విద్యా వ్యవస్థలో.. సోషల్ వర్కర్లు అవసరం

విద్యా వ్యవస్థలో.. సోషల్ వర్కర్లు అవసరం

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో 5711 ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల పట్ల అవగాహన, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత్వ నిర్మూలన, చైల్డ్ రైట్స్ క్లబ్ ఏర్పాటు, డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్చడం, పిల్లలకు న్యాయ సలహాలు, సహాయం అందించడం వంటి లక్ష్యాలతో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడి నియామకం కోసం పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ మధ్య జరిగిన ఒప్పందంతో విద్యా సంస్థల్లో సోషల్ వర్కర్ల నియామకానికి సంబందించిన అంశం మరొక్కసారి తెర మీదకు వచ్చింది. 

నిజానికి గత కొన్నాళ్లుగా వరుసగా నమోదవుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు వారి జీవించే హక్కుకు అవరోధంగా మారిన నేపథ్యంలో విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం పెంపొందించి ఆత్మహత్యల నివారణ కోసం విద్యా కౌన్సిలర్ల నియామకంపై పెద్ద చర్చనే జరుగుతుంది.  ఇటీవల  భారత ఉన్నత న్యాయస్థానం సైతం అన్ని విద్యా సంస్థల్లో విద్యా కౌన్సిలర్ల నియామకం జరపాలని చారిత్రాత్మక తీర్పు చెప్పింది.

విద్యార్థుల్లో మానసిక, భావోద్వేగ అభివృద్ధి జరగకపోగా, విద్యా పరమైన అంశాలతో పాటుగా, అనేక కారణాల వల్ల  ఒత్తిడిలో ఉంటున్న చిన్నారులకు నైతిక మద్దతు కరవవుతూ ఉండడం విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా మారుతున్నది. 

పోటీ ప్రపంచంలో ఆటలు వినోదం వంటివి విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. కానీ, నేడు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం పూర్తిగా తగ్గిపోయింది.  తెలిసి, తెలియని  వయసులో అసాంఘిక కార్యక్రమాల్లో పిల్లలు భాగస్వాములు కాకుండా పర్యవేక్షించే సామాజిక నియంత్రణ వ్యవస్థల వైఫల్యంతో మాదక ద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలకు బాల్య దశలోనే బానిసలుగా మారుతున్నారు.   సామాజిక మాధ్యమాల వినియోగం చిన్నప్పటి నుండే పెరగడంతో  సైబర్ నేరగాళ్ల, అసాంఘిక శక్తులు చిన్నారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. అన్ సేఫ్ బ్రౌజింగ్ తో నేరగాళ్ళ ఊబిలో సులభంగా చిక్కుకుపోతున్నారు.

సోషల్​ వర్కర్ల నియామకం చేయాలి

తాజాగా బాలల రక్షణ కోసం ఉపాధ్యాయుల నుండే ఒకరిని ప్రొటెక్షన్ అధికారులుగా నియమించేలా నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. నిజానికి చిన్నారుల రక్షణ, మెరుగైన మానవ వనరులుగా వారిని తీర్చిదిద్దే అంశంలో ప్రొటెక్షన్ అధికారుల నియామకం అభినందనీయం.  అయితే  రోజుకు దాదాపు 4-– 5 గంటల వర్క్​లోడ్ తో పాఠాలు చెబుతున్న ఉపాద్యాయులు ఇటువంటి అదనపు బాధ్యతలను ఎంత సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు? సోషల్ వర్కర్లు ఆ పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించగలుగుతారు. 

మిగతా అన్ని కోర్సులతో పోలిస్తే సోషల్ వర్క్ విభిన్నంగా ఉంటుంది. సోషల్ వర్క్ విధానాలు, సైకాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రెషన్, వంటి విభిన్న కోర్సుల కలయికతో అభ్యసించడం వల్ల సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించగలిగే నైపుణ్యాలు సోషల్​ వర్కర్లకు ఉంటుంది. బాలల హక్కుల రక్షణలో కౌన్సిలర్లుగా, పారా లీగల్ అడ్వైసర్లుగా, సమాజం- విద్యార్థుల మధ్య వారధులుగా, కమ్యూనిటీ ఆర్గనైజర్లుగా సోషల్ వర్కర్లు విభిన్న పాత్రలు పోషిస్తూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలతో పాటుగా, డ్రగ్స్, లైంగిక దాడులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సమస్యల నుండి విద్యార్థులను రక్షించడం కోసం అధికారిక విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయగలుగుతారు. 

చిన్నారుల హక్కులు కాపాడడం, రక్షణతో పాటుగా వారి గుణాత్మక అభివృద్దిలో అనేక కోణాల్లో సోషల్ వర్కర్ల పాత్ర ప్రధానంగా కనిపిస్తున్నది. అందుకే విద్యా సంస్థల్లో విద్యా కౌన్సిలర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల నియామకం పట్ల ప్రభుత్వం పునరాలోచన చేసి, సోషల్ వర్కర్లను ఆయా స్థానాల్లో నియమించాలి. తద్వారా విద్యతో పాటుగా ప్రాథమిక స్థాయి నుండే చిన్నారుల్లో మానవీయ విలువలు పెంపొందించగలిగి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాము.

- డా. అనిల్ మేర్జ
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.