రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. 4 వేల మెగా వాట్ల ప్లాంట్లకు త్వరలో టెండర్లు

రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. 4 వేల మెగా వాట్ల ప్లాంట్లకు త్వరలో టెండర్లు
  • పీక్ టైమ్ లో సోలార్​పవర్ ఉపయోగించేలా ఏర్పాట్లు
  • ఇప్పటికే 375 మెగావాట్ల బీఈఎస్ఎస్ కరెంట్ గ్రిడ్ కు అనుసంధానం 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​సిస్టమ్​(బీఈఎస్​ఎస్​) ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. 4 వేల మెగావాట్ల బీఈఎస్​ఎస్​ ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలవనుంది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్​మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల పీక్​ టైమ్​లో కరెంట్​ కోతలు లేకుండా గ్రీన్​ఎనర్జీ వాడుకునేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 375 మెగావాట్ల బీఈఎస్ఎస్ కరెంట్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు. 

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పనిచేది ఇలా.. 

సోలార్, విండ్​ పవర్​లాంటి పునరుత్పాదక ఇంధనాన్ని పగటిపూట మాత్రమే వినియోగించుకునే వీలుంటుంది. ఈ విద్యుత్​ను నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకునేందుకు బీఈఎస్ఎస్ అవసరమవుతుంది. ఇలా నిల్వ చేసిన విద్యుత్​ను సూర్యుడు లేని సమయంలో, పీక్​ పీరియడ్​లో ఉపయోగించుకోవడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. విద్యుత్​ నిల్వ చేయడానికి లిథియం, ఐయాన్, ఫ్లో బ్యాటరీలను ఉపయోగిస్తారు. బ్యాటరీ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్​), ఎనర్జీ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్ (ఈఎంఎస్​) పద్ధతి ద్వారా కరెంట్​సప్లయ్​చేస్తారు. పగటిపూట ఉత్పత్తి అయిన వాడుకోని సోలార్ పవర్​ను ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకునేందుకు సర్కారు ప్లాన్​ చేస్తోంది.

డిమాండ్​కు తగ్గట్టు సప్లై చేసేందుకు..

పీక్​టైమ్​లో విద్యుత్​ కొనాలంటే ఎక్కువ రేటు ఉంటుంది. ఉదయం 6 నుంచి 10, రాత్రి 6 నుంచి 10 గంటల మధ్య సమయాన్ని విద్యుత్​ శాఖ పీక్ టైమ్​గా పరిగణిస్తుంది. ఈ టైమ్​లో ఇండ్లు, పరిశ్రమల్లో వినియోగం ఎక్కవగా ఉండడంవల్ల డిమాండ్​ను తగ్గట్టు సప్లయ్​చేయడానికి బయటి నుంచి విద్యుత్​ కొనుగోలుచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఒక్కో యూనిట్​మీద రూ.3 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అవసరమైన మేరకు కరెంట్​ అందుబాటులో లేక కొన్నిసార్లు కోతలు విధించాల్సివస్తోంది. బీఈఎస్​ఎస్​ సిస్టమ్​ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని పీక్​ టైమ్​లో డిమాండ్​కు తగ్గట్టు సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. డిస్కమ్​లకు రూ. వేల కోట్ల విద్యుత్​ కొనుగోళ్ల ఖర్చులు తగ్గిపోతాయి. 

పవర్​ గ్రిడ్​తో అనుసంధానం

రాష్ట్రంలో ఇప్పటికే 375 మెగావాట్ల బీఈఎస్ఎస్ కరెంట్ గ్రిడ్ కు అనుసంధానం చేసినట్టు ఇంజినీర్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం దగ్గర 220 కేవీ సబ్​స్టేషన్​ సమీపంలో 187.5 మెగావాట్స్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ 220 కేవీ సబ్​ స్టేషన్​ వద్ద 187.5 మెగావాట్స్​ సామర్థ్యం కలిగిన బీఈఎస్​ఎస్​ ప్లాంట్లను ఇప్పటికే పవర్​ గ్రిడ్​తో అనుసంధానం చేశారు. సింగరేణి ద్వారా మంచిర్యాల జిల్లా మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్​ విద్యుతుత్పత్తి ప్లాంట్​తో లింక్​ చేసి ఒక మెగావాట్​ సామర్థ్యం కలిగిన బీఈఎస్​ఎస్​ ప్లాంట్ ను పైలట్​ ప్రాజెక్ట్​గా​ ఏర్పాటు చేశారు. దీనికోసం రూ.2.73 కోట్లు ఖర్చుచేశారు. ఏడాదికి 9.1 లక్షల యూనిట్ల పవర్​ను స్టోర్​చేసి పీక్​ టైమ్​లో ఉపయోగించి ఏడాదికి రూ.70 లక్షలు ఆదా చేసుకోవాలని భావిస్తున్నది. ఇది సక్సెస్​ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ సింగరేణి ఏరియాలలో 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీఈఎస్​ఎస్​ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సిద్దమైంది. 

4 వేల మెగావాట్ల బీఈఎస్​ఎస్ ​ఏర్పాటు.. 

రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల బీఈఎస్​ఎస్​ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. జెన్​కో ఆధ్వర్యంలో టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఒక మెగావాట్​కు రూ.7 కోట్ల చొప్పున మొత్తం రూ.28 వేల కోట్ల పెట్టుబడితో బీఈఎస్​ఎస్​ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టెండర్లు ఖరారైన తర్వాత ఏడాది నుంచి ఎడాదిన్నర లోపు బ్యాటరీలు అమర్చి గ్రిడ్​కు అనుసంధానం చేయవచ్చని జెన్​కో ఇంజినీర్లు తెలిపారు. ఎల్​నినో వల్ల పెరుగుతున్న విద్యుత్​ డిమాండ్​ను తట్టుకోవడానికి ఈ ప్లాంట్ల ఏర్పాటు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్​ కు కేంద్ర ప్రభుత్వం ఒక మెగా వాట్​కు రూ.3.14 లక్షల చొప్పున రూ.2,500 కోట్లు సబ్సిడీ గా అందించనున్నది. మంత్రివర్గం కేవలం బీఈఎస్​ఎస్​ ప్లాంట్ల కెపాసిటీ, టెండర్ ప్రక్రియకు మాత్రమే ఆమోదం ఇచ్చింది. టెండర్లు పిలిచిన తర్వాతనే సైట్లు, ఎక్కడ ఎన్ని మెగావాట్ల కెపాసిటీ వంటి విషయాలు ఖరారు చేయనున్నారు. సాధారణంగా ప్రభుత్వ విద్యుత్​ సబ్‌‌‌‌ స్టేషన్ల దగ్గర లేదా అనువైన గ్రిడ్ పాయింట్లలోనే ఈ బీఈఎస్​ఎస్​ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారని ఇంజినీర్లు చెబుతున్నారు.