కర్నాటక చుట్టూ తెలంగాణ పాలిటిక్స్

కర్నాటక చుట్టూ తెలంగాణ పాలిటిక్స్
  • కర్నాటక గ్యారంటీస్​ ఫార్ములాతో జనంలోకి కాంగ్రెస్​
  • ఇంటింటికీ ఆరు గ్యారంటీల కార్డు పంపిణీ
  • అక్కడ అమలు చేయలేదంటున్న బీఆర్​ఎస్​, బీజేపీ 
  • మూడు పార్టీల ప్రచారంలోనూ కర్నాటక నేతల జోరు

హైదరాబాద్​, వెలుగు:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తొలిసారి కర్నాటక చుట్టూ తిరుగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఆ రాష్ట్రాన్నే సెంట్రిక్​గా  చేసుకుని జనంలోకి వెళ్తున్నాయి. ఏకంగా కర్నాటక లీడర్లను ఇక్కడికి రప్పించి ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ ఏడాది మే నెల​లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పొరుగున ఉన్న రాష్ట్రం కావటం.. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లు అక్కడి ఎన్నికల్లో ప్రచారం చేపట్టడంతో అక్కడి ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణకు సోకినట్లయింది. 

అప్పటివరకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్​ విజయం సాధించడంతో రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ కాంగ్రెస్​ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది. అప్పటివరకు జోరు మీదున్న బీజేపీలో సంస్థాగత  మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ ఎన్నికల్లో హామీ ఇచ్చిన  ఫైవ్​ గ్యారంటీస్ తమను అధికారంలోకి తెచ్చాయంటున్న కాంగ్రెస్​.. తెలంగాణలోనూ అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. మరో గ్యారంటీని అదనంగా జోడించి..ఆరు గ్యారంటీ లతో ఇక్కడ ప్రచారం సాగిస్తున్నది. ఫైవ్​ గ్యారంటీస్​ అమలుపై కర్నాటక లీడర్లను తీసుకొచ్చి ఇక్కడి ప్రజలకు చెప్పిస్తున్నది. ఇక.. కర్నాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్​ పార్టీ హామీలు అమలు చేయలేకపోతున్నదనే బీఆర్​ఎస్​, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. 

బీఆర్​ఎస్​ ఎదురుదాడి

కర్నాటక మోడల్​ను ఫెయిల్యూర్​ మోడల్​ అని బీఆర్​ఎస్​ తన ప్రచారంలో పదే పదే చెప్తూ వస్తున్నది. కేసీఆర్​ సహా ఆ పార్టీ నేతలంతా ఇదే అంశాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ కర్నాటకలో ఐదుగంటల కరెంట్​ ఇస్తున్నట్లు చెప్పారని, ఇక్కడ ఐదు గంటల కరెంట్​ కావాల్నో..  24 గంటల కరెంట్​ కావాల్నో తేల్చుకోవాలంటూ ప్రతి సభలోనూ బీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు. అంతేగాకుండా కర్నాటకలో కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఫెయిల్​ అయిందంటూ అక్కడి రైతులను బీఆర్​ఎస్​ నేతలు ఇక్కడికి తీసుకొస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. కొడంగల్​లో ఇటీవల మంత్రి కేటీఆర్​ నిర్వహించిన సభకూ కర్నాటక నుంచి రైతులను తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ అక్కడి రైతులు.. రాష్ట్రంలో ఈ నెల 22న హైదరాబాద్​లోని ధర్నాచౌక్​ వద్ద దీక్ష చేసేందుకు ఈసీని అనుమతి కోరారు. 

ఆ రైతులను కూడా బీఆర్​ఎస్​ వాళ్లే తీసుకొచ్చారని కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన జేడీఎస్​ నేత కుమారస్వామి రెండు రోజుల కింద సడన్​గా తెలంగాణ పాలిటిక్స్​లోకి ఎంటరయ్యారు. తెలంగాణ ప్రజలనుద్దేశించి కర్నాటక వేదికగా కర్నాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  కుమారస్వామితో సీఎం కేసీఆర్​ ఫోన్​లో మాట్లాడిన తర్వాతే ఈ ప్రెస్​ మీట్​ పెట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. అంతేగాకుండా కుమారస్వామి ప్రెస్​మీట్​ను రాష్ట్రంలో లైవ్​ కవరేజీ ఇచ్చేలా అన్ని చానెళ్లకు మంత్రి హరీశ్​ రావు ద్వారా సందేశాలు వెళ్లాయని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆరోపించారు. కర్నాటకలో ఐదు గ్యారంటీలకే గతి లేదు.. 

తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారని కుమార స్వామి తన ప్రెస్​మీట్​లో కామెంట్స్​ చేశారు. సామాన్యులపై కరెంట్​ భారాన్ని కాంగ్రెస్​ సర్కారు మోపిందని ఆయన అన్నారు. ఇవన్నీ కూడా బీఆర్​ఎస్​ రాసిచ్చిన స్క్రిప్టేనని కాంగ్రెస్​ నేతలు మండిపడుతున్నారు. 

కర్నాటక పరిస్థితి దిగజారిందంటున్న బీజేపీ

కర్నాటకలో ఓటమి తర్వాత తెలంగాణలోనూ బీజేపీపై ఎఫెక్ట్​ పడింది. కర్నాటకలో అధికారం చేజారిపోవడం.. ఆ తర్వాత ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటిదాకా ఉన్న బీజేపీ హవా తగ్గింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం.. పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వచ్చేస్తుండడంతో తెలంగాణలో బీజేపీ డీలా పడింది. అయితే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్​ను దెబ్బ కొట్టేందుకు కర్నాటకది ఫెయిల్యూర్​ మోడల్​ అని బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఐదు గ్యారంటీల అమలు మాట దేవుడెరుగు.. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నాటకలో ఐదు నెలల్లోనే ఐదేండ్ల నష్టం జరిగిందని బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి ఆరోపించారు. అంతేగాకుండా కర్నాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు. కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప మంగళవారం హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలో  కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్​ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గ్యారంటీలను నమ్మి ఓటేసినందుకు కర్నాటక మహిళలు మోసపోయారని, ఆర్డినరీ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం అందిస్తున్నారని పేర్కొన్నారు. అసలు అక్కడి ప్రభుత్వం ఇంకో ఆరు నెలలైనా ఉంటుందన్న గ్యారంటీ లేదని కామెంట్లు చేశారు. 

గ్యారంటీస్​తో కాంగ్రెస్​ ముందుకు

ఆరు గ్యారంటీల కార్డునే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తమ  ప్రధాన ఆయుధంగా నమ్ముకుంది. వంద రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నది. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి స్కీములను ప్రకటించింది. కర్నాటక తరహాలోనే ఆ గ్యారంటీ కార్డులను ఇంటింటికీ కాంగ్రెస్​ నేతలు పంపిణీ చేస్తున్నారు. వీటికి తోడుగా కర్నాటక లో కాంగ్రెస్​ ముఖ్య నేతలను రాష్ట్రంలో ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ ప్రచారంలో పాల్గొన్నారు. 

వచ్చే వారం నిర్వహించనున్న గౌడ సమావేశానికి మరోసారి సిద్ధరామయ్య హాజరుకానున్నారు. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే కూడా కర్నాటక వ్యక్తి కావడంతో.. రెండు రకాలుగా పార్టీకి ఆయన సేవలు కలిసొస్తున్నాయి. ఖర్గేతో దాదాపు ఆరేడు సభలను ఇక్కడ కాంగ్రెస్​ నేతలు నిర్వహించారు. వారితో పాటు కర్నాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, మైనారిటీ లీడర్లను తీసుకొచ్చి కర్నాటకలో ఏం చేస్తున్నారో చెప్పిస్తున్నారు. హామీల అమలును ప్రజలకు వివరిస్తున్నారు. మంగళవారం కర్నాటక మంత్రి దినేశ్​ గుండూరావు, కర్నాటక ఎమ్మెల్యే దేవేంద్రప్ప రాష్ట్రానికి వచ్చారు. మంత్రి దినేశ్​ గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడగా.. ఎమ్మెల్యే దేవేంద్రప్ప చెన్నూరులో వివేక్​ వెంకటస్వామి తరఫున ప్రచారం చేశారు. కర్నాటకలో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు.