవడం ఆందోళనకరమైన విషయం.
మూడు రకాల ఉద్యోగులు
ఉద్యోగులకు ఒకటవ తేదీనే వేతనం ఇస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ వేతన జీవుల పట్ల ఎందుకింత ఆలసత్వం వహిస్తుందో అర్థం కాని విషయం. ఒకసారి ఈ వేతన జీవులగురించి సమీక్షిస్తే మొదట సర్వశిక్షా అభియాన్ లాంటి తాత్కాలిక స్కీంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడం కొరకు కాంటింజెంట్ ఉద్యోగుల నియామకం చేపట్టారు. అటుతర్వాత పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, డీఆర్డీఏ, పేదరికం నిర్మూలనా కార్యక్రమం, ఇరిగేషన్, న్యాయ, ప్రజా సంబంధాలు ఇలా ప్రతి ప్రభుత్వ శాఖలో ఔట్సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగుల నియామకాలు జరిగాయి. 2007 నుంచి మొదలైన ఈ ప్రక్రియ నేటికీ ఎదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. మూడు రకాలైన శ్రేణులు ఈ ఔట్సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగులలో ఉన్నారు.
తొలుత వీరు గ్రేడ్ 4 ఉద్యోగుల క్యాడర్ అయిన అఫీస్ సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, జమ్మేదార్, లిఫ్టు ఆపరేటర్లు, క్యాషియర్ తదితర పనుల్లో వీరిని నెలకు రూ.12000 -నుంచి19000 వేతనాలపై నియమించారు. గ్రూపు 3రకం పోస్టులైన జూనియర్ అసిస్టెంట్, స్టెనో, టైపిస్ట్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, ప్రభుత్వ డ్రైవర్లకు రూ.15000 -నుంచి 22,900 శ్రేణిలో నియమించారు. ఇక గ్రూపు3(ఏ)రకం కేటగిరీకి సంబంధించిన సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్ తదితరుల కేటగిరీ కింద రూ.17,500 -నుంచి 31,040 రూపాయల వరకు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెట్టే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలలో కూడా 290 మంది కేవలం 27,440 -రూపాయల నెలసరి వేతనంపై పనిచేస్తున్నారు.
శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి
కేజీబివిలో స్పెషల్ ఆఫీసర్‌కు రూ. 25,000 నుంచి 32,000, -సిఆర్టీకి రూ. 20,000 -నుంచి 26,000 రూపాయలు, పిఇటికి రూ.12000 నుంచి15,600 రూపాయలకు, అందులో వర్కర్లకు రూ. 7,500 నుంచి 9,700కు వేతనాలు పెరిగాయి. ఈ తాత్కాలిక ఉద్యోగులకు పెరిగిన డిఏలు, పిఆర్సీలు, ఐఆర్‌లు వర్తించవు. ఇటీవల కాలంలోనే ఏడాది సీనియారిటీకి వేతనంలో వెయ్యి రూపాయలు పెంచుతూ ఉపశమనం కల్పించారు. కేవలం ఆరేండ్లు నిండిన తాత్కాలిక మహిళా ఉద్యోగులకు మాత్రమే మెటర్నిటీ సెలవులు వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు మాదిరి సేవలు అందిస్తున్నప్పటికీ వారిలో సగంవేతనాలు మాత్రమే వీరు పొందుతున్నారు.
ఇక గురుకులాలలో పనిచేసే సిబ్బంది జీతాలు కూడా గత మూడు మాసాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచన చేసి తాత్కాలిక ఉద్యోగులకు అందే కొద్ది వేతనం పెండింగ్ జాబితాలో ఉంచకుండా, రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన విధంగా ప్రతినెలా మొదటి తేదీకి ఇవ్వాలి. అంతేకాదు వీరి పనికి తగ్గ లేదా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది.
ఉద్యోగుల శ్రమ దోపిడీ
తెలంగాణ రాష్ట్రంలో దినసరి వేతనం కూలీల రోజుకూలీ కూడా ఇప్పుడు 700 రూపాయల వరకు ఉంది. దినసరి కూలికంటే అన్యాయంగా తాత్కాలిక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరుకాక రాష్ట్రంలో ఉన్న బోధనా సిబ్బంది కూడా ఇప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్నారు. తెలంగాణలో ఎదుగు బొదుగు లేని వేతనాలతో పనిచేస్తున్నారు. 3,687మంది జూనియర్ లెక్చరర్స్ నెలకు ఒక్కరికి 54,220 రూపాయలు, 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్స్ నెలకు 58,880 రూపాయలు, 926 మంది డిగ్రీ లెక్చరర్స్ 58,851 రూపాయలు, 63మంది పార్టు టైం లెక్చరర్స్ 28,800 రూపాయలు, మరో 390 మంది గెస్టు ఫ్యాకల్టీలు కూడా ఎదుగు బొదుగులేని వేతనంతో పనిచేస్తున్నారు.
అంటే ఉద్యోగుల శారీరక శ్రమతోపాటు మేధోశ్రమ కూడా రెండు దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలే దోచుకుంటున్నాయని చెప్పవచ్చును. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో బాలికా సాధికారత సాధన పేరుతో నడుస్తున్న కస్తూరిబా బాలికా విద్యాలయాల నందు ఇదే పరిస్థితి గత రెండు దశాబ్దాలుగా ఉంది. వీరు గత ఏడాది చేసిన సుదీర్ఘ సమ్మె, ఆందోళన ఫలితంగా తమ తాత్కాలిక వేతనంపై 30శాతం పెరుగుదల 2025 ఏడాది నుంచి పొందగలిగారు.
ఎన్.తిర్మల్, సీనియర్ జర్నలిస్ట్