తెలంగాణ పోలీసులకు నిరంతర శిక్షణ అవసరం

తెలంగాణ పోలీసులకు  నిరంతర శిక్షణ అవసరం

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహిస్తున్న పోలీసు యంత్రాంగం సామర్థ్యం, శక్తి, నిబద్ధత గురించి ఎలాంటి సందేహమూ లేదు. కానీ, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు, నేర సవాళ్ల ముందు సంప్రదాయ పద్ధతులు విఫలమవుతున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు యంత్రాంగం నిస్సందేహంగా గౌరవనీయమైనదే.  అయినా, మాదకద్రవ్యాల ప్రభావంలో తమ నియంత్రణ కోల్పోయి భయంకరమైన హింసకు పాల్పడుతున్న గంజాయి మూకలు,  వ్యవస్థీకృత  నేరాలు చేస్తున్న  దేశీ,  విదేశీ ముఠాలను ఎదుర్కోవడానికి మన పోలీసులకు ప్రస్తుత శిక్షణ సరిపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక విదేశీయుడిని అదుపులోకి తీసుకోవడానికి చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు రౌడీషీటర్ల సహాయాన్ని కోరవలసి వచ్చింది. 

ఇటీవల హైదరాబాద్‌‌లోని చాదర్‌‌ఘాట్‌‌లో ఓ దొంగ కత్తితో దాడికి యత్నించడం, మొన్నటికి మొన్న నిజామాబాద్‌‌లో రియాజ్ అనే వ్యక్తి ఇటీవలి ఎన్‌‌కౌంటర్ ఉదంతం,  నేరగాళ్లు ఎంతటి ప్రమాదకరంగా ప్రతిఘటిస్తున్నారో,  సిబ్బందిపై  ఎంతటి  హింసకు పాల్పడుతున్నారో స్పష్టం చేసింది. మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్న నేరగాళ్లు  భయంకరమైన ప్రతిఘటనను అందించడమే కాకుండా,  నొప్పికి కూడా స్పందించకపోవడం వలన సంప్రదాయ పద్ధతులు తరచుగా విఫలమవుతున్నాయి. ఇటువంటి ఏకపక్ష దాడులు, మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే ఊహించని ప్రతిఘటనను నియంత్రించడానికి మన సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న ప్రాథమిక ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణ ఎంతమాత్రం సరిపోదు. ఈ తరహా ప్రమాద సృష్టికర్తలను ఎదుర్కోవడానికి మన పోలీసులకు తక్షణమే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక వ్యూహాలు, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఎంతైనా అవసరం ఉందని స్పష్టమవుతున్నది. 

మినిమమ్ ఫోర్స్​ ప్రిన్సిపల్స్​

అంతర్జాతీయ పోలీసు దళాలు, ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో,  శాంతిభద్రతల నిర్వహణలో కనీస బలప్రయోగం (మినిమమ్​ ఫోర్స్) సూత్రానికి కట్టుబడి ఉంటూ, నేరస్తుడిని సమర్థవంతంగా, సురక్షితంగా అదుపులోకి తీసుకోవడానికి ఒక క్రమబద్ధమైన బలప్రయోగ నిరంతర విధానాన్ని  అనుసరిస్తున్నాయి.  ఈ విధానంలో,  సిబ్బంది  ప్రతిఘటన స్థాయిని బట్టి బలప్రయోగాన్ని  క్రమంగా పెంచాలి. మాటలతో  శాంతింపజేయడం అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది.  ఆ తర్వాతే,  టాక్టికల్ కంబ్యాటివ్స్, పోలీస్ హోల్డింగ్ అండ్ కంట్రోల్ టెక్నిక్స్,  గ్రేప్లింగ్ టెక్నిక్స్ వంటి  అధునాతన  వ్యూహాలపై  ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ పద్ధతులు కేవలం శారీరక శక్తిని మాత్రమే కాకుండా అంచనా వేయడం, నిశ్చలత్వం కలిగించడంతో పాటు పట్టుకోవడం వంటి తెలివైన వ్యూహాలను కూడా బోధిస్తాయి.

నేరస్తులపై మాదకద్రవ్యాల ప్రభావం

ముఖ్యంగా మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్న నేరస్తులు నొప్పికి స్పందించని దృష్ట్యా, సంప్రదాయ బలప్రయోగం విఫలమయ్యే చోట ఈ టెక్నిక్స్ కీలకం అవుతాయి, ఇవి ప్రత్యర్థిని తక్కువ హానితో నియంత్రణలోకి తీసుకుంటాయి. తద్వారా సిబ్బందికి,  నేరస్తుడికి ఆయుధాల వినియోగం లేదా తీవ్రమైన శారీరక ఘర్షణ అవసరం లేకుండానే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వీలవుతుంది.  దీని ఫలితంగా ప్రతికూల పరిస్థితులలో సిబ్బంది రక్షణ పెరగడమేకాక, నేరస్తుడికి కలిగే గాయాన్ని కూడా కనిష్ఠం చేస్తాయి.  ఇది భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మానవ హక్కుల పరిరక్షణకు అత్యంత అవశ్యం.  ఈ వ్యూహాల అమలులో డీ-ఎస్కలేషన్ టెక్నిక్స్,  క్రైసిస్ ఇంటర్వెన్షన్ ట్రైనింగ్  వంటి మానసిక నిర్వహణ శిక్షణలు అంతర్భాగంగా ఉన్నాయి.  ఉద్రిక్తంగా ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, వారికి  కౌన్సెలింగ్ ద్వారా అదుపులోకి తీసుకోవడానికి వీలవుతుంది.  ఈ శిక్షణతో  మన సిబ్బంది అనవసరమైన బలప్రయోగాన్ని పూర్తిగా నివారించి, మానసిక పరిపక్వతతో కూడిన వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు.

నిరంతర శిక్షణ,  సంస్కరణల అవసరం

అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) తన శిక్షణ పాఠ్యాంశాలలో తక్షణమే ఈ అధునాతన ఆత్మరక్షణ, సాంకేతికతతో నిర్వహణ పద్ధతులను పూర్తిస్థాయిలో చేర్చాల్సిన బాధ్యత ఉంది.  ఈ సంస్కరణ కేవలం అకాడమీకే పరిమితం కాకుండా జిల్లా శిక్షణా కేంద్రాలకు కూడా విస్తరించాలి.  అంతేకాకుండా ఆత్మరక్షణ,

నైపుణ్యాలు, లేదా డీ-ఎస్కలేషన్ వ్యూహాలు కేవలం 

ప్రారంభంలో ఒకసారి శిక్షణ పొందితే సరిపోయేవి కావు.  ప్రతి పోలీసు అధికారికి, కానిస్టేబుల్‌‌కు నియమిత పునశ్చరణ శిక్షణ  అత్యంత కీలకం.  శిక్షణ పొందిన నైపుణ్యాన్ని నిరంతరం పదును పెట్టడానికి, ప్రతి సంవత్సరం తప్పనిసరిగా రీఫ్రెషర్ కోర్సులు, రియాజ్ వంటి  ప్రమాదకరమైన నేరగాళ్ల ప్రతిఘటన,  డ్రగ్స్ ప్రభావంలో ఉన్న వ్యక్తులను లేదా బలంగా ప్రతిఘటించే విదేశీ నేరగాళ్లను ఎలా అదుపులోకి తీసుకోవాలో వివరించే వాస్తవ పరిస్థితుల సిమ్యులేషన్‌‌లు నిర్వహించాలి. 

పోలీస్ వ్యవస్థపై గౌరవంఈ నిరంతర శిక్షణ  ప్రతి సిబ్బందిని శారీరకంగా, మానసికంగా, చట్టపరంగా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సమాయత్తం చేస్తుంది, తద్వారా వారు క్లిష్ట సమయాల్లో కూడా సహజంగా,  వృత్తిపరంగా స్పందించగలరు. తమ విధులను పూర్తి నైపుణ్యంతో,  ధైర్యంతో,  పారదర్శకతతో నిర్వహించడానికి మార్గం సుగమం చేస్తాయి, తద్వారా ప్రజా విశ్వాసం పదిలంగా ఉంటుంది.  పోలీస్ వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది. ఈ అత్యవసర ఆవశ్యకతపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌‌ను  ఏర్పాటు చేసి, శిక్షణ కార్యక్రమాలకు సరిపడా నిధులను కేటాయించాలి. ఈ మొత్తం ప్రక్రియపై శాసనసభ లేదా న్యాయపరమైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలి. జవాబుదారీతనంతో కూడిన, ఆదర్శవంతమైన, అధునాతన శిక్షణ కలిగిన పోలీసు వ్యవస్థను స్థాపించడం అనివార్యం.


-  డా.కట్కూరి
సైబర్ సెక్యూరిటీ
& న్యాయ నిపుణుడు